జనగణన-2027కు సర్వం సిద్ధం
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:35 AM
పదహారేళ్ల తర్వాత మళ్లీ చేపట్టనున్న జనగణనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు జనగణన కీలకం కావడంతో కేంద్రం కూడా ఇప్పటికే నియమ నిబంధనలు రూపొందించింది.
మే 11 నుంచి క్షేత్రస్థాయి సమాచార సేకరణ
చార్జ్ అధికారులు, క్లర్క్‌లు, టెక్నికల్ అసిస్టెంట్లకు శిక్షణ పూర్తి
- (ఆంధ్రజ్యోతి-యాదాద్రి): పదహారేళ్ల తర్వాత మళ్లీ చేపట్టనున్న జనగణనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు జనగణన కీలకం కావడంతో కేంద్రం కూడా ఇప్పటికే నియమ నిబంధనలు రూపొందించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణ అమలు చేయనున్నారు. మే 11 నుంచి క్షేత్రస్థాయి సమాచార సేకరణ చేయనున్నారు.
దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో అత్యంత కీలకమైన జనగణన-2027ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనుండటంతో జిల్లాస్థాయిలో విజయవంతంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. రాష్ట్రంలో జనగణనను 2027 ఫిబ్రవరి నుంచి నిర్వహించనున్న నేపథ్యంలో తొలిదశలో క్షేత్రస్థాయి సమాచార సేకరణను మే 11వ తేదీ నుంచి చేపట్టనుంది. జిల్లాలోని 427 గ్రామపంచాయతీలు, ఆరు ము నిసిపాలిటీల్లోని 104 వార్డుల్లో ఇళ్ల జాబితాలను తయారుచేసి, ఆ కుటుంబాల్లోని వారి జీవనస్థితిగతులను గుర్తించే ప్రక్రియను ప్రా రంభించనున్నారు. జనగణనను విజయవంతం చేయడానికి జిల్లా ప్రధాన జనగణన అఽధికారిగా కలెక్టర్ అనురాగ్‌జయంతి, ఆయన కు సహాయ ముఖ్య జిల్లా జనగణ న అధికారిగా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ఎ.భాస్కర్‌రావు వ్యవహరించనున్నారు. వీరి ఆధ్వర్యంలో ఈ జనగణన తొలిదశ క్షేత్రస్థాయి గృహాల జాబితా రూపకల్పనకోసం భువనగిరి, చౌటుప్పల్ డివవిజన్ స్థాయిలో రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎం.కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డితోపాటు జిల్లా ప్లానింగ్ అధికారి, డీపీవో, డీఎ్‌ఫవో, జడ్పీ సీఈవో, డీఐసీ, ఎస్‌వో, డీఈవోతో కలిపి 10 మంది అధికారులు ఇళ్ల జాబితా, ఆ కుటుంబాల జీవనస్థితిగతుల నమోదును పర్యవేక్షించనున్నారు.
జిల్లాలో అధికారులకు శిక్షణ పూర్తి
జనగణన తొలిదశ ఇళ్ల జాబితా రూపొందించడానికి చార్జీ అధికారులుగా బాధ్యతలు నిర్వహించే తహసీల్దార్లు, అదనపు చార్జ్ అధికారులు ఎంపీడీవోలకు చార్జీ క్లర్క్‌లుగా విధులు నిర్వహించే అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు, సీనియర్ అసిస్టెంట్లకు ఇప్పటి కే శిక్షణ పూర్తిచేశారు. గృహాల జాబితాను రూపొందించడానికి మ్యాపింగ్ రూపొందించడానికి టెక్నికల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్లకు శిక్షణ అం దించడానికి ఫీల్డ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని మార్చి 28 నుంచి 30వ తేదీ వరకు కలెక్టరేట్‌లో పూర్తిచేశారు. ఈ ఫీల్డ్ ట్రైనర్లు పాఠశాలల ఆఖరి పనిదినం తర్వాత వేసవి సెలవుల్లో ఎన్యుమరేటర్లకు సూపర్‌వైజర్లకు మండలాలవారీగా శిక్షణ అందించనున్నారు.
మే11 నుంచి క్షేత్రస్థాయి సమాచార సేకరణ
జనగణన-2027 ప్రక్రియలో మే 11నుంచి తొలిదశ ప్రారంభం కానుంది. జూన్ 9వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో సర్వేబాట పట్టనున్నారు. ఆయా గ్రామాలు, మునిసిపాలిటీల్లో ఎన్ని గృహాలు ఉన్నాయో.. గుర్తించి, ప్రాంతాలవారీగా చిత్రపటాలను రూపొందిస్తారు. ఈ దశలో కుటుంబ పెద్దకు ఐడీ క్రియేట్ చేస్తారు. ఈ ఐడీ కింద కుటుంబ జీవన స్థితిగతులను గుర్తిస్తారు. 2027 ఫిబ్రవరిలో రెండో దశలో జనగణన సర్వే చేపడతారు. ఈ రెండో దశలో మాత్రమే కుటుంబంలోని ఇతర సభ్యుల వివరాలను నమోదుచేస్తారు. తొలి దశలో నివాస గృహం ఏ రకమైంది. వాహనాలు, ఆహారపు అలవాట్లతోపాటు 33 రకాల ప్రశ్నలు ఉండనున్నాయి. ఈ సర్వేలో శాటిలైట్ అనుసంధానంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. ఎక్కడా పెన్నూ, పేపర్ వాడకుండా పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే సేకరణ కొనసాగుతుంది. సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌లో ఈ సమాచారం నిక్షిప్తం చేయనున్నారు.
జిల్లాలో 427 పంచాయతీలు.. ఆరు మునిసిపాలిటీలు
జిల్లాలో 17 మండలాల్లో 427 గ్రామపంచాయతీలు, ఆరు మునిసిపాలిటీల్లో జనగణన సర్వే జరగనుంది. వీటి పరిధిలోని గృహాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయి సర్వేలో పాల్గొనే ముఖ్యమైన ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల నియామకం జరగాల్సి ఉంది. ప్రతీ 800 జనాభాకు ఒక ఎన్యుమరేటర్ అవసరమని భావిస్తున్నారు. ప్రతీ ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 7,70,833 జనాభా ఉండగా, అందులో మహిళలు 3,80,341 కాగా, పురుషులు 3,90,482 మంది ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 1,88,520 గృహాలుండగా, ఎఫెక్ సర్వే ప్రకారం 2.14లక్షలు ఉన్నట్లు తేలింది. ఈ గృహాల సంఖ్య పెరుగుదల ఆధారంగా జనాభాలో సైతం 20శాతం నుంచి 30 శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా.
జనగణన-2027 అధికార యంత్రాంగం ఇలా..
ముఖ్య జనగణన అధికారి : కలెక్టర్
అదనపు అధికారి : అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)
జిల్లా గణాంక అధికారులు : 12 (10మంది జిల్లా
అధికారులు+ ఇద్దరు ఆర్డీవోలు)
చార్జ్ ఆఫీసర్లు : 23 (17మంది తహసీల్దార్లు+
ఆరుగురు మునిసిపల్ కమిషనర్లు)
అదనపు చార్జ్ ఆఫీసర్లు : 23( 17మంది ఎంపీడీవోలు+
ఆరుగురు ఎంపీవోలు)
చార్జ్ క్లర్క్స్ : 23 (17మంది ఏఎస్‌వోలు+
ఆరుగురు సీనియర్ అసిస్టెంట్లు)
టెక్నికల్ అసిస్టెంట్లు : 25 (అవుట్ సోర్సింగ్)
ఫీల్డ్ ట్రైనర్స్ : 25 మంది
ఎన్యుమరేటర్లు : ప్రతి 800 మందికి ఒకరు
సూపర్‌వైజర్లు : ప్రతి ఆరుగురు
ఎన్యుమరేటర్లకు ఒకరు
2011 జనాభా లెక్కలు ఇలా..
జనాభా : 7,70,833
మహిళలు : 3,80,341
పురుషులు : 3,90,482
కుటుంబాలు : 1,88,520