ఆరుతడి సాగు అరకొరే
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:26 AM
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొ న్న తరుణంలో ఆరుతడి పంటల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ భావించింది. ఈ మేరకు విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించినా అధికారులు ఆశించిన మేర రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపలేదు.
లక్ష్యం లక్షా 5 వేల ఎకరాలు
ప్రస్తుతం 42,565 ఎకరాల్లోనే పంటమార్పిడి
సాగు పెంపునకు అనుకూలించని పరిస్థితులు
మరో రెండు రోజుల వరకే ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవకాశం
(ఆంధ్రజ్యోతి-నల్లగొండ) : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొ న్న తరుణంలో ఆరుతడి పంటల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ భావించింది. ఈ మేరకు విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించినా అధికారులు ఆశించిన మేర రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపలేదు. లక్షా 5 వేల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 42,565 ఎకరాల్లో మాత్రమే ఆరుతడి పంటలు సాగయ్యాయి. చాలా మంది బోరుబావుల కింద వరి సాగు చేస్తున్నారు.
జిల్లాలో ఆరుతడి పంటల సాగు లక్ష్యం చేరడం లేదు. వాతావరణ పరిస్థితులు ఆరుతడి పంటలకు కూడా అనుకూలంగా లేకపోవడం సమస్యగా మారింది. రాబోయే రోజుల్లో కూడా వాతావరణ పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు అనేది వాతావరణ శాఖ స్పష్టం చేస్తూ వస్తోంది. అయితే జిల్లా రైతులు అత్యధికంగా వరి, పత్తి పంటల సాగు చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ వానాకాలం సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతుల ఆశలు తలకిందులయ్యాయి. జిల్లాలో ప్రస్తుత వానాకాల సీజన్‌లో లక్షా 5 వేల ఎకరాలలో ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. అయితే ఇప్పటివరకు 42,565 ఎకరాలలో మాత్రమే సాగయయ్యాయి. చాలామంది రైతులు బోరుబావుల కింద వరి సాగు వైపు మొగ్గు చూపుతూ నాట్లు వేస్తున్నారు. అయితే ప్రభుత్వంతో పాటు అధికారులు వరి వేసి నష్టపోవద్దని పదేపదే రైతులకు అవగాహన కల్పిస్తున్నా జిల్లాలో ఇప్పటికే 3.56 లక్షల ఎకరాల్లో వరి సాగు మొదలుపెట్టారు. సాధారణంగా జిల్లాలో 5.30 లక్షల ఎకరాల్లో వానాకాలం సీజన్‌లో వరి నాట్లు వేస్తారు. అయితే రైతులు భవిష్యత్‌లో నీటి వనరులను దృష్టిలో ఉంచుకోకుండానే ఓవైపు పత్తి విత్తనాలు వేసిన రైతులు మరో వైపు వరి సేద్యాన్ని ప్రారంభించారు.
ఆరుతడి పంటల సాగుపై విముఖత...
ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించినా దశాబ్దాల కిందట మరిచిపోయిన పంటలను తిరిగి సాగు చేసేందుకు రైతులు విముఖత చూపించినట్లు తెలుస్తోంది. జిల్లా రైతులు అత్యధికంగా పత్తి, వరి వైపే మొగ్గు చూపుతున్నారనే దానికి పంటల సాగు చూస్తే అర్థమవుతోంది. సుమారు 5.50 లక్షల ఎకరాలకు పైగా ఎకరాలలో పత్తి సాగు చేయగా, వరి 3.56 లక్షల ఎకరాలల్లో వేశారు. ఆరుతడి పంటలు సాగు చేసినా జిల్లాలో ఆ పంటలకు దిగుబడి వస్తుందా లేదా సందేహంతో రైతులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించడం వ్యవసాయ శాఖకు ఇబ్బందికరంగా మారింది. ఆరుతడి పంటలు వేయాలంటే భూసార పరీక్షలు ఇంకా ఇతర సమస్యలతో పాటు మార్కెటింగ్, మద్దతు ధర, కొనుగోలు వంటి సమస్యలు భవిష్యత్‌లో ఎదురవుతాయని భావించి రైతులు వెనకకు తగ్గడం వల్లనే పంటలు వేయలేని పరిస్థితికి వచ్చారు. చాలాచోట్ల వ్యవసాయశాఖ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి రైతులకు స్పష్టంగా చెప్పినప్పటికినీ రైతులు మాత్రం మొగ్గు చూపలేదు. ఈ నెల 15 వరకే ఆరుతడి పంటలు చాలా విత్తనాలు వేయడానికి అవకాశం ఉంది. ఆ తరువాత వేసినా దిగుబడి వచ్చే అవకాశం లేదు. మరో రెండు రోజుల తరువాత నువ్వులు, అలసందులు, కందులు వేసుకోవాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది.
అనూహ్యంగా పెరిగిన కూరగాయల సాగు
ఆరుతడి పంటలకు సంబంధించి అనే క విత్తనాలను వేయడానికి పెద్దగా ఆసక్తి చూపని రైతులు కూరగాయల సాగు విషయంలో ముందుకు వచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 7,820 ఎకరాల్లో కూరగాయలు సాగు చేశారు. ము న్ముందు ఇంకా సాగును పెంచేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. ఉద్యానశాఖతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కూరగాయల సాగు విషయంలో కల్పించిన అవగాహన కొంతమేరకు సఫలీకృతమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి అయితే కూరగాయల దిగుబడి అధికంగా ఇతర జిల్లా నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావం వల్ల రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపారు. ఉన్న నీటి వనరులకు అనుగుణంగా రైతులకు కూరగాయల సాగు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఉపయోగపడనుంది. ప్రస్తుతం మార్కెట్ కూరగాయల ధరలు మండుతున్న పరిస్థితి ఉంది. ఇతర జిల్లాల నుంచి రావడంతోనే ఈ ధరలు పెరుగుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలో కూరగాయల సాగు పెరిగినట్లయితే కూరగాయల దిగుబడి పెరిగి ప్రజలకు ధరలు అందుబాటులో ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. మిగతా ఆరుతడి పంటల మినహా కూరగాయల సాగు అధికం కావడం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరనుంది.