Share News

ఎంబీసీలో ఎండుతున్న పంటలు

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:11 AM

మండలంలోని ముక్త్యాల బ్రాంచ కెనాల్‌(ఎంబీసీ) శివారు భూములకు సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా చింతలపాలెం, శోభనాద్రిగూడెం, అడ్లూరు, తమ్మారం, గ్రామాల్లో సాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. 20 రోజులుగా ఎనఎస్పీ కాల్వ ద్వారా నీరు విడుదల కాక శోభనాద్రిగూడెంలోని వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోయి పొలాలు బీటలు వారుతున్నారు.

ఎంబీసీలో ఎండుతున్న పంటలు
నీరులేక ఎండుతున్న పొలాన్ని చూపిస్తున్న శోభనాద్రిగూడెం రైతు కాశయ్య

సాగర్‌ ఆయకట్టు కింద నీరందక, బోర్లు అడుగంటి ఎండుతున్న పొలాలు

(ఆంధ్రజ్యోతి-చింతలపాలెం)

మండలంలోని ముక్త్యాల బ్రాంచ కెనాల్‌(ఎంబీసీ) శివారు భూములకు సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా చింతలపాలెం, శోభనాద్రిగూడెం, అడ్లూరు, తమ్మారం, గ్రామాల్లో సాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. 20 రోజులుగా ఎనఎస్పీ కాల్వ ద్వారా నీరు విడుదల కాక శోభనాద్రిగూడెంలోని వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోయి పొలాలు బీటలు వారుతున్నారు. ఎంబీసీ నీరు రాకపోయినా శివగంగ ఎత్తిపోతల ద్వారా ఈప్రాంతానికి సాగు నీరందేది. అయితే నాలుగు నెలల క్రితం శివగంగా ఎత్తిపోతల విద్యుత ట్రాన్సఫార్మర్ల కాపర్‌ వైర్లు చోరీకి గురైయ్యాయి. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లినా ఇంతవరకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో మోటార్లు నడవక సాగు నీరందకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అలసత్వంతోనే ఎత్తిపోతల కింద పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగానే పడినా మార్చి రాకముందే భూగర్భజలాలు అడుగంటడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. సాగునీటి కోసం రైతులు అప్పులు చేసి 500 నుంచి 600 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా మొదట నీరు పడినా, ఇప్పుడు చుక్క నీరు లేదు. ఉన్న కొద్దిపాటి నీటితో సాగు చేసిన వరి, మొక్కజొన్న, మిగతా ఆరుతడి పైర్లు నీరు లేక వాడిపోతున్నాయి. చేతికొచ్చిన పంట పశువులుగా మేతగా మారుతుంటే అన్నదాత కన్నీరుమున్నీరవుతున్నారు. పంటలు ఎండిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు తమను కోరుతున్నారు. ఇరిగేషన అధికారులు స్పందించి ఎనఎస్పీ నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, అలాగే శివగంగా ఎత్తిపోతల ట్రాన్సఫార్మర్లకు మరమ్మతులు చేయించి సాగునీరు అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తిస్థాయిలో సాగునీరందిస్తాం

ఎన్నెస్పీ కాల్వ ద్వారా త్వరలో పూర్తిస్థాయిలో నీరందేలా చర్యలు తీసుకుంటాం. శివగంగా ఎత్తిపోతల ఇరిగేషన విద్యుత ట్రాన్సఫార్మర్లలో కాపర్‌వైర్‌ చోరీకి గురైన విషయాన్ని గతంలోనే స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చాం. ప్రస్తుత 10 రోజుల్లో మరమ్మతులు పూర్తయి వినియోగానికి అందుబాటులో ఉంటాయి.

శ్రీనివాస్‌, ఇరిగేషన ఏఈ

Updated Date - Feb 20 , 2026 | 12:11 AM