వినోదం.. విజ్ఞానం
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:11 AM
ప్రభుత్వ పాఠశాలలో ఐదేళ్లు అంతకంటే ఎక్కువ వయ స్సున్న విద్యార్థులను మాత్రమే పాఠశాలలో చేర్చుకుంటారు.
ప్రైవేట్‌కు దీటుగా ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు
ఆహ్లాదం, ఆటపాటలతో విద్యపై ఆసక్తి పెంపునకు ప్రయత్నం
ప్రభుత్వ పాఠశాలలో ఐదేళ్లు అంతకంటే ఎక్కువ వయ స్సున్న విద్యార్థులను మాత్రమే పాఠశాలలో చేర్చుకుంటారు. అంతకన్నా చిన్నవయస్సు నుంచే తల్లిదండ్రులు పాఠశాలలకు తమ పిల్లలను అలవాటు చేస్తున్నారు. ఈ క్రమంలో నర్సరీ స్థాయి నుంచి విద్యను అందిస్తున్న ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపిస్తున్నారు. ఆ తర్వాత ప్రైవేట్‌లోనే విద్యనభ్యసిస్తున్నారు. దీంతో కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుముఖం పడుతూ వస్తోంది. దీనిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటుచేసింది. అందంగా తీర్చిదిద్దిన ఈ స్కూళ్లలో వినోదంతో కూడి విజ్ఞానాన్ని అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గుచూపేలా కృషి చేస్తోంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 40 ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేసింది.
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట అర్బన)
ప్రభుత్వ విద్య బలోపేతమే లక్ష్యంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ(పూర్వ ప్రాథమిక) పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించింది. అందుకు అనుగుణంగా నిధులు మంజూరుచేసింది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వంటి కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో టీచర్‌కు రూ.8వేలు, ఆయాకు రూ.6 వేల చొప్పున ప్రతి ఏడాదిలో 10 నెలలకు చెల్లిస్తోంది. నూతన ప్రీప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థులకు ఆకర్షణీయమైన, శ్రద్ధ పెంచేలా విద్యా వాతావరణం అవసరమని భావించి బోధన సామాగ్రి, తరగతి గదుల అలంకరణ, మల్టీమీడియా కిట్లు, శానిటేషన వంటి అవసరాల కోసం నిధులను విడుదలచేసింది. వీటితో చిన్నారులకు ఆటపాటలతో, చిత్రాలతో, రైమింగ్, లెర్నింగ్ కిట్లతో నేర్పే ప్లే వే విధానం అమలుస్తోంది.
సూర్యాపేట జిల్లాలో 40 పాఠశాలలు
సూర్యాపేటలో జిల్లాలో మొత్తం 30 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయి. వీటితో మరో 10 పీఎం శ్రీ పాఠశాలలను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా ఎంపికచేశారు. ఇందులో 30 పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నడుపనున్నారు. 10పాఠశాలలు 60శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నాయి. ఒక్కో పాఠశాలకు బోధన సామాగ్రి, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల అవసరాలకు రూ.1.70 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి.
ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన
ప్రీ ప్రైమరీలో చేరే విద్యార్థులు నాలుగేళ్లు నిండిన వారై ఉండాలి. అంగనవాడీ కేంద్రంలోని పిల్లలను ప్రీ ప్రైమరీకి పంపిస్తారు. ప్రీ ప్రైమరీ కోసం పాఠశాలల్లోనే ఒక గదిని కేటాయించి గది ఆహ్లాదం పంచేలా అందంగా అలంకరించడం, గోడలపై అక్షరాలు, బొమ్మలతో తీర్చిదిద్దారు. ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విషయాలపై సమావేశాలు నిర్వహిస్తూ, పాఠశాల నిర్వహణను సక్రమంగా చేపడుతున్నారు.