Share News

‘సహకార’ నియామకాలపై ఉత్కంఠ..!

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:22 AM

సహకార సంఘాల పాలకవర్గాలను త్వరలో నామినేట్‌ చేయాలని కేబినె ట్‌ తీర్మానించడంతో అధికార కాంగ్రెస్‌ నాయకుల్లో సందడి మొదలైంది. సహకార పదవులు దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

‘సహకార’ నియామకాలపై ఉత్కంఠ..!

నియామకాల విధి, విధానాల ఉత్తర్వుల కోసం ఎదురుచూపు

పదవుల కోసం ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ నాయకుల ప్రయత్నాలు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): సహకార సంఘాల పాలకవర్గాలను త్వరలో నామినేట్‌ చేయాలని కేబినె ట్‌ తీర్మానించడంతో అధికార కాంగ్రెస్‌ నాయకుల్లో సందడి మొదలైంది. సహకార పదవులు దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మూడంచెల సహకార వ్యవస్థలో పీఏసీఎ్‌సలు, డీసీసీబీలు, టెస్కాబ్‌ పాలకవర్గాలతోపాటు, డీసీఎంఎస్‌, మార్క్‌ఫెడ్‌ పాలకవర్గాలను ప్రభు త్వం నియమించాల్సి ఉంది. అయితే ఈ నియామకాలు ఎలా చేపట్టాలనే అంశంపై విధి, విధానాలు సూచిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులివ్వాల్సి ఉంది.

సహకార చట్టం ప్రకారం ఎన్నికలు జరిగితే పీఏసీఎ్‌సలకు 13మంది పాలకవర్గ సభ్యులను ఎన్నుకుంటా రు. అందులోనుంచి ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, మరో బీసీ సభ్యులుండేలా చూసేవారు. వీరిలో నుంచే ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్‌చైర్మన్‌గా ఎన్నుకునేవారు. ఓటింగ్‌ ద్వారా ఎన్నికయ్యే పాలకవర్గాలకు తొలుత ఆరేళ్ల పదవీ కాలం ఇచ్చి, ద్వైపాక్షిక విధానంలో రెండేళ్లకోసారి మూడోవంతు సభ్యులు రిటైర్‌ అయ్యేలా తొలు త చట్టం చేసినా, ఆ తర్వాత దాన్ని మార్చి అయిదేళ్ల పదవీకాలాన్ని నిర్దారించారు. ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నిక లు లేకుండా పాలకవర్గాలను నామినేట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఏ ప్రాతిపదికన నియామకాలు చేపడతారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక జీవో విడుదలవుతుందని సహకారశాఖ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల తరహాలోనే 13మంది సభ్యులను నియమిస్తారా.? లేక చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌తోపాటు, మరో ముగ్గురు డైరెక్టర్లను నియమిస్తారా? అనే అంశాలపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. మార్కెట్‌ కమిటీల తరహాలో 12మంది సభ్యులను నియమిస్తారని, రైతులుగా ధృవీకరణ పొం ది, సహకార సంఘాల్లో సభ్యులుగా నమోదై ఉండడం ప్రాథమిక అర్హతగా నిర్దారిస్తారని భావిస్తున్నారు. రెండోదశలో ఉండే డీసీసీబీ, డీసీఎంఎ్‌సలకు పరోక్ష పద్ధతిలో డైరెక్టర్లను ఎన్నుకునేవారు.

డీసీసీబీకి 21 మంది, డీసీఎంఎ్‌సకు 12మంది డైరెక్టర్లను సహకార సంఘాల అధ్యక్షులనుంచి ఎన్నుకుంటే, ఈ డైరెక్టర్లలో ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకునేవారు. ప్రస్తుతం నామినేటెడ్‌ విధానం అమల్లోకి వస్తే సహకార చట్టంలో ఉన్న ప్రకార మే ఇక్కడ కూడా డైరెక్టర్ల సంఖ్యను నిర్దారిస్తారా.? లేక అయిదుగురికి చొప్పున పరిమితం చేస్తారా? అనే అం శం తేలాల్సి ఉంది. డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గ డైరెక్టర్లను కూడా చట్టం ప్రకారమే పీఏసీఎస్‌ చైర్మన్ల నుంచే ఎన్నుకుంటారా? లేక పీఏసీఎస్‌ ఛైర్మన్లతో సం బంధం లేకుండా ఈ పదవులకు నేరుగా నియామకా లు చేస్తారా? అనే అంశం పై కూడా సస్పెన్షన్‌ కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి వీటన్నింటిపైనా స్పష్టమైన ఉత్తర్వులు వస్తే తప్ప సహకార పదవుల నియామకా ల ప్రక్రియ మొదలవనుండడంతో ఈ ఉత్తర్వులకోసం ఆశావాహులు చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పదవుల కోసం కాంగ్రెస్‌ నేతల పోటాపోటీ...

సహకార పదవులను నామినేట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ పదవులన్నీ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులకే దక్కనున్నాయి. ఉమ్మడి జిల్లా లో 108 ప్రాథమిక వ్యవసాయసహకార సంఘాలుండగా, ఒక డీసీసీబీ, ఒక డీసీఎంఎస్‌ పాలకవర్గాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పీఏసీఎస్‌ డైరెక్టర్ల పదవులు, చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులను ఆశిస్తూ ఎమ్మెల్యేల అనుచరులు, గత పదేళ్లలో పార్టీని నమ్ముకొని పనిచేసిన సీనియర్‌ నాయకులు గురిపెట్టుకోగా, డీసీసీబీ డైరెక్టర్లు, డీసీసీబీ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులతోపాటు డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైౖర్మన్‌ పదవులకోసం సైతం ద్వితీయ శ్రేణి నాయకులు అధికసంఖ్యలోనే పోటీపడుతున్నారు. ఈ పదవులన్నీ నామినేటెడ్‌ నియామకాలు కావడంతో మంత్రు లు, ఎమ్మెల్యేల అనుచరులు, కీలకనేతలంతా వీటిని ఆశిస్తూ ఇప్పటికే రంగంలోకి దిగగా, గైడ్‌లైన్స్‌ వస్తే ప్రయత్నాలు మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు.

Updated Date - Apr 27 , 2026 | 12:22 AM