ఉద్యోగుల పోరుబాట
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:08 AM
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు పోరుబాట పట్టేందు కు నిర్ణయించారు. దశలవారీగా జరిగే ఈ పోరుబాటలో భాగంగా ఈనెల 17 శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల, డివిజన్ కేంద్రాలతో పాటు కలెక్టరే ట్ ఎదుట నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు.
నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు
నాలుగు ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
మే 5 తరువాత ఉద్యమ ఉధృతికి సన్నాహాలు
నల్లగొండలో జేఏసీ నేతల అభివాదం
(ఆంధ్రజ్యోతి, నల్లగొండ): కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు పోరుబాట పట్టేందు కు నిర్ణయించారు. దశలవారీగా జరిగే ఈ పోరుబాటలో భాగంగా ఈనెల 17 శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల, డివిజన్ కేంద్రాలతో పాటు కలెక్టరే ట్ ఎదుట నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు.
దశల వారీగా ఆందోళనను ఉధృతం చేయడంతో పాటు మే5 తరువాత ఉద్యమాన్ని మరింతగా ముం దుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మిక, పెన్షనర్స్ జా యింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా విడివిడిగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు సమస్యల పరిష్కా రం కోసం ఏకమై జేఏసీగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలనివీరి ప్రధా న డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ విరమణ చేసిన 206మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు బెనిఫిట్స్ అందకముందే మృతిచెందారని జేఏసీ నేతలు పేర్కొంటున్నారు.
నాలుగు ప్రధాన డిమాండ్లు
రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా తెలంగాణ ఉద్యో గ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మిక, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాలుగు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టింది. ప్రభుత్వం రెండో పీఆర్‌సీ కమిషన్ నివేదిక తెప్పించి జూన్ 2లోపు అమలు చేయాలని ప్రధానంగా డిమాం డ్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రెండో పీఆర్‌సీ కమిటీ ఏర్పాటు చేసి 30 నెలలు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులకు 51శాతం ఫిట్‌మెంట్‌తో ఈ పీఆర్‌సీని అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా పీఆర్‌సీ కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొడిగించవద్దని, తక్షణమే నివేదికను తెప్పిం చి అమలు చేయాలన్నది ఉద్యోగుల ప్రధాన డిమాం డ్. అంతేగాక పెండింగ్ బిల్లుల విడుదల కోసం సైతం కొంత కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రభు త్వం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బిల్లులను నెలకు రూ.700కోట్లు విడుదల చేస్తున్నా, రాష్ట్రంలోని అన్ని జిల్లాలో నెలకు సగటున 600మంది వరకు ఉద్యోగు లు ఉద్యోగ విరమణ చెందుతుండటంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏకమొత్తంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.13,000కోట్లను విడుదల చేయాలని రెండో డిమాండ్‌గా కోరుతున్నారు. అదేవిధంగా మూడో డిమాండ్ చాలాకాలం గా ఉద్యోగులు, పెన్షనర్లు హెల్త్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ ఆరోగ్య కార్డులపై మంత్రివర్గ ఉప కమిటీ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. దీన్ని వెంటనే అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలుమార్లు జేఏసీ నేతలతో జరిగిన సమావేశంలో స్పష్టత ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. దీం తో ఉద్యోగులు, పెన్షనర్‌లు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా ఈహెచ్‌ఎ్‌స స్కీం విధివిధానాలను రూపొందించి మే 1 నుంచే ఉద్యోగులు పెన్షనర్‌లకు తక్షణ వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నాలుగో డిమాండ్ రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్(సీపీఎ్‌స) విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీంను (ఓపీఎస్) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. 2004 సెప్టెంబరు 1వ తేదీకి ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీంను వర్తింపజేయాలని కోరుతున్నారు. ఈ ప్రధాన నాలుగు డిమాండ్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మరో 64 సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని సైతం పరిష్కరించాలని ఉద్యోగ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మే 5 తర్వాత ఉద్యమ ఉధృతికి కార్యాచరణ
ఉద్యోగుల పోరాటంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో మే 5 తరువాత ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు నిర్ణయించారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన జేఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై అంతా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం జరిగే నిరసన కార్యక్రమం గురించి గురువారం కలెక్టర్ చంద్రశేఖర్‌కు ఉద్యోగుల జేఏసీ నాయకులు నోటీసులు అందజేశారు. తాము చేస్తున్న పోరాటంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు మే 5 తరువాత కార్యచరణను తీవ్రతరం చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ యోచిస్తోంది. గురువారం నల్లగొండలో జరిగిన సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సుంకరి భిక్షంగౌడ్, మారం అంజిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, జె.శేఖర్‌రెడ్డి, యాకుబ్‌నాయక్, కాళం నారాయణరెడ్డి, నర్రా శేఖర్‌రెడ్డి, మేకల జాన్‌రెడ్డి, ఎడ్ల సైదులు, తరాల పరమేష్, ఆంజనేయులు, నలపరాజు వెంకన్న, రణధీవే, సైదులు నాయక్, తదితరులు పాల్గొని ఉద్యమ కార్యచరణపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని వారు ప్రకటించారు.