Share News

చిగురు నిలిపేందుకు చినుకుల వాన

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:27 AM

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో వానాకాల ప్రారంభంలో రెండు, మూడు భారీ వర్షాలు కురియడంతో ముందస్తు దుక్కులు దున్నుకున్న రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నారు.

 చిగురు నిలిపేందుకు చినుకుల వాన
లెంకపల్లిలో మొక్కలకు నీటి సరఫరా కోసం డ్రిప్‌ పద్ధతిని సిద్ధం చేసిన రైతు రాధమ్మ

(ఆంధ్రజ్యోతి-మర్రిగూడ)

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో వానాకాల ప్రారంభంలో రెండు, మూడు భారీ వర్షాలు కురియడంతో ముందస్తు దుక్కులు దున్నుకున్న రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలతో విత్తులు మొలకెత్తాయి. ఆ తర్వాత వచ్చిన పత్తి మొక్కలు నెల గడుస్తున్నా ఆశించిన మేర వర్షాలు లేక వాడే దశకు చేరుకున్నాయి. ఈ దశలో మొక్కలను కాపాడుకునేందుకు స్పింకర్ల ద్వారా(తుంపర సేద్యం), డ్రిప్పుల(బిందు సేద్యం) ద్వారా నీటిని అందిస్తున్నారు. ఈ నెలలోనూ వర్షాలు కురియకపోతే మొక్కలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొహం చాటేసిన వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పత్తి సాగు ప్రారంభించి, వర్షాలు పడకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్పింకర్ల ద్వారా మొక్కలకు నీటిని అందిస్తున్నాం

వానాకాల ప్రారంభంలో పడిన వర్షాలకు నాకున్న ఐదు ఎకరాల్లో పత్తి విత్తులు వేశా. మొక్కలు ఎదిగాయి. ఆ తర్వాత వర్షాలు కురవక మొక్కలు ఎండిపోయే పరిస్థితి. వాటిని రక్షించుకునేందుకు సబ్సిడీపై స్పింకర్లు కొనుగోలుచేశా. బోరుబావి ద్వారా తుంపర్ల నీటిని అందిస్తూ కాపాడే ప్రయత్నం చేస్తున్నా.

వరికుప్పల శ్రీను, రైతు, లెంకలపల్లి గ్రామం, మర్రిగూడ మండలం

Updated Date - Jul 15 , 2026 | 12:27 AM