రెవెన్యూ ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం!
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:53 AM
భూ సంబంధిత వివాదాలపై ఎన్నిమార్లు ఫిర్యాదులిచ్చినా, ఎవరిని కలిసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితులు చివరికి కోర్టును ఆశ్రయించడమో లేదా గ్రామాల్లో తగాదాలు, ఘర్షణలుపడడమో చేస్తున్నారు.
వివాదాలకు, ఘర్షణలకు తావిస్తున్న అధికారుల అలసత్వ వైఖరి
తాజాగా తహసీల్దార్‌కు మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): ఫిర్యాదుల పరిష్కారంలో జిల్లా రెవెన్యూ అధికారుల జాప్యం పలు విమర్శలకు తావిస్తోంది. భూముల సమస్యలపై బాధితులు ఇచ్చే ఫిర్యాదులను రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు.
భూ సంబంధిత వివాదాలపై ఎన్నిమార్లు ఫిర్యాదులిచ్చినా, ఎవరిని కలిసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితులు చివరికి కోర్టును ఆశ్రయించడమో లేదా గ్రామాల్లో తగాదాలు, ఘర్షణలుపడడమో చేస్తున్నారు. ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల్లో 90శాతం పైగా తహసీల్దార్ల పరిధిలో పరిష్కరించేవే ఉంటున్నాయి. వాటిని సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో బాధితులు కలెక్టర్ కార్యాలయ మెట్లెక్కాల్సి వస్తోంది. ప్రధానంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు చెప్పినట్లు రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తున్న బాధితులు
జిల్లాలో భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల అలసత్వం, పట్టింపులేని కారణంగా బాధితులు సమస్య పరిష్కారం కోరుతూ మానవహక్కుల కమిషన్, కలెక్టర్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కలిసి విన్నవిస్తున్నారు. తాజాగా, తిరుమలగిరి సాగర్ మండలం రంగుండ్ల గ్రామపంచాయతీ పరిధిలో తండ్రికి చెందిన భూమిని విరాసత్ చేయాల్సిందిగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో ఆ గ్రామానికి చెందిన బాధితులు మూడేళ్లుగా ఫిర్యాదుల చేస్తూ వస్తున్నారు. సాంకేతిక సమస్యలు, బాధితులుగా పేర్కొంటున్నవారి తండ్రిపేరున ఎక్కడా రెవెన్యూ రికార్డుల్లో పట్టేదారుగా నమోదు కాకపోవడం, 1998-99లో మాత్రమే అనుభవదారుగా నమోదై ఉండటంతో ఈ ఒక్క ఆధారంతో ఆ భూమిని ఫిర్యాదుదారులకు పట్టా చేయలేమని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఇదే విషయాన్ని సంబంధిత బాధితులకు చెప్పకపోవడంతో వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడమేగాక, ఇటీవల మానవహక్కుల కమిషన్‌ను సైతం ఆశ్రయించారు. ఈ క్రమంలో కమిషన్ నుంచి వచ్చిన నోటీసులకు సైతం రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో తాజాగా, సంబంధిత తహసీల్దార్ అరెస్టుకు వారంట్ జారీ అయ్యింది. జిల్లాలో భూసమస్యల తీవ్రత, పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యపూరిత వైఖరికి నిదర్శనంగా ఈ ఘటన నిలుస్తోంది. ఇదే మాదిరిగా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో ఇటీవల విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన 25 గుంటల భూమి తమదేనని, ఇక్కడ సబ్‌స్టేషన్ నిర్మించవద్దంటూ ఆ భూమిని గతంలో తమ కుటుంబానికి అసైన్డ్ చేసి పట్టాలిచ్చారని పేర్కొంటూ ఎస్సీ కుటుంబానికి చెందినవారు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణకు రాజకీయరంగు పులుముకోవడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే రెవెన్యూ రికార్డుల ప్రకారం, ట్రైబ్యునల్స్ ఇచ్చిన తీర్పుల ప్రకారం ఈ భూమిలో ఎవరికీ అసైన్డ్ పట్టాలివ్వలేదని, ఇది ప్రభుత్వభూమేనని తేలింది. ఈ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు సబ్‌స్టేషన్ నిర్మాణానికి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఘర్షణకు తెరలేపింది. అయితే ఇక్కడ భూమి తమదిగా పేర్కొంటున్న ఎస్సీ రైతులు మాత్రం రాజకీయకుట్రతోనే తమ భూమిని లాక్కుంటున్నారని ఆరోపిస్తున్నారు.
వివాదాలు, ఫిర్యాదుల పరిష్కారం పట్టని అధికారులు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ అమలులోకి వచ్చాక, తాజా గా భూభారతి వచ్చాక సమస్యలు పరిష్కా రం కావాల్సిందిపోయి అందుకు భిన్నంగా కొత్త సమస్యలు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా వారసత్వ, అసైన్డ్ భూముల వ్యవహారాల్లో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోవడంతో పెద్దసంఖ్యలో సమస్యలు వెలుగుచూస్తున్నాయి. భూ విస్తీర్ణంలో తేడాలు ఉండడం, దశాబ్దాలుగా భూ కాస్తు లో ఉన్నా పట్టాల్లో వేరే వ్యక్తుల పేర్లు కొనసాగించడం, వారసత్వ భూముల పట్టేదారుల పేర్ల నమోదులో అవకతవకలు, అసైన్డ్‌భూములకు సంబంధించి భూ విస్తీర్ణానికంటే ఎక్కువ భూములకు పట్టాలున్న చోట్ల సర్వేలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికే పట్టాలు మంజూరు చేయకపోవడం వంటి పలు సమస్యలు కుప్పలు తెప్పలుగా ప్రతీ మండలంలో ఉన్నా యి. ప్రధానంగా పట్టకరణ జరుగుతున్న మండల, మునిసిపల్ కేంద్రాల్లో గతంలో అసైన్డ్ కింద ఇచ్చిన భూములకు విలువ పెరగడం, అక్కడ గతంలో అసైన్డ్ కింద పట్టాలు పొందిన రైతులు సాగులో లేకపోతే దాన్ని సాకుగా చూపి రాజకీయనేతల ప్రోద్భలంతో ఆ భూమికి సంబంధించిన పట్టాలను రద్దు చేయడం పరిపాటిగా మారింది. ఈ విషయం తెలిసి భూముల పట్టాలు పొందిన ఎస్సీ, ఎస్టీ రైతులు ఆందోళనలకు దిగుతున్న పరిస్థితి జిల్లాలో కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా నెలకొన్న ఇలాంటి సమస్యలను క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించాలని, వాస్తవాన్ని ఫిర్యాదుదారులకు వివరించి పరిష్కరిస్తే 90శాతం సమస్యలు పరిష్కృతమవుతాయని, ఆ దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలనే సూచనలు వస్తున్నాయి.