పల్లెల్లో సాధారణం..పట్టణాల్లో అసాధారణం
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:37 AM
పెట్రో ఉత్పత్తుల కొరత రాబోతోందనే వదంతులతో రెండు రోజులు విక్రయించాల్సిన పెట్రో ఉత్పత్తులు 10గంటల్లోనే ఖాళీ అవుతున్నాయి. పట్టణాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుండగా, పల్లెల్లో, జాతీయ రహదారులపై పెట్రో ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉన్నాయి.
రెండు రోజులు విక్రయించాల్సిన పెట్రో ఉత్పత్తులు 10గంటల్లోనే
అవసరానికి రెండు, మూడు రెట్లు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు
నల్లగొండ, మార్చి 27 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): పెట్రో ఉత్పత్తుల కొరత రాబోతోందనే వదంతులతో రెండు రోజులు విక్రయించాల్సిన పెట్రో ఉత్పత్తులు 10గంటల్లోనే ఖాళీ అవుతున్నాయి. పట్టణాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుండగా, పల్లెల్లో, జాతీయ రహదారులపై పెట్రో ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఆయిల్ కంపెనీలు డీలర్లకు క్రెడిట్ కింద కాకుండా డీడీ తీస్తేనే ఆయిల్ కేటాయింపులు చేస్తుండడంతో పాటు, ఆర్డర్ కింద చెల్లించిన డీడీలను పాత బాకీల కింద జమచేసుకుంటుండడంతో పాటు, ఆయిల్ కొరత రాబోతోందనే వదంతులతో వినియోగదారులు సాఽధారణం కంటే రెట్టిం పు కొనుగోళ్లు చేస్తుండడం వంటి కారణాలతో పెట్రోల్ బంకులపై ఒత్తిడి పెరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి సాధారణం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జిల్లా కేంద్రాలైన నల్లగొండ, సూర్యాపేట, భువనగిరిలో ఈ పరిస్థితి ఏర్పడితే, గ్రామీణ ప్రాంతాల్లో, జాతీయ రహదారుల పక్కన ఉన్న పెట్రోల్ స్టేషన్లలో మాత్రం ఎలాంటి ఒత్తిడి లేకుండా డిమాండ్ మేరకు పెట్రోల్, డీజిల్ లభిస్తోంది. పట్టణాల్లో కొనుగోళ్లు భారీగా పెరగడంతో ట్యాం కర్ వచ్చిన నాలుగైదు గంటల్లోనే అయిపోతోందని, దీంతో మళ్లీ ట్యాంకర్ రా వడానికి 24గంటల సమయం పడుతుండడంతో ఆ మధ్య సమయంలో బం కుల్లో ఆయిల్ లేకపోవడంతో మూసివేయాల్సి వస్తోందని నల్లగొండ పట్టణంలోని ఓపెట్రోల్ బంకు డీలర్ తెలిపారు. ఈరద్దీ కంటే ముందు తమ బంకు లో 4వేల లీటర్ల పెట్రోల్, 10 వేల లీటర్ల డీజిల్ తెప్పిస్తే విక్రయానికి 48 గం టల సమయం పట్టేదని, ఇప్పుడది 10గంటల్లోనే అయిపోతుందన్నారు. ఆయి ల్ కంపెనీల నుంచి కొత్త ఆర్డర్ మేరకు మళ్లీ డీజిల్, పెట్రోల్ తెప్పించడానికి 24గంటల సమయం పడుతున్నందున ఆ మధ్య సమయంలో బంకు మూసివేస్తున్నామని తెలిపారు.
డీడీ ఇచ్చిన వారికే కేటాయింపులు
ప్రతి ఏడాది మార్చిలో ఆయిల్ కంపెనీలు డీలర్ల పాత బకాయిల వసూలు చేస్తాయని, వార్షిక సంవత్సరం ముగుస్తుండటంతో ఈ నెలలో అప్పులివ్వకుం డా పాతబాకీలు వసూలు చేయడం, డీడీలు తీసిన వారికే ఆయిల్ కేటాయింపులు చేస్తారని డీలర్లు చెబుతున్నారు. ఈసారి కూడా అదే విధానం అమలు చేస్తున్న సమయంలోనే తాజాగా ఆయిల్ కొరత ఏర్పడుతందనే వదంతుల తో వినియోగం భారీగా పెరిగి, పెట్రోల్, డీజిల్ బంకుల్లో ప్రతీ రోజూ కొన్నింటిలో ఆయిల్ నిల్వలు లేని పరిస్థితి ఏర్పడిందని డీలర్లు పేర్కొంటున్నారు.