చెరువుల విధ్వంసం.. మట్టి లూటీ
ABN , Publish Date - Apr 10 , 2026 | 01:00 AM
ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతమైన జిల్లాలో నీటి వనరుల సంరక్షణ కరువైంది. నీటిపారుదల శాఖ అధికారులు చెరువుల నిర్వహణను పట్టించుకోకపోవడంతో మట్టి అక్రమ తవ్వకాలతో వీటి రూపురేఖలు మారిపోయాయి.
చెలరేగుతోన్న మట్టి మాఫియా
అడ్డగోలు తవ్వకాలు.. నిల్వ సామర్థ్యం కోల్పోతున్న చెరువులు
3నెలల్లో రూ.3.44కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి
పోలీస్, రెవెన్యూ అధికారుల అండదండలు
ఫిర్యాదులు చేస్తే కేసు నమోదుతో సరి
నల్లగొండ మండలం దోమలపల్లిలో చెరువు అడుగంటేవరకు మట్టి తవ్వకం
నల్లగొండ, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతమైన జిల్లాలో నీటి వనరుల సంరక్షణ కరువైంది. నీటిపారుదల శాఖ అధికారులు చెరువుల నిర్వహణను పట్టించుకోకపోవడంతో మట్టి అక్రమ తవ్వకాలతో వీటి రూపురేఖలు మారిపోయాయి. ధనార్జనే ధ్యేయంగా మట్టిమాఫియా చెరువులను విధ్వంసం చేస్తుంటే నిలువరించే నాథుడు కరువయ్యారు. మట్టి తవ్వకాలను నియంత్రించాల్సిన ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లావ్యాప్తంగా చెరువులను మట్టి మాఫియా ధ్వంసం చేస్తోంది. చెరువుల్లో అడుగంటేంతవరకు, రాళ్లు తేలేంతవరకు మట్టిని తోడేస్తుండడంతో చెరువులు రూపురేఖలు కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో మొత్తంగా 4,629 చెరువులు ఉండగా, 556 పెద్ద చెరువులు, 4,073చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. నిబంధనల మేరకు చెరువు అడుగున ఉండే నల్లటి పొరను తవ్వకూడదు. జిల్లాలో ఇష్టానుసారంగా మట్టి, పూడిక దశను దాటి నల్లటి పొరను తొలగించి రాళ్లు తేలేంతవరకు తవ్వేస్తున్నారు.
మొరం, బంకమట్టి కోసం చెరువుల లూటీ...
నల్లగొండ పట్టణంతో పాటు, మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, చిట్యాల తదితర పట్టణాల్లో నిర్మాణాలకు ఉపయోగించే మొరం మట్టి కోసం చెరువులను తవ్వేస్తున్నారు. పట్టణాలకు 10 నుంచి 12కిలోమీటర్ల సమీపంలో ఉండే చెరువుల్లోని మట్టిని ఎక్స్‌కవేటర్ల ద్వారా తవ్వి టిప్పర్లలో పట్టణాలకు తరలించి విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రం, మిర్యాలగూడ పట్టణాల్లో పాగా వేసిన మట్టి మాఫియా స్థానిక రాజకీయ నాయకులు, పోలీస్, రెవెన్యూ అధికారుల అండదండలతో ఈ తవ్వకాలను యథేచ్ఛగా నిర్వహిస్తోంది. 100 టిప్పర్ల ఆర్డర్ తీసుకుని ఒక చెరువును గుర్తించి తవ్వకాలకు ముందే ముడుపులు చెల్లించేవారికి చెల్లించి ఒకటి, రెండు రోజుల్లోనే చెరువులను అడ్డగోలుగా తవ్వేసి ధ్వంసం చేస్తున్నారు. ఈ విషయమై కలెక్టరేట్‌లో నిర్వహించే ‘ప్రజావాణి’లో కలెక్టర్‌కు, స్థానికంగా తహసీల్దార్లు, ఆర్డీవోలకు ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోందని చెబుతున్నారు.
నిబంధనలు నీటిపై రాతలే
నిబంధనల ప్రకారం చెరువుల్లో మట్టి తవ్వాలంటే ముందుగా ఆ చెరువులో నీటి నిల్వకు ఆటంకం లేకుండా మట్టి అందుబాటులో ఉందని ఇరిగేషన్ డీఈ నేతృత్వంలోని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. అధికారుల సిఫారసు మేరకు మట్టి తవ్వేందుకు అవకాశం ఉందని నిర్ధారిస్తే, సంబంధిత చెరువులో మట్టి తవ్వకానికి మెట్రిక్ టన్నుకు రూ.43 చొప్పున కనీసం 1000 మెట్రిక్‌టన్నులకు రూ.43వేల చొప్పున సెస్సును మట్టి కొనుగోలుదారులు మైనింగ్ శాఖకు ముందుగానే చెల్లించి అనుమతులు పొందాలి. సెస్సు చెల్లించాక ఇచ్చే పర్మిట్ల మేరకు, నిర్ధిష్టమైన కొలతల పరిధికి లోబడి మాత్రమే చెరువుల నుంచి మట్టిని తవ్వాల్సి ఉంది. అయితే జిల్లాలో ఈ నిబంధనలేవీ అమలు చేయడం లేదు. చెరువుల్లో తవ్వకాలు జరిపేటప్పుడు అక్కడే ఉండి పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులెవరూ అందుబాటులో లేకపోవడంతో చెరువుల్లో అడ్డు అదుపులేని తవ్వకాలు జరుగుతున్నాయి.
3నెలల్లో రూ.3.44కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి
గత ఏడాది మట్టిమాఫియా అక్రమాలకు మూడు నెలల్లో రూ.3.44కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. వేసవిలో ఇంటి నిర్మాణ పనులు, ఇతర అవసరాలకు మట్టి వినియోగం అధికంగా ఉంటుంది. ఇందుకోసం చెరువుల్లో మట్టిని తవ్వి విక్రయిస్తున్న మట్టి మాఫియా ప్రభుత్వానికి ఎటువంటి పన్ను చెల్లించటం లేదు. ఒక లారీ టిప్పర్ మట్టి రూ.20వేలు, ఒక ట్రాక్టర్ మట్టి రూ.8వేలకు విక్రయిస్తున్నారు. ఒక టిప్పర్‌కు 10టన్నుల మట్టి నింపుతుండగా, రూ.430 పన్నుగా చెల్లించాల్సి ఉంది. గత ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అక్రమంగా మట్టి తవ్వకాలతో సుమారు 80వేల టిప్పర్, ట్రాక్టర్ల మట్టిని విక్రయించగా రూ.3.44కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. అడపాదడపా కేసులు నమోదుచేసి ఎక్స్‌కవేటర్లు, టిప్పర్లు, ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేసి కేసు నమోదుచేశారు.
రాళ్లు తేలేంతవరకు మట్టి తవ్వకం
చెరువుల్లో అడుగున ఉన్న నల్లమట్టి పొర సహా, రాళ్లు తేలేంతవరకు మట్టిని తోడేస్తుండడంతో చెరువులన్నీ లోతైన గుంతల సమూహంగా మారడంతో పాటు, నీరు నిల్వ ఉంచలేని పరిస్థితి ఏర్పడింది. చెరువుల్లో అక్రమ తవ్వకాలు జరగకుండా నిరోధిస్తూ, ఎవరైనా అతిక్రమిస్తే కేసులు పెట్టాల్సిన నీటిపారుదల శాఖ అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో జిల్లాలో చెరువులు ధ్వంసమవుతున్న పరిస్థితి కొనసాగుతోంది. ఒకవైపున మొరం మట్టితో పాటు, మరోవైపున ఇటుక బట్టీలకు ఉపయోగించే బంకమట్టిని సైతం ఇదే రీతిలో చెరువుల్లో అడ్డగోలుగా తవ్వేస్తున్న పరిస్థితి జిల్లాలో కొనసాగుతోంది. గ్రామస్థులు, మత్స్యకారుల నుంచి ఫిర్యాదులు వస్తే సంబంధిత తహసీలార్లు ఒకటి, రెండు చోట్ల వాహనాలను సీజ్ చేయడం మినహా ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో మట్టి మాఫియా విచ్చలవిడికి అడ్డులేకుండా పోయింది. నల్లగొండ మండలంలోని బుద్ధారం, కంచనపల్లి, దోమలపల్లి తదితర గ్రామాల్లో చెరువులను ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించినప్పుడు అక్కడ చెరువులన్నీ లోతైన గుంతలు, రాళ్లతో నిండిపోయిన అంశం జిల్లాలో చెరువులలో అడ్డగోలు తవ్వకాలకు నిదర్శనంగా కనిపించాయి. ఈ విషయమై నీటిపారుదలశాఖ ఈఈ సతీ్‌షచంద్రను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో మట్టి తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటామన్నారు. తమకు ఫిర్యాదు వచ్చిన నల్లగొండ మండలంలోని కంచన్‌పల్లి, దోమలపల్లిలో మట్టి తవ్వకాలకు సంబంధించిన వాహనాలను సీజ్ చేయించామని తెలిపారు.