సాగర్ కుడి కాల్వకు తాగునీటి విడుదల
ABN , Publish Date - May 27 , 2026 | 11:56 PM
నాగార్జునసాగర్, మే27(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో కుడికాల్వలో ప్రాజెక్టు అధి కారులు సోమవారం రాత్రి తాగునీటి అవసరాల కోసం నీటి విడుదల చేశారు.
నాగార్జునసాగర్, మే27(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో కుడికాల్వలో ప్రాజెక్టు అధి కారులు సోమవారం రాత్రి తాగునీటి అవసరాల కోసం నీటి విడుదల చేశారు. ఈ నెల 14వ తేదీన హైదరాబాద్ జలసౌధలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులతో కేఆర్‌ఎంబీ(కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు) సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో సాగర్ ప్రాజెక్టు పరిధిలో కుడి కాల్వకు ఈ వేసవికాలం తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని కేటాయించింది. ఈ నీటిని మే నుంచి వచ్చే నీటి సంవత్సరం వరకు వాడుకోవచ్చునని బోర్డు సూచించింది. దీంతో ఏపీలో కుడి కాల్వ పరిఽధిలో గ్రామాల్లో తాగు నీటి అవసరాల కోసం చెరువులు, కుంటులు నింపడానికి నీటి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు కుడి కాల్వకు 10 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సాగర్ నీటిమట్టం 522.70 అడుగులు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి 522.70 అడుగులు(154.2455టీఎంసీలుగా) ఉంది. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 6,006 క్యూసెక్కుల నీటిని, జంటనగరాల తాగునీటి అవసరాల కోసం ఎస్‌ఎల్‌బీసీ ద్వా రా 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి మొత్తం 6,906 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది..