Share News

జిల్లా పర్యాటకం దివ్యంగా

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:27 AM

దేశంలోని పర్యాటక కేంద్రాలను ప్రోత్సహించేందుకు నీతి ఆయోగ్‌ ‘దివ్యభారత’ పేరుతో ఓ నివేదికను రూపొందించింది.

 జిల్లా పర్యాటకం దివ్యంగా

అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం యాదగిరి లక్ష్మీనృసింహుడి క్షేత్రం

చారిత్రక ప్రాచీన కట్టడంగా భువనగిరి ఏకశిలాదుర్గం

హస్తకళల్లో పోచంపల్లి ఇక్కత వసా్త్రలు

ప్రాధాన్యం కల్పించిన నీతి ఆయోగ్‌

(ఆంధ్రజ్యోతి, యాదాద్రి)

దేశంలోని పర్యాటక కేంద్రాలను ప్రోత్సహించేందుకు నీతి ఆయోగ్‌ ‘దివ్యభారత’ పేరుతో ఓ నివేదికను రూపొందించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలను గుర్తించి, ఆయా కేంద్రాల విశేషాలతో కూడిన వివరాలను దేశ, విదేశీ యాత్రికులకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ స్వయంప్రతిపత్తి సంస్థ నీతి ఆయోగ్‌ ఈ నివేదికను విడుదల చేసింది. ప్రపంచ ప్రసిద్ధమైన టూరిజం గైడ్‌గా గుర్తింపు పొందిన ‘లోన్లీ ప్లానెట్‌ ట్రావెల్‌ బుక్‌’ తరహాలో నీతి ఆయోగ్‌ ‘దివ్యభారత’ నివేదికకు రూపకల్పన చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక నివేదికలో రాష్ట్రంలోని పలు పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు జిల్లాకు కూడా పెద్దపీట దక్కింది.

జిల్లాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అద్భుత రాతిశిలాలతో పునర్నిర్మితమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, శతాబ్దాల చరిత ఉన్న ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలాదుర్గంగా ప్రసిద్ధిచెందిన భువనగిరిఖిల్లాకు ‘దివ్యభారత’లో చోటు కల్పించింది. నీతిఆయోగ్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ రూపొందించిన ‘దివ్యభారత’ పర్యాటక నివేదికలో ఓ ఆధ్యాత్మిక క్షేత్రం, మరో పురాతన చారిత్రక ఏకశిలా దుర్గం ప్రాధాన్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పడంతో ఈ ప్రాంతం పర్యాటకంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైందిగా భావిస్తున్నారు.

ఆధ్యాత్మిక నగరి ‘యాదగిరి’ క్షేత్రం

భక్తుల కొంగుబంగారం.. ఇల వైకుంఠం.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం విరాజిల్లుతోంది. పంచనృసింహులుగా కొండగుహలో వెలసిన స్వయంభు దివ్యక్షేత్రం దేశ, విదేశాల, పండిత, పామర భక్తుల పూజలు అందుకుంటూ ఈ క్షేత్రం ఆధ్యాత్మిక విశ్వనగరిగా కొత్త రూపు సంతరించుకుంటోంది. తిరుమలస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,280కోట్లతో ఆధార శిల నుంచి, శిఖరాలవరకు నల్లరాతి కృష్ణశిలలతో పునర్నిర్మించింది. 14.5 ఎకరాల విస్తీర్ణంలో కొండపై అష్టభుజి ప్రాకార మండపాలు, సప్తగోపురాలు, నలుదిక్కుల విశాలమైన మాఢవీధులు, కాకతీయులు, చోళుల శిల్పకళారీతులకు దర్పణం పట్టే సింహరూపు రాతిస్తంభాలు, శ్రీవైష్ణవ ధర్మప్రచారకులు 12మంది ఆళ్వారుస్వాముల విగ్రహాలతో ఆధ్యాతికశోభను విరాజిల్లే ముఖ మండపం, గర్భాలయ ముఖ ద్వారం, ధ్వజస్తంభ, బలిపీఠం బంగారు శోభతో ఆధ్యాత్మిక సొబగులను అద్దుకున్నాయి. రాతి పరుపు బండ పరుచుకున్న కొండపై ల్యాండ్‌ స్కేప్‌ గార్డెన్లు పచ్చదనంతోపాటు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నాయి. ఆలయంలో లక్ష్మీనరసింహులకు సుప్రభాత సేవ నుంచి అభిషేకం, అర్చనలు, అష్టోత్తర పూజలు, నిత్యకల్యాణం, సాయంత్రం వెండిజోడి సేవ, నివేదన పవళింపు సేవ వరకు మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణలతో ఆధ్యాత్మిక సందడి ఉంటోంది. పాంచరాత్రగమ శాస్త్రరీతిలో శ్రీరంగంలోని శ్రీమన్నారాయణుడి పూజా విధానాలను ఇక్కడి ఆచార్యులు వైభవంగా నిర్వహిస్తుంటారు. ఏటా పాల్గుణ మాసంలో 11 రోజుల పాటు విశ్వశాంతి లోకకల్యాణం కోసం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. హైదరాబాద్‌ నగరానికి అతిసమీపంలో ఉన్న యాదగిరి దివ్యక్షేత్రాన్ని సగటున నిత్యం సుమారు 40వేల మంది భక్తులు దర్శించుకుంటారు. తెలంగాణలో అతి ఎక్కువగా పర్యాటకులు సందర్శించే క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది.

రాజవంశీయుల పాలన.. చారిత్రక సంపదకు సజీవ సాక్ష్యం

హైదరాబాద్‌-భూపాలపట్నం 163 జాతీయ రహదారిపై జిల్లా కేంద్రంలో ఎత్తయిన ఏకశిలపై పురాతన కట్టడాలతో భువనగిరి ఖిల్లా తెలుగు నేలపై రాజవంశీయుల పాలన, చారిత్రక సంపదకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. సముద్రమట్టానికి 1,506 అడుగుల ఎత్తులో అండాకారంలో ఉన్న ఏకరాతిశిలపై నిర్మితమైన చారిత్రక కట్టడ రాజసౌరభాలు ఉన్న భువనగిరి ఖిల్లా ప్రపంచస్థాయి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పశ్చిమ చాళక్యుల్లో ఆరోవాడైన త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు ఈ ఖిల్లాపై విశాలమైన రాజప్రసాద భవనాలు, సైనిక గదులు, ధాన్యాగారాలు, గుర్రపు శాలలు, గోల్కోండ కోటకు చేరుకునే రహస్య మార్గాలు, అత్యవసర ద్వారాలతో పాటు మూడు అంచెల రక్షణ గోడలు, రాతి దుర్గంపై నీటి సరస్సులు, గొలుసుకట్టు చెరువులు సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. ఈ పురాత కట్టడాల్లో చాలా భాగం ఇప్పటికే శిథిలమయ్యాయి. ఖిల్లా పరిసరాల్లో అనేక శిలాశాసనాలు, దేవాలయ శిథిలాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. ప్రాచీన చారిత్రక వారసత్వం ఉన్న భువనగిరి కోటను చాళక్యుల నుంచి కాకతీయులు, బహుమనీలు, కుతబ్‌షాలు, ఆ తర్వాత నిజాం వంశీయులు పాలించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చారిత్రక ప్రాంతాల సందర్శకులకు పర్యాటక కేంద్రంగా, మరో వైపు సాహస క్రీడాకారుల ట్రెక్కింగ్‌కు, పర్వతారోహకులకు ప్రాథమిక శిక్షణా కేంద్రంగా విరాజిల్లుతోంది.

చేనేత కళ, పోచంపల్లి ఇక్కత వసా్త్రలు

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన చేనేత కళగా గుర్తింపు పొందింది పోచంపల్లి ఇక్కత చేనేత వసా్త్రల తయారీ. పోచంపల్లి పరిసరాల్లో సుమారు 100 గ్రామాల్లో చేనేతకారులు ఈ కళాత్మకమైన వసా్త్రలకు జీవం పోస్తున్నారు. మగ్గంపై పట్టు, కాటన వసా్త్రలను చేతితోనే నేయడం ఈ వసా్త్రల తయారీ ప్రత్యేకత. ఇక్కత వసా్త్రలపై జ్యామితి ఆకారాలు, చక్రియ బ్యాండు మేళాలు, రంగురంగు బార్డర్లు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తూ ప్రపంచస్థాయి గుర్తింపు పొందాయి. వస్త్రం తయారీ తర్వాత కాకుండా ముందుగానే నేయబోయే వస్త్రం ఏదైనా, దాని డిజైన, రంగులను మదిలోనే ఊహాత్మకంగా రూపొందించుకునే సంప్రదాయమే ఇక్కత శైలి. రక్షిత డయింగ్‌ శైలిలో వస్త్రం మొత్తం రంగు వ్యాపించకుండా నూలుకు కట్టిముడి వేసి, రంగులు అద్దిన పిదపనే మగ్గంపై చేతితో వసా్త్రన్ని నేస్తారు. ఇక్కడి చీరలు, డ్రస్‌ మెటీరియల్‌కు అత్యంత ప్రజాదరణ లభించింది. ఈ వసా్త్రల తయారీలో చేనేతకారుల కళాత్మకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2003-04లో పేటెంట్‌ హక్కులతో పాటు జియోగ్రాఫికల్‌ ఇండికేషన(జీఐ) గుర్తింపు కల్పించింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో హిందీ, తెలుగు, తమిళ, మలయాళీ చిత్రపరిశ్రమతో పాటు రాజకీయ నాయకులు, గవర్నర్లు, రాష్ట్రపతి వరకు ఇక్కడి ఇక్కత వసా్త్రల వినియోగంపై మక్కువ చూపుతున్నారు. దేశ విదేశాల వస్త్ర మార్కెట్‌లో కూడా ఈ డిజైన్లకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఎంతో కళాత్మక, సృజనాత్మకతతో కూడిన ఇక్కత డిజైన వసా్త్రలకు పాలిస్టర్‌, ఇతరుల అనుకరణల వస్త్ర ఉత్పత్తిదారుల నుంచి పలు సవాళ్లు చేనేత కళాకారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Updated Date - Apr 23 , 2026 | 12:27 AM