నిరుపయోగంగా కంపోస్టు షెడ్లు
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:44 AM
(ఆంధ్రజ్యోతి-గుర్రంపోడు): స్వచ్ఛ గ్రామాల కోసం గత ప్రభుత్వం ఇంటింటికీ తడి,పొడి చెత్త సేకరణకు శ్రీకారం చుట్టింది
(ఆంధ్రజ్యోతి-గుర్రంపోడు): స్వచ్ఛ గ్రామాల కోసం గత ప్రభుత్వం ఇంటింటికీ తడి,పొడి చెత్త సేకరణకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఇందుకోసం గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్ చొప్పున కొనుగోలు చేసింది. అయితే ఆ వ్యర్థాలు(చెత్త, ఆకులు,పేడ) నుంచి పోషకభరితమైన కంపోస్టు ఎరువు తయారీకి కోసం ఉపాధి హామీ పథకం నిధులు రూ.2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు చేసి గ్రామానికో కం పోస్ట్ షెడ్డును నిర్మించింది. సేకరించిన చెత్తను వేసేందుకు ఇళ్లలో సేకరించిన చెత్తను కంపోస్ట్ షెడ్డులో తడి, పొడి చెత్తను వేరుచేసి ఎరువుగా మార్చిమొక్కలకు వినియోగించడం, లేదంటే విక్రయించి పంచాయతీ ఆదాయం పెంచుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో అది ఎక్కడ అమలు కావడం లేదు. చాలా గ్రామాల్లో తడి,పొడి చెత్తను వేరు చేయడం లేదు. కొన్ని చోట్ల కంపోస్ట్ షెడ్డుల సమీపంలో, మరికొన్ని చోట్ల రోడ్ల పక్కన లేదంటే వాగులు, సాగునీటి కాలువల సమీపంలో చెత్త పడవేసి తగలబెడుతున్నారు. కొన్ని గ్రామాల్లో మందు బాబులకు అడ్డాలుగా మారాయి. రూ.లక్షలు వెచ్చించి నిర్మించినా నిరుపయోగంగానే మారాయి. వాస్తవానికి గ్రామాల్లో సేకరించిన చెత్తకు, నిర్మించిన కంపోస్ట్ షెడ్లకు పొంత లేకుండా పోయింది.
అధికారులు, ఇటీవల కొత్తగా కొలువుదీరిన పాలకులు దృష్టి సారించి ఇళ్లలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇచ్చేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించాలి. వాటిని కంపోస్ట్ షెడ్డులోకి తీసుకెళ్లే విధంగా కార్మికులకు సూచనలు చేస్తేనే కంపోస్టు షెడ్లు ఉపయోగంలోకి వస్తాయి. లేకుంటే నిరుపయోగంగానే మిగిలిపోయేలా ఉన్నాయి. మండలంలో 37 గ్రామ పంచాయతీల్లో కంపోస్టుషెడ్లు నిర్మించగా ఒక్కటిగా వినియోగంలో లేదు.