Share News

ఒత్తిడిలో వైద్యులు

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:23 AM

రోగుల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడట మే లక్ష్యంతో పనిచేసే వైద్యుల ఆరోగ్య పరిరక్షణ రోజురోజుకూ కొరవడుతోంది. మెజార్టీ వైద్యులు రోజులో 12 నుంచి 16గంటల పాటు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విధి నిర్వహణలో ఉంటారు.

ఒత్తిడిలో వైద్యులు

వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై ప్రభావం

నేడు జాతీయ వైద్యుల దినోత్సవం

రోగుల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడట మే లక్ష్యంతో పనిచేసే వైద్యుల ఆరోగ్య పరిరక్షణ రోజురోజుకూ కొరవడుతోంది. మెజార్టీ వైద్యులు రోజులో 12 నుంచి 16గంటల పాటు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విధి నిర్వహణలో ఉంటారు. దీంతో వైద్యులందరూ నిరంతరం మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతూ ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితి. ఇది దైవం మనుష్య రూపేణ అంటూ కొలిచే వైద్యు ల ఆరోగ్య పరిస్థితి ఇది. నేడు జాతీయ వైద్యు ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన)

వైద్యుడు నిత్య విద్యార్థి. ఓ వైపు రోగుల ఆరోగ్యాన్ని కాపాడే వృత్తిధర్మాన్ని నెరవేరేస్తూనే నూతన వైద్య విధానాలను నేర్చుకోవడం, జర్నల్స్‌ చదవడం, సెమినార్స్‌కు హాజరుకావడం, వీడియోలను వీక్షించడం ద్వారా నిత్యవిద్యార్థి పాత్రను పోషిస్తుంటారు. విధి నిర్వహణలో రోజుల్లో మెజార్టీ సమయాన్ని వీరు వైద్యసేవలకే కేటాయిస్తుంటారు. కుటుంబాలకు వ్యక్తిగత ఉల్లాసానికి కూడా సమయాన్ని కేటాయించలేక నిరంతరం వృత్తిపరమైన ఒత్తిడితోనే సతమతమవుతున్న పరిస్థితి వీరిదని ఇండియన మెడికల్‌ అసోసియేషన(ఐఎంఎం) పేర్కొంటోంది.

వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతూ...

రికార్డుల ప్రకారం నిర్దేశిత పనిగంటలు ఉన్నా ఆఫ్‌లైనలో మాత్రం వైద్యులు 24గంటలు విధుల్లో ఉన్నట్టే. ఎమర్జెన్సీ, సలహాలు పేరిట సమయంతో నిమిత్తం లేకుండానే వచ్చే ఫోనకాల్స్‌ లేదా పిలుపుతో విధుల్లో నిమగ్నమవుతుంటారు. దీంతో సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి ఎమోషనల్‌ ఫీలింగ్స్‌ తదితర కారణాలతో పలువురు వైద్యులు జీర్ణకోశ, మానసిక, నరాలు, గుండె ఆధారిత జబ్బులకు గురవుతున్నారు. అంతేకాక రోగ నియంత్రణపై అవగాహన కారణంగా స్వీయ ఆరోగ్యంపై చూపుతున్న అలసత్వంతో పలువురు వైద్యులు మృత్యువాత పడుతున్నారు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌(ఎనఎంసీ)నిబంధనల ప్రకారం జూనియర్‌ డాక్టర్స్‌ వరుసగా 24గంటలు లేదా వారానికి 72 గంటల విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఇందుకు భిన్నంగా వరుసగా 72 గంటల నుంచి 100 గంటల పాటు వార్డుల్లో ఉండటం వల్ల పలువురు జూనియర్‌ డాక్టర్స్‌లో వృత్తిపై విముఖత పెరుగుతున్నట్టు సీనియర్‌ వైద్యులు పేర్కొంటున్నారు. అంతేకాక విధుల ఒత్తిడితో కుటుంబ సభ్యులకు, పిల్లలకు తగినంత సమయం ఇవ్వకపోవడం, బంధుమిత్రులకు దూరంగా మసలాల్సి వస్తుండడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అలాగే పలు కారణాలు చూపుతూ ఆసుపత్రులపై పెరుగుతున్న దాడులతో వైద్యులు అభద్రతకు లోనవుతున్న పరిస్థితి.

సగటు భారతీయుడి ఆయుష్షు కంటే తక్కువగా..

గణాంకాల ప్రకారం సగటు భారతీయుడి జీవితకాలం 70 నుంచి 72 ఏళ్లు కానీ ఐఎంఏ నివేదిక ప్రకారం భారతీయడి వైద్యుడి జీవితకాలం 55 నుంచి59 ఉంది. ఇది వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు నిదర్శనమని వైద్య నిపుణులు అంటున్నారు. వైద్యుల ఆరోగ్యం, సంరక్షణ లక్ష్యంగా ఈ ఏడాది థీమ్‌ను ‘బీ హైండ్‌ ది మాస్క్‌ హూ హిల్స్‌ ది హిలర్స్‌’(రోగులను నయం చేసే వైద్యుల ఆరోగ్యాన్ని వారి మానసిక సంక్షేమాన్ని ఎవరు కాపాడుతున్నారు)అనే ప్రశ్నను ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ హైజిన(ఐపీహెచహెచ) సమాజం ముందు ఉంచుతోంది.

వైద్యులను గౌరవించాలి, కాపాడుకోవాలి

ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పరితపించే వైద్యులను గౌరవించడం, కాపాడుకోవడం అందరి బాధ్యత. స్వీయారోగ్యంపై వైద్యులు శ్రద్ధ చూపాలి. ఇద్దరికి మించి వైద్యులు ఉన్న కుటుంబాల్లో అందరు కలిసే శుభకార్యాలను నిర్వహించుకునే తేదీలపై కూడా తర్జనభర్జన పడాల్సిన పరిస్థితి. రోగుల క్షేమమే లక్ష్యంగా డాక్టర్లు విధులు నిర్వహిస్తారు. కానీ అలసత్వం చూపరనే నిజాన్ని అందరూ గ్రహించడం మంచిది.

- డాక్టర్‌ మనోహర్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి , యాదాద్రి భువనగిరి.

Updated Date - Jul 01 , 2026 | 12:23 AM