Share News

పంట వ్యర్థం.. కాల్చితే శిక్షార్హం

ABN , Publish Date - May 27 , 2026 | 11:58 PM

భూసారంతో పాటు పర్యావరణానికి, ఆస్తులకు నష్టం కలిగిస్తోన్న వరికొయ్యల కాల్చివేతపై అవగాహన పెరగాల్సి ఉంది. గ్రామాల్లో రైతులు ఒకరిని చూసి ఒకరు పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు.

పంట వ్యర్థం.. కాల్చితే శిక్షార్హం

(ఆంధ్రజ్యోతి-నూతనకల్‌/ భానుపురి)

భూసారంతో పాటు పర్యావరణానికి, ఆస్తులకు నష్టం కలిగిస్తోన్న వరికొయ్యల కాల్చివేతపై అవగాహన పెరగాల్సి ఉంది. గ్రామాల్లో రైతులు ఒకరిని చూసి ఒకరు పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు. ప్రతి ఏటా వానాకాలం పంటకు ముందు రైతులు పంట వ్యర్థాలను తొలగించుకోవాలి తప్ప భూమి లో తగలబెట్టడం శ్రేయస్కరం కాదని వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పర్యావరణానికి నష్టమే కాకుండా, భూమిలో పోషకాలు, పంటలకు మేలు చేసే కీటకాలు, చనిపోయి చీడ పీడలకు ఆస్కారం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

విషవాయువులు విడుదల

వరి కొయ్యలు, పత్తి కట్టెలు, మొక్కజొన్న వ్యర్థాలను తగలబెట్టినపుడు కార్బనమోనాక్సైడ్‌, కార్బనడైయాక్సైడ్‌, నైట్రోజన డయాక్సైడ్‌, సల్పర్‌ డయాక్సైడ్‌, లాంటి విషవాయువులు విడుదలవుతాయి. వాయు కాలుష్యం బాగా పెరుగుతుంది. పొగతో పాటు బూడిద గాలిలో కలిసి ఉన్న ఊర్లు, నగరాలలో శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు పెరుగుతాయి.

భూసారానికి దెబ్బ...

పంట వ్యర్థాలను కాల్చడంతో నేలలో ఉండే సేంద్రీయ కర్బనం, నైట్రోజన, ఫాస్పరస్‌, పొటాష్‌, గంధకం లాంటి పోషకాలు నాశనమవుతాయి. ఒక టన్ను పంట వ్యర్థం కాల్చడంతో సుమారు 5 నుంచి 6 కిలోల నత్రజని, 2 నుంచి 3 కిలోల పాస్పరస్‌, 25 కిలోల కంటే ఎక్కువ పొటాష్‌, 400కిలోల సేంద్రీయ కర్బనం నష్టం జరుగుతుందని అంచనా. నేలపై మంటతో తేమ శాతం, మేలు

చేసే బ్యాక్టీరియా, ఫంగై తగ్గడంతో నేల బురదగా మారి దున్నడం కష్టమవుతుంది. తర్వాత పంట దిగుబడి తగ్గుతుంది. వెరసి భూగర్బజలాలు ఎక్కువగా వాడాల్సి రావడంతో నీటి ఖర్చు, పంపు ఖర్చు పెరుగుతుంది. పోషకాలు లేకపోవడంతో రసాయినిక ఎరువులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడి ఖర్చు పెరుగుతోంది. దీర్ఘకాలంలో దిగుబడి తగ్గడంతో రైతుకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది.

ఆస్తి, ప్రాణాలకు ప్రమాదమే

పొలాల్లో వ్యర్థాలు నిప్పుపెట్టడం ద్వారా దగ్గరలో ఉన్న ఇతర పంటలు, జీవాలు, గృహాలు, విద్యుత, బోర్లవంటి ఆస్తులు మంటల్లో కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ పొగ, వేడితో పశువులకు శ్వాసకోశ సమస్యలు, కళ్ల సమస్యలు ఏర్పడి పాడి ఉత్పత్తి తగ్గిపోవచ్చు. ఇలాంటి నష్టాలు తగ్గించేందుకు పంట వ్యర్థాలను కాల్చకుండా బయో-గ్యాస్‌, కంపోస్ట్‌, మృత్తిక పొగమంచు, లేదా బయో-చార్‌ వంటి మార్గాల్లో ఉపయోగించడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వరి కొయ్యలను కాల్చకుండా వాటిని నేలలోనే విడిచిపెడితే నేల సారం పెరుగుతుంది.

వరి కొయ్యలను..

వరి కోసి మిగిలిన కొయ్యకాళ్లను తగలబెట్టకుండా పొలంలోనే వదిలేసి, తర్వాత ట్రాక్టర్‌ రొటోవేటర్‌తో 2,3 సార్లు దున్నితే కొయ్యలు ముక్కలై నేలలోకి పోతాయి. వర్షం ఉంటే పొలానికి నీరు పెట్టి, ఎకరాకు 50నుంచి 100 కిలోల సూపర్‌ పాస్పేట్‌ వేస్తే 20 నుంచి 30 రోజులలో కొయ్యలు కుళ్లి సేంద్రీయ కర్బనం, పోషకాలు నేలకు అందుతాయి. వరి గడ్డి కొయ్యలను చిన్న ముక్కలుగా కత్తిరించి పేడ, గోబ్బరం, కిరోసిన లేదంటే పేపర్‌ కలిపి కుప్పల్లో పేర్చి, వేస్ట్‌ డికంపోసర్‌, లేదా సాధారణ కంపోస్ట్‌ బాక్టీరియాతో పిచికారీ చేస్తే 30 నుంచి 45 రోజుల్లో కంపోస్ట్‌ తయారవుతుంది.

ప్రభుత్వం నుంచి చర్యలు

పంట వ్యర్థాలను కాల్చడాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎవరైనా వ్యర్థాలను కాల్చితే జరిమానాలను కఠినంగా అమలు చేస్తామని వ్యవసాయ శాఖ హెచ్చరిస్తోంది. జీవో నెంబర్‌ 27 ప్రకారం సాధారణంగా వ్యవసాయ వ్యర్థాలు కాల్చితే రూ.5000, భారీ స్థాయిలో కాల్చితే రూ.25 వేల వరకు పర్యావరణ పరిహారం కింద జరిమానా రూపంలో వసూళ్లు చేయనున్నారు. అదేవిధంగా కాల్చిన వారు శిక్షార్హులు అవుతారని సూర్యాపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

జరిమానాలు విధిస్తాం

వరి పంట వ్యర్థాలను లేదా ఇతర వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం పూర్తిగా నిషేధిస్తూ ప్రభుత్వం 2017 సంవత్సరంలోనే జీవో నెంబర్‌ను 27 తీసుకువచ్చిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. చట్టప్రకారం సాధారణంగా వ్యవసాయ వ్యర్ధాలను కాల్చినట్లయితే రూ.5000లు జరిమానా, భారీ స్థాయిలో వ్యర్థాలను కాల్చినట్లయితే రూ.25000 వేలు జరిమానా రూపంలో వసూళ్లు చేస్తామని తెలిపారు.

శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి

Updated Date - May 27 , 2026 | 11:58 PM