Share News

వాణిజ్య వాహనాలు ఇక ‘ఫిట్‌’

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:57 PM

రహదారులపై ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ విధానం యాదాద్రిభువనగిరి జిల్లాలో అమల్లోకి రానుంది.

వాణిజ్య వాహనాలు ఇక ‘ఫిట్‌’
చౌటుప్పల్‌ మండలం మల్కాపూర్‌లోని ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ కేంద్రం

ఈ నెల 17న మల్కాపూర్‌లో ఏటీఎస్‌ ప్రారంభం

ఇక నుంచి ఫిట్‌నెస్‌ పరీక్షలన్నీ ఇక్కడే

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి)

రహదారులపై ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ విధానం యాదాద్రిభువనగిరి జిల్లాలో అమల్లోకి రానుంది. జిల్లాలోని అన్నిరకాల వాణిజ్య వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలను ఇక నుంచి పూర్తిగా ఆధునిక సాంకేతికతతో కంప్యూటరైజ్డ్‌ విధానంలోనే నిర్వహించనున్నారు. ఈ మేరకు చౌటుప్పల్‌ మండలం మల్కాపూర్‌లో ఏర్పాటుచేసిన ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ కేంద్రం(ఏటీఎ్‌స)ను ఈ నెల 17 నుంచి రవాణాశాఖ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని మల్కాపూర్‌లో 10ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక హంగులు, అంతర్జాతీయస్థాయి సాంకేతికతను జోడించి ఈ ఏటీఎస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రంతో వాహనాల ఫిట్‌నెస్‌ ప్రక్రియ ద్వారా వాహన పటిష్ఠతలో లోపాలను సంపూర్ణంగా గుర్తించడం ద్వారా మరింత రోడ్డు భద్రత చేకూరనుంది.

వాణిజ్య వాహనాలన్నింటికీ ఇక్కడే

యాదాద్రిభువనగిరి జిల్లాలో 2,64,260 వాహనాలు ఉండగా వాటిలో అన్ని రకాల వాణిజ్య వాహనాలు దాదాపు 30శాతం వరకు ఉన్నాయి. జిల్లాలో నడుస్తున్న లారీలు, బస్సులు, స్కూల్‌ బస్సులు, గూడ్స్‌వాహనాలు, క్యాబ్స్‌, ట్యాక్సీలు, ఇతరవాణిజ్య వాహనాలన్నీ ఫిట్‌నెస్‌ గడువు ముగిసినపుడు ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ కేంద్రంలోనే పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. గతంలో మోటార్‌ వాహనాల అధికారులు వాహనాన్ని ప్రత్యక్షంగా పరీక్షలు నిర్వహించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేసేవారు. ప్రస్తుతం జిల్లాలో అందుబాటులోకి వస్తున్న ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ కేంద్రంలో అత్యాధునిక యంత్రాల ద్వారా వాహనాల బ్రేకింగ్‌ సామర్థ్యం, స్టీరింగ్‌ పనితీరు, హెడ్‌లైట్లు, సస్పెన్షన, కాలుష్య ప్రమాణాలతో పాటు ఇతర కీలకమైన అంశాలను పరీక్షించి నివేదికను రూపొందించనున్నారు. దీంతో మానవ ప్రమేయంతో జరిగే పొరపాట్లకు అవకాశం లేకుండాపోతుంది. రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే ఫిట్‌నెస్‌ వాహనాలను గుర్తించి వినియోగం అడ్డుకోవడం సులభం కానుంది. కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఆధునిక యంత్రాల సాయంతో జరిపిన ఫిట్‌నెస్‌ పరీక్షల్లో సామర్థ్యం నిరూపితమైన వాహనాలకే సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. వాహనాలు గుర్తించి, ఫిట్‌నెస్‌ తిరస్కరించిన వాహనాలకు మరమ్మతులు చేపట్టిన తర్వాతనే తిరిగి పరీక్షలకు తీసుకు రావాల్సి ఉంటుంది.

నిర్ణీత గడువులోగా పరీక్షలు చేయించాలి

యాదాద్రిభువనగిరి జిల్లాలోని అన్నిరకాల వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షల కోసం మల్కాపురంలోని ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ కేంద్రం(ఏటీఎస్‌) ఈ నెల17వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. కమర్షియల్‌ వాహనాల యజమానులు తమ వాహనాల ఫిట్‌నెస్‌ గడువును ముందుగానే గుర్తించి, నిర్ణీత తేదీల్లో ఈ ఏటీఎస్‌ కేంద్రంలోనే పరీక్షలు చేయించుకోవాలి. కొత్త విధానం అమలు ద్వారా రహదారులపై భద్రత కలుగనుంది.

సంగెం నరేష్‌, డీటీవో, యాదాద్రి భువనగిరి జిల్లా

Updated Date - Aug 05 , 2026 | 11:57 PM