నేటి నుంచి ‘దోస్త్’
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:10 PM
అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అందించే డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరం ప్రవేశాల ప్రక్రియను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రారంభించిం ది.
డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
దోస్త్ ఆన్‌లైన్ దరఖాస్తుల నోటిఫికేషన్ జారీ
జిల్లాలో 22 ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అందించే డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరం ప్రవేశాల ప్రక్రియను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రారంభించిం ది. ఈ నెల 15వ తేదీనుంచి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసె్‌స-తెలంగాణ(దోస్త్) ఆన్‌లైన్ విధానంలో చేపట్టడానికి అవసరమైన చర్యలను ప్రారంభించింది.
జిల్లాలో డిగ్రీ తరగతులను జూలై 1వ తేదీనుంచి ప్రారంభించే లక్ష్యంతో మూడు విడతలుగా ప్రవేశాలను పూర్తిచేయడానికి షెడ్యూల్ ఖారారు చేసింది. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్లు, ఆప్షన్లు, సీట్ల కేటాయింపులతోపాటు సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం అనుబంధంగా జిల్లాలోని 22 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలలకు దోస్త్ ఆన్‌లైన్ అప్లికేషన్ల ద్వారా డిగ్రీలోని వివిధ కోర్సుల్లో ప్రవేశాలను పొందనున్నారు.
జిల్లాలో 22 డిగ్రీ కళాశాలలు
జిల్లాలో 22 డిగ్రీ కళాశాలలున్నాయి. వీటిలో రెండు మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కాగా, మరో రెండు సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలున్నాయి. జిల్లాకేంద్రంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్, హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ యాజమాన్యంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళాశాల (ఎయిడెడ్)కాగా, జిల్లాలోని వివిధ పట్టణాల్లో 17 ప్రైవేట్ యాజమాన్యాలు నిర్వహించే డిగ్రీ కళాశాలలున్నాయి. అయితే హైదరాబాద్ నగరానికి అత్యంత చేరువలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు తదుపరి కోర్సుల కోసం ఎక్కువగా హైదరాబా ద్ నగరాన్ని ఆశ్రయిస్తుంటారు. బీటెక్, ఐఐటీ, బీఫార్మసీ, బీబీఏ వంటి వృత్తివిద్యా కోర్సులకు వెళ్లే వాళ్ల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య అంతంత మా త్రంగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు ఆందోళన కలిగిస్తోందని కళాశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ముందస్తు ప్రయత్నాలు
జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు రెండు, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు మరో రెండు ఉన్నాయి. ఆలేరు, రామన్నపేటలోని డిగ్రీ కళాశాల ప్రవేశాలు దోస్త్ ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో గురుకుల కళాశాలల కామన్ ఎంట్రన్స్ ఎలిజిబులిటీ టెస్ట్ ద్వారా చేపట్టనున్నా రు. గురుకుల కళాశాలలో ప్రవేశాలకు డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే సీట్లకు తగినట్లు ప్రవేశాలు రావడంలేదు. ఆలేరు, రామన్నపేట డిగ్రీ కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియం బీ.కాం(కంప్యూటర్స్), బీఏ(సీబీసీఎస్), బీఎస్సీ(ఫిజిక్స్), 60 సీట్ల చొప్సున, బీఎస్సీ (లైఫ్‌సైన్సెస్) 120 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా తెలుగు మీడియంలో బీఏ(సీబీసీఎస్) 60సీట్లు ఉండగా, సగటున 50నుంచి 60శాతం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. దీంతో ఆయా కళాశాలల అధ్యాపకులు ఆయా పరిసరాల జూనియర్ కళాశాలలను, గ్రామాలను సందర్శించి ఇంటర్ విద్యార్థులను సంప్రదించి, తమ తమ కళాశాలల్లో కోర్సులు, అందుబాటులోని సమర్దులైన ఫ్యాకల్టీ వివరాలను వివరిస్తూ అడ్మిషన్లు పెంచుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్ ఫలితాలు జిల్లాలో 64.65 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు స్థానికంగా గల డిగ్రీ కళాశాలల్లో ఏమేరకు ప్రవేశాలు తీసుకుంటారో..అద్యాపకుల ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయే వేచిచూడాల్సిందే..
దోస్త్ ఆన్‌లైన్ ప్రవేశాల విధానం ఇలా..
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు నల్లగొండ కేంద్రంగా గల మహాత్మాగాంధీ యూనివర్సీటీ అనుబంధంగా వివిధ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్ ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు స్మార్ట్ ఫోన్ ద్వారా దోస్త్ యాప్‌లో తమ దరఖాస్తును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫేస్ రికగ్నైజేషన్, ఆధార్ నెంబరు ద్వారా సులభంగా తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉన్నత విద్యామండలి యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మూడు విడతలుగా ప్రవేశాల ప్రక్రియ
దోస్త్ ఆన్‌లైన్ ప్రవేశాల ప్రక్రియను ప్రభుత్వం మూడు విడతలుగా చేపట్టనుంది. మొదటి విడతగా ఏప్రిల్ 15 నుంచి 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, ఏప్రిల్ 30 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు, మే 14న సీట్ల కేటాయింపు, మే 15 నుంచి 23వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో విడతలో మే 15 నుంచి 25వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, మే15 నుంచి 25వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు, మే 30న రెండో విడత సీట్ల కేటాయింపు, జూన్ 5వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మూడో విడతగా మే 31వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, మే 31 నుంచి జూన్ 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు, జూన్ 20వ తేదీన సీట్ల కేటాయింపు, జూన్25వ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.