Double bedroom : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎక్కడివక్కడే!
ABN , Publish Date - May 05 , 2026 | 12:17 AM
గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు ఈ నెలలోనైనా లబ్ధిదారులకు అందడం కష్టమే. ఇటీవల వీటిపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణాలు, లబ్ధిదారుల ఎంపికతో పాటు, ఆయా కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించింది.
నెలాఖరులోగా లబ్ధి దారులకు పంపిణీచేయాలని ప్రభుత్వం నిర్ణయం
నత్తనడకన సాగుతోన్న మౌలిక వనరుల కల్పన
ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో 4,716 ఇళ్లు
ప్రత్యేక దృష్టిసారిస్తే తప్ప ముందుకుసాగని పరిస్థితి
భువనగిరి పట్టణంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు ఈ నెలలోనైనా లబ్ధిదారులకు అందడం కష్టమే. ఇటీవల వీటిపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణాలు, లబ్ధిదారుల ఎంపికతో పాటు, ఆయా కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించింది. అందుకోసం అంతర్గత రోడ్లు, విద్యుత్ సదుపాయాలు, డ్రైనేజీ నిర్మాణాలు, ఇతర పెండింగ్ పనులను పూర్తిచేసేందుకు ప్రత్యేకంగా నిధులు సైతం కేటాయించింది. అయితే ఈ పనులేవీ ఎక్కడా వేగంగా సాగకపోతుండడంతో నెలాఖరుకు లబ్ధిదారులకు ఇవ్వడం సాధ్యమయ్యేలా కన్పించడం లేదు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత ప్రభుత్వం మొత్తం 12 అసెం బ్లీ నియోజకవర్గాల పరిధిలో 20వేల ఇళ్లను మంజూరు చేసింది. అందులో 6,360 ఇళ్ల నిర్మాణం మాత్రమే ప్రారంభించారు. అందులో నిర్మాణాలు దాదాపుగా పూర్తయి, కాలనీల్లోనూ మౌలికసదుపాయాలు కల్పించిన 1,644 ఇళ్లను అసెంబ్లీ ఎన్నికలకు ముందే లబ్ధిదారులకు పంపిణీచేశారు. మిగిలిన సుమారు 4,716 ఇళ్ల నిర్మాణాలు కొన్నిచోట్ల దాదాపు పూర్తవగా, మరికొన్ని చోట్ల శ్లాబ్ పూర్తయి ఫినిషింగ్ దశలో ఉన్నాయి. ఇంకొన్నిచోట్ల శ్లాబ్ దశలో నిలిచాయి. అదేవిధంగా ఈ ఇళ్లున్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు సైతం పూర్తిగా ఏర్పాటు చేయకపోవడంతో అప్పట్లో వీటికి లబ్ధిదారులను ఎంపికచేసినా పట్టాలు అందజేయలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్, ఆ తదుపరి లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడంతో ఈ పనులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దుచేసి ఎక్కువమంది లబ్ధిదారులకు మేలు చేసేలా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చింది. వందల కోట్ల రూపాయలతో నిర్మించిన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను వృథాగా వదిలేస్తే శిథిలావస్థకు చేరుతున్నాయని, వాటిని లబ్ధిదారులకు అందజేస్తే ప్రజాధనం సద్వినియోగమవుతుందనే సూచనలతో ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి సగటున రూ.1లక్ష వరకు నిధులు కేటాయించి ఆయా పనులు చేపట్టింది. ఈ పనులన్నింటినీ నెలాఖరులోగా పూర్తిచేసి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలివ్వాలని ప్రభుత్వం బలంగా సంకల్పించినా పనుల పురోగతి లేకపోవడంతో ఇళ్ల పంపిణీ జరగడం కష్టసాధ్యంగా కనిపిస్తోంది.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఇలా..
నల్లగొండ నియోజకవర్గంలో నల్లగొండ కార్పొరేషన్, అన్నారెడ్డిగూడెం, దోమలపల్లి, చర్లగౌరారం, పొనుగోడు, తిప్పర్తికి మొత్తం 1,400 ఇళ్లను మంజూరు చేశారు. అందులో అన్నారెడ్డిగూడెంలో 75 ఇళ్లను నిర్మించి 2023లోనే లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా నల్లగొండ సిటీలో 552 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయినా మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం తో లబ్ధిదారులను ఎంపికచేసినా ఇళ్లను స్వాధీనపరచలేదు. వీటిలో 341 ఇళ్లకు లక్కీడిప్ ద్వారా, మరో 121 మందికి వివిధ రికమండేషన్ల ద్వారా ఇళ్లను మంజూరు చేశారు. ఇక్కడ జీ+2లో ఇళ్లను నిర్మించారు. విద్యుత్ కనెక్షన్ ఇచ్చినా, తాగునీటి ట్యాంకులు లేకపోవడంతో ప్రస్తుతం వాటి నిర్మాణం దాదాపు పూర్తవగా ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఇటీవలే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంక్‌ను నిర్మించారు. అంతర్గత రోడ్లు పెండింగ్ ఉన్నాయి. ఈ పనులన్నీ పూర్తయితే లబ్ధిదారులకు ఇళ్లతాళాలు అప్పగించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. కనగల్, తిప్పర్తి, చర్లగౌరారం, దోమలపల్లిలో ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయినా మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరుగుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు.
ఫ నకిరేకల్ నియోజకవర్గంలో నార్కట్‌పల్లి, చిట్యాల, కట్టంగూరు మండలాల్లో 728 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, 450 ఇళ్లు పూర్తయ్యాయి. మరో 278 ఇళ్లు అసంపూర్తిగా నిలిచిపోయాయి. నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లిలో 56 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. కట్టంగూరు మండలం అయిటిపాములలో డబల్‌ఇళ్లకు కేటాయించిన స్థలంపై వివాదం చెలరేగి హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఇళ్ల నిర్మాణాలు నిలిచాయి. చిట్యాల మ ండలం వట్టిమర్తి సహా ఇతర కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయినా మౌలిక సదుపాయాల్లేకపోవడంతో ఇటీవల ఆ పనులు ప్రారంభించినా అవి మందకొడిగానే సాగుతున్నాయి. వీటితో పాటు అసంపూర్తిగా నిలిచిన ఇళ్లకు సైతం నిధులిచ్చి పనులు పూర్తిచేయించి లబ్ధిదారులకు ఇళ్లను అందజేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఫ దేవరకొండ నియోజకవర్గంలో చింతపల్లి మండలం నలువలపల్లిలో 20 మంది లబ్ధిదారులకు ఇటీవల ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ ఇళ్లు గత ప్రభుత్వ హయాంలోనే మంజూరైనా నిర్మాణాలు చేపట్టలేకపోయారు. అయితే ఇటీవల లబ్ధిదారులే ఇళ్లు కట్టుకుంటే బిల్లులు మం జూరు చేస్తామని హామీ ఇవ్వడంతో తాజాగా, లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకుంటున్నారు. ప్రస్తుతం నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
ఫ హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 170 ఇళ్లు మంజూరవగా, అందులో లింగగిరిలో 27 ఇళ్లు ప్రారంభం కాలేదు. మిగిలిన 143 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, మట్టంపల్లి, చింతలపాలెం, గరిడేపల్లిల్లోని 80ఇళ్లను అప్పట్లోనే లబ్ధిదారులకు అందజేశారు. మిగిలిన 63 ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన్నప్పటికీ ఇటీవల పెండింగ్ పనులు పూర్తిచేశారు. త్వరలో వీటిని అందజేయాల్సి ఉంది.
ఫ కోదాడ నియోజకవర్గంలోని కోదాడ పట్టణం బాలాజీనగర్‌లో 560 డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయినా లబ్ధిదారులకు అందజేయలేదు. ఇటీవల వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించడంతో లబ్ధిదారుల ఎంపికకు వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అదే సమయంలో ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలకల్పన పనులు చేపట్టారు. మునగాల మండల కేంద్రంలోని ఎస్సీకాలనీలో 16 డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లకు శ్లాబ్ వేసి వదిలేశారు. ఈ ఇళ్ల నిర్మాణం ఆగిపోవడంతో కొందరు వాటిలో నివాసం ఉంటున్నారు. అయితే ఇక్కడ ఇళ్ల నిర్మాణాల పూర్తికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మోతె మండలం మోతెలో 60, విభళాపురంలో 40, అ న్నారిగూడెంలో 40ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అన్నారిగూడెంలో ఇళ్ల కాలనీ వద్ద సదుపాయాల్లేకపోవడంతో లబ్ధిదారులు వినియోగించుకోకపోవడంతో ఇవి శిథిలావస్థకు చేరాయి. మోతెలో లబ్ధిదారులుగా స్థానికేతరులకు ఇచ్చారనే విమర్శలతో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ సైతం కాలనీలో మౌలిక సదుపాయాల్లేకపోవడంతో లబ్ధిదారులు పూర్తిగా ఇళ్లల్లో నివాసం ఉండలేకపోతున్నారు.
ఫ ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు, కొలనుపాక, ఆత్మకూరు (ఎం), ఉప్పలపహాడ్‌లో మొత్తం 221 ఇళ్లకు రెండు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. మోటకొండూరులో 40, వంగపల్లిలో 42 ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యింది. ఇక్కడ అసంపూర్తి పనులన్నీ పూర్తిచేశారు.
ఫ భువనగిరి నియోజకవర్గం సింగన్నగూడెంలో 444 ఇళ్లకు అనర్హులను తీసేసి కొత్తవారికి అందజేసే ప్రక్రియ ప్రారంభించారు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల కింద ఎల్-2లో ఎంపికైన లబ్ధిదారులను గుర్తించి వారికి అందజేయాలని నిర్ణయించారు. ఇక్కడ 444 ఇళ్లకు 400 ఇళ్ల నిర్మాణాలు దాదాపుగా పూర్తవగా, మిగిలిన 44 ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ఇక్కడ రూ.2.55 కోట్లతో అసంపూర్తి పనులు, తాగునీరు, డ్రైనేజీ, అంతర్గత రోడ్లు, విద్యుత్ సదుపాయాల పనులు జరుగుతున్నాయి. పోచంపల్లి మండలంలోని రేవణపల్లిలో 120 ఇళ్లల్లో అసంపూర్తి నిర్మాణాల పూర్తికి పనులు కొనసాగుతున్నాయి. కొండమడుగులో 30 ఇళ్ల పనులు పూర్తికావొచ్చాయి.
ఫ సూర్యాపేట నియోజకవర్గంలో 1,646 ఇళ్లు పూర్తికాగా, 375 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. సూర్యాపేట పట్టణ పరిధిలోని గాంధీనగర్‌లో 350, కేసారంలో 410, కుసుమవారిగూడెంలో 300 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా, మౌలికవసతులు, విద్యుత్ వంటి సదుపాయాలతో పాటు, స్వల్పంగా ఇంటి పనులు పెండింగ్ ఉన్నాయి. దీంతో వాటిని లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారు. ఇప్పటికైనా ఈ కాలనీల్లో పెండింగ్ పనులు పూర్తిచేయడంతో పాటు, మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు పంపిణీచేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.