Share News

అక్కడ అన్నీ పెండింగే!

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:24 AM

మిర్యాలగూడ నియోజకవర్గంలో కీలక నేతల నడుమ కోల్డ్‌వార్‌తో పార్టీ పదవులు, నామినేటెడ్‌ పదవుల నియామకాల్లో జాప్యంపై కార్యకర్తల్లో అసహనం నెలకొంటోంది. మితిమీరిన రాజకీయ జోక్యంతో డీఎస్పీ పోస్టు సైతం నెలన్నర రోజులుగా అధికారిని నియమించలేని పరిస్థితిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అక్కడ అన్నీ పెండింగే!

మిర్యాలగూడ నియోజకవర్గంలో నేతల కోల్డ్‌వార్‌

తేలని నామినేటెడ్‌ పోస్టులు

డీఎస్పీ పోస్టుపైనా రాజకీయ నీడ

పార్టీ పదవుల్లోనూ ఏకాభిప్రాయం కరువు

అధిష్ఠానం జోక్యం చేసుకోవాలంటున్న క్యాడర్‌

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, నల్లగొండ): మిర్యాలగూడ నియోజకవర్గంలో కీలక నేతల నడుమ కోల్డ్‌వార్‌తో పార్టీ పదవులు, నామినేటెడ్‌ పదవుల నియామకాల్లో జాప్యంపై కార్యకర్తల్లో అసహనం నెలకొంటోంది. మితిమీరిన రాజకీయ జోక్యంతో డీఎస్పీ పోస్టు సైతం నెలన్నర రోజులుగా అధికారిని నియమించలేని పరిస్థితిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసెంబ్లీ, లోక్‌సభ, పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల్లో పార్టీ విజయాలకు కృషి చేసిన ద్వితీయశ్రేణి, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఇవ్వాల్సిన నామినేటెడ్‌ పోస్టుల నియామకాలను రెండేళ్లుగా ఇక్కడ పెండింగ్‌లో ఉంది. చివరికి పార్టీ సంస్థాగత పదవుల నియామకాలనూ పెండింగ్‌లో ఉంచడంపై క్యాడర్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నేతృత్వంలో నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి, ప్రతీ పదవికి రెండేసి ప్రతిపాదనలు చేస్తుండడం, అధిష్ఠానం ఏకాభిప్రాయంతో రావాలని సూచిస్తుండం పెండింగ్‌కు ప్రధాన కారణంగా కార్యకర్తల్లో చర్చసాగుతోంది. వర్గ విభేదాలతో రెండు మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలు, పార్టీపరంగా రెండు బ్లాక్‌, నాలుగు మండల కమిటీలు, మునిసిపాలిటీలో కోఆప్షన్‌ సభ్యుల నియామకాలకు బ్రేక్‌పడడంపై ఆశావహుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.

భర్తీకాని డీఎస్పీ పోస్టు

మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లోని నాలుగు సర్కిళ్లు, 11 పోలీ్‌సస్టేషన్లు ఉన్న ఈ సబ్‌డివిజన్‌లో నిరంతరం నిఘా, శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన కీలక అధికారి పోస్టు నెలన్నర రోజులుగా ఖాళీగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర సరిహద్దు, వాణిజ్యపరంగా రాష్ట్రస్థాయి ప్రాధాన్యం ఉన్న ప్రాంతంతో పాటు, రాజకీయంగానూ ప్రాబల్యం కలిగిన ప్రాంతమవడంతో ఇక్కడ డీఎస్పీ పోస్టింగ్‌ దక్కించుకునేందుకు పోలీ్‌సవర్గాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటోంది. ఈ పోస్టు నియామకం కోసం కీలక నేతలను ఆశావహ అధికారులు సంప్రదిస్తున్నా, కీలకమైన ముగ్గురు నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఇక్కడి నియామకం పెండింగ్‌లో పడింద నే చర్చ సాగుతోంది. జిల్లాలో గతంలో వివిధ హోదాల్లో పనిచేసిన సమర్థులైన పోలీసు అధికారులు, పోలీ్‌సశాఖలో కీలకమైన విభాగా ల్లో పనిచేసిన ఏడెనిమిదిమంది ఈ పోస్టును దక్కించుకునేందుకు అటు పోలీ్‌సశాఖ ఉన్నతాధికారుల ద్వారా, ఇటు ఈ ప్రాంతంలోని కీలక నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయ నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినా, రాకపోయినా కీలకమైన డీఎస్పీ పోస్టుకు నెలన్నరరోజులుగా ఇన్‌చార్జితో కాలం వెళ్లదీయడం మాత్రం పోలీ్‌సశాఖలో సరైన సంప్రదాయం కాదనే విమర్శలు వస్తున్నాయి.

మార్కెట్‌ కమిటీల్లో నియామకాలను తేల్చుకోలేని పరిస్థితి

నియోజకవర్గంలో మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీతో పాటు, ఇటీవల కొత్తగా ఏర్పాటైన దామరచర్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి పాలకవర్గాల నియామకాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. రైస్‌ ఇండస్ట్రీ మిర్యాలగూడ వ్యవసాయమార్కెట్‌ కమిటీ పరిధిలోకి వస్తుండడంతో ఈ కమిటీ చైర్మన్‌ పదవికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు దక్కనుండడంతో పోటీ ఎక్కువగా ఉంది. గత పాలకవర్గాన్ని రద్దుచేసి, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌చేసి రెండేళ్లు గడిచినా పాలకవర్గాన్ని నియమించలేదు. ఇతర మార్కెట్‌ కమిటీల మాదిరిగా నోటిఫికేషన్‌ ఇచ్చిన వెంటనే నియామకాలు చేసి ఉంటే, ఈ టర్మ్‌లో రెండు కమిటీలకు అవకాశం దక్కేదని, నియామకాలు చేపట్టకపోవడంతో కాలయాపన జరిగి ఒక్క టర్మ్‌కే పరిమితం కావాల్సి వస్తోందనే విమర్శలు వస్తున్నాయి. మార్కెట్‌ కమిటీకి గత ప్రభుత్వ హయాంలోనూ ఇదే రీతిలో రిజర్వేషన్లు ఖరారయ్యాక రెండేళ్లకు పైగా నాన్చుతూ చివరిలో పదవి ఇవ్వడం, ఆ తర్వాత ప్రభుత్వ గడువు ముగిసిపోవడం వంటి పరిస్థితులు కొనసాగాయి. అదే పరిస్థితి ఇప్పుడూ పునరావృతమవడంపై కాంగ్రెస్‌ నాయకుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. చైర్‌పర్సన్‌ పదవికి కాంగ్రె్‌సలోని ముఖ్యనాయకుల కుటుంబీకులే రేసులో ఉన్నప్పటికీ ఎవరిని ఎంపికచేయాలనే అంశంలో కీలక నేతలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నట్టు తెలుస్తోంది. మిర్యాలగూడ కమిటీ నియామకం తేలితే, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని దామరచర్ల కమిటీని నియమించే అవకాశం ఉండడంతో ఆ కమిటీని సైతం నియమించే పరిస్థితి లేకుండా పోయిందనే అభిప్రాయం కాంగ్రెస్‌ శ్రేణుల్లో వెల్లడవుతోంది.

బ్లాక్‌, మండల కమిటీల నియామకాల్లోనే అదే ధోరణి

ఇటీవల జిల్లాలో డీసీసీ కార్యవర్గంతో పాటు, పలు బ్లాక్‌, మండల కాంగ్రెస్‌ కమిటీల నియామకాలు పూర్తయ్యాయి. ఈ నియోజకవర్గంలో మాత్రం కేవలం మాడుగులపల్లి మండల కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి మినహా మిగిలిన రెండు బ్లాక్‌ కమిటీలు, ఒక పట్టణ కమిటీ, మరో నాలుగు మండల కమిటీల నియామకాలతో పాటు, నియోజకవర్గం నుంచి డీసీసీలో పదవులకు ఎవరినీ నియమించలేకపోయారు. ఎక్కడ ఎవరికి పదవి ఇవ్వాలనే విషయంలో నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతల నడుమ ఏకాభిప్రాయం రాకపోవడం, తమ అనుచరులకు అవకాశాలివ్వాల్సిందేనని పోటాపోటీగా ప్రతిపాదనలు చేయడంతో అధిష్ఠానం ఈ నియమకాలను పెండింగ్‌లో పెట్టింది. గత పార్టీ కమిటీల్లోనూ రెండు వర్గాలు పోటీ కమిటీలు నియమించి కొనసాగించగా, ఈ సారి సైతం ఏకాభిప్రాయం రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. వీటితోపాటుగా మిర్యాలగూడ మునిసిపాలిటీలో నాలుగు కోఆప్షన్‌ పదవులకు సైతం 28మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో ఎవరిని ఎంపికచేయాలనే అంశంలో తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నియమకాలు సైతం పెండింగ్‌లోనే ఉండడం వర్గ విభేదాలకు దర్పణం పడుతోంది.

Updated Date - Jul 22 , 2026 | 12:24 AM