Share News

అందరూ ఓటేశారా..మనకే పడిందా?

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:15 AM

మునిసిపల్‌ పోలింగ్‌ ముగిసిన వెంటనే అభ్యర్థులందరూ ఓట్ల లెక్కల్లో మునిగిపోయారు.

 అందరూ ఓటేశారా..మనకే పడిందా?

ఫఓట్ల లెక్కలపై అభ్యర్థుల తర్జనభర్జన

ఫపట్టణాల్లో ిహీట్‌.. కౌంటింగ్‌ కేంద్రం నుంచే క్యాంపులకు

భువనగిరి టౌన , ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ పోలింగ్‌ ముగిసిన వెంటనే అభ్యర్థులందరూ ఓట్ల లెక్కల్లో మునిగిపోయారు. ఓటరు జాబితాను ముందేసుకుని పోలింగ్‌ శాతాన్ని బేరీజు వేస్తూ గెలుపునకు ఎన్ని ఓట్లు అవసరమో లెక్కలు కడుతున్నారు. తాము ఎంత మందికి తాయిలాలు ఇచ్చాం, ప్రత్యర్థులు ఎవరికి ఏమి ఇచ్చారో ఆరా తీస్తూ తమకు వచ్చే ఓట్లు, ప్రత్యర్థులకు వచ్చే ఓట్ల సంఖ్యను విశ్లేషిస్తూ గెలుపు ఓటములపై అంచనాలు వేస్తున్నారు. అభ్యర్థుల మద్దతుదారులు, పార్టీల నాయకులు కూడా ఇదే బిజీలో ఉండగా చైర్మన ఆశావాహులు ఓ అడుగు ముందుకేసి పార్టీల వారీగా వచ్చే వార్డులను అంచనా వేస్తూ చైర్మన పదవిని దక్కించుకునేందుకు సమీకరణాలు ప్రారంభించి, అదే సమయంలో గెలిచిన కౌన్సిలర్లను కౌంటింగ్‌ కేంద్రం నుంచే క్యాంపులకు తరలించేందుకు సుమారుగా అన్ని పార్టీల ముఖ్య నాయకులు , చైర్మన, వైస్‌ చైర్మన ఆశావహులు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రచారమవుతోంది. వారం రోజుల ఎన్నికల ప్రచారంలో చేసిన ఖర్చు, ప్రలోభాలకు వెచ్చించిన మొత్తానికి సమానంగా పలువురు ఆశావహులు పోలింగ్‌ రోజున పంపిణీ చేసిన తీరు నోట్ల వానలో ఏరులై పారిన మద్యం ప్రవాహంలో చీరలు, వంట సామాగ్రి, ఇతర గృహోపకరణాలు తేలిఆడినట్టుగా ఉందని పలువురు పేర్కొంటుండడం గమనార్హం.

బెట్టింగ్‌ల జోరు..

వార్డు బరిలో ఉన్న అభ్యర్థుల పలుకుబడి ఆధారంగా వారి గెలుపు ఓటములపై బెట్టింగ్‌ కడుతున్నట్టు, ఈ తంతులో స్థానికులు చలాకీగా వ్యవహరిస్తున్నట్టు ప్రచారమవుతోంది. ఈ మేరకు భువనగిరిలో ఆరుగురితో కూడిన ఓ ముఠా పోలింగ్‌ ముగిసినప్పటికి నుంచి పలువురితో సుమారుగా రూ.10లక్షల వరకు బెట్టింగ్‌ కట్టినట్టు స్వయంగా ఆ ముఠా సభ్యుడే పేర్కొంటుండడం గమనార్హం.

‘భూదాన’లో 40మంది అభ్యర్థులు

భూదానపోచంపల్లి: పట్టణంలోని 6వ వార్డు, 9వ వార్డులో బీఆర్‌ఎస్‌ రెబల్స్‌ ఇద్దరు బరిలో ఉన్నారు. భూదానపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డులకు 40 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికలు అనగానే ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడమే ప్రధాన అస్త్రంగా మారింది. ప్రలోభాలు శృతిమించాయని ఓటర్లే చర్చించుకుంటున్నారు.

ఓటరు ఎవరికి ప్రసన్నమయ్యాడు?

యాదగిరిగుట్ట రూరల్‌: కొన్ని వార్డుల్లో అభ్యర్థులు స్వయంగా ఓటర్ల ఇంటికి వెళ్లి ఇంట్లో లెక్కలు వేసి మరీ డబ్బులు చెల్లించినట్లు చర్చించుకుంటున్నారు. ఓటర్లు తెలివైన వారు కావడంతో ఎంతమంది అభ్యర్థులు డబ్బులు ఇస్తే వారినుంచి వద్దనకుండ తీసుకున్నారనే చర్చ నడుస్తోంది. కొంతమంది అభ్యర్థులు తమవద్ద డబ్బులు లేకున్నా భూములు తాకట్టు పెట్టిమరీ లక్షల రూపాయలు అప్పులు తీసుకువచ్చి ఓటర్లకు పంచినవారు ఉన్నారు. ఒకవేళ వారు ఓడిపోతే వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుంది. తెల్లారితే తమ భవిష్యత్తు ఏమిటనే సందేహం అభ్యర్థులను ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది.

మోత్కూరులో ఎవరి ధీమా వారిదే

మోత్కూరు : మోత్కూరు మునిసిపాలిటీలో 12 వార్డులకు 49 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. పోలింగ్‌ ముగియడంతో అభ్యర్థులు, ప్రధాన పార్టీల నాయకులు గెలుపు ఓటములపై చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌ సీపీఐతో కలిసి, బీఆర్‌ఎస్‌ సీపీఎంతో కలిసి పోటీ చేయగా బీజేపీ ఒంటరిగా తొలిసారి అన్ని 12 స్థానాలకు పోటీ చేసింది. కాంగ్రెస్‌ అభ్యర్థులు 11 స్థానాల్లో, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 11 స్థానాల్లో సీపీఐ, సీపీఎం ఒక్కో స్థానంలో పోటీ చేశాయి. మూడు ప్రధాన పార్టీలు పోటీ చేసినప్పటికీ ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్యనే సాగింది. ఎవరికి వారు తమదే గెలుపు అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఓటు ఎవరికి వేశారో..?

ఐదో వార్డులో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గతంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మొగుళ్ల అనురాధ ఇప్పుడు కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు టికెట్‌ ఇస్తామన్నా కాదని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచింది. అక్కడ కాంగ్రెస్‌ పోటీ చేయకుండా పొత్తులో భాగంగా సీపీఐకి కెటాయించగా సీపీఐ అభ్యర్థిగా మొగుళ్ల స్వాతి పోటి చేసింది. కాంగ్రె్‌సకు చెందిన మాజీ కౌన్సిలర్‌ మలిపెద్ది రజిత ఈ సారి కూడా కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించి, టికెట్‌ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది. కాంగ్రెస్‌ అగ్రనాయకులు ఆమెను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఒప్పించలేక, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలేక సతమతమవుతున్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రసిడెంటు మలిపెద్ది మల్లారెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించి భంగపడి బీఆర్‌ఎ్‌సలో చేరారు. బీఆర్‌ఎస్‌ నుంచి కోక రేణుక బిక్షం పోటీ చేస్తున్నారు. దీంతో ఎవరు ఓట్లు ఎవరు చీల్చుతున్నారు. ఎవరి వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది తేల్చుకోలేకపోతున్నారు. 12వ వార్డు కూడా గందరగోళంగా ఉందంటున్నారు. కూరెల్ల (ఇంటిపేరు) కుటుంబాల నుంచి ఇద్దరు, మెంట (ఇంటిపేరు) కుటుంబాల నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు. మెంట రమణనగేష్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా, కూరెళ్ల పద్మ పరమేష్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా, కూరెల్ల సువర్ణ, మెంట జయమ్మ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. 5వ, 12వ వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. మోత్కూరు మునిసిపల్‌ చైర్మన స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. అది దృష్టిలో పెటుకునే జనరల్‌ మహిళ స్థానాల్లో ఎస్సీ మహిళలు పోటీ చేశారు. కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాలు గెలిచినట్టయితే చైర్‌ పర్సన రేస్‌లో ముగ్గురు ఆశావహులు ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాలు గెలిచినట్టయితే ఇద్దరు చైర్‌ పర్సన రేస్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన అభ్యర్థులను క్యాంపునకు తరలించనున్నట్టు సమాచారం.

విజయోత్సవాలకు అనుమతులు లేవు: ఎస్పీ

మునిసిపల్‌ ఎన్నికల విజయోత్సవాలకుఅనుమతులు లేవని ఎస్పీ అక్షాంశయాదవ్‌ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ ఇంకా అమలులోనే ఉన్నందున ర్యాలీలు, సభలకు అనుమతులు లేవని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు జరిగే భువనగిరి మునిసిపల్‌ పరిధిలోని మద్యం దుకాణాలను శుక్రవారం రోజంతా మూసీ వేయాలని ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ విష్ణుమూర్తి యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Feb 13 , 2026 | 12:15 AM