మా తప్పే అయినా.. కరెంట్ కట్
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:16 AM
విద్యుత్ మీటర్ రీడింగ్‌లో లోపం ఓ వినియోగదారుడికి శాపంగా మారింది. వేలల్లో బిల్లులు రాగా చెల్లించకపోవడంతో విద్యుత సరఫరాను నిలిపివేశారు. తప్పని తెలిసినా విద్యుత సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పడంలేదు.
ఇంటికి రూ.80వేల విద్యుత్ బిల్లు
మీటర్ రీడింగ్‌లో లోపంతో అధికబిల్లు
అంగీకరిస్తూనే విద్యుత సరఫరా నిలిపేసిన అధికారులు
హుజూర్‌నగర్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్ మీటర్ రీడింగ్‌లో లోపం ఓ వినియోగదారుడికి శాపంగా మారింది. వేలల్లో బిల్లులు రాగా చెల్లించకపోవడంతో విద్యుత సరఫరాను నిలిపివేశారు. తప్పని తెలిసినా విద్యుత సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పడంలేదు. ఈ ఉదంతం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగింది. పట్టణంలోని గాంధీపార్క్ సెంటర్‌లోని వనం సత్యావతి నివాసంలో ఎర్రగొర్ల గంగరాజు కుటుంబం నాలుగేళ్లుగా అద్దెకు ఉంటోంది. ప్రతి నెలా సుమారు రూ.500 నుంచి రూ.600 బిల్లు వస్తోంది. గంగరాజు ప్రతి నెలా బిల్లు చెల్లిస్తున్నారు. రెండు నెలలుగా కరెంట్ బిల్లు రూ.60 వేలు, రూ.79వేలు చొప్పున విధిస్తున్నారు. కాగా ఏప్రిల్ మొదటి వారంలో మరో రూ.559లు కలిపి ఏకంగా రూ.80,404 బిల్లు వచ్చింది. గతంలో బాధితుడు గంగరాజు అధికారులను సంప్రదించగా మీటర్ మార్చారు. అయినప్పటికీ మరోసారి రూ.80వేల పైచిలుకు బిల్లు వచ్చింది. కాగా మొత్తం చెల్లించాలని అధికారులు తెగేసి చెప్పారు. పెద్దమొత్తంలో కట్టడం తనవల్ల కాదని చెప్పడంతో శుక్రవారం ఉదయం విద్యుత్ అధికారులు ఇంటికి విద్యుత సరఫరా నిలిపివేశారు. దీంతో బాధితుడు గంగరాజు లబోదిబో మంటున్నాడు. అధికారుల తప్పిదం వల్ల బిల్లు ఎక్కువ వచ్చిందని బాధితుడు పేర్కొంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత సరఫరా లేకపోవడంతో తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోందని గంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా రీడింగ్‌లో తేడాలు ఉండడంతో అధిక బిల్లు వచ్చిందని, మూడురోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఏఈ రాంప్రసాద్ తెలిపారు. అయితే మూడురోజుల వరకు విద్యుత సరఫరా ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు.