తెల్లవారితే తొలి ఏడాది పెళ్లిరోజు..
ABN , Publish Date - May 13 , 2026 | 12:06 AM
తెల్లవారితే తొలి ఏడాది పెళ్లి రోజు, అందులోనూ భార్య గర్భవతి. ఇల్లంతా సందడిగా ఉండాల్సిన సమయంలో విషాదం నెలకొంది. బంధువుల శుభకార్యానికి హాజరై వస్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి ఓ యువకుడు మృతి చెందాడు.
శుభకార్యానికి వెళ్లి వస్తుండగా యువకుడి మృత్యువాత
నిడమనూరు, మే 12 (ఆంధ్రజ్యోతి): తెల్లవారితే తొలి ఏడాది పెళ్లి రోజు, అందులోనూ భార్య గర్భవతి. ఇల్లంతా సందడిగా ఉండాల్సిన సమయంలో విషాదం నెలకొంది. బంధువుల శుభకార్యానికి హాజరై వస్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగింది. ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం నిడమనూరు మండల కేంద్రానికి చెందిన కన్నెబోయిన సైదులు కుమారుడు గణేష్(29) హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసి ఏడాదిగా ఇంటి వద్దనే ఉంటూ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మండలంలోని ముకుందాపురంలో మంగళవారం బంధువుల శుభకార్యానికి హాజరై ద్విచక్రవాహనంపై నిడమనూరుకు తిరిగి వస్తున్నాడు. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ముకుందాపురం కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌లో చికిత్సనిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గణే్‌షకు ఏడాది క్రితమే నల్లగొండలోని గొల్లగూడకు చెందిన మమతతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భవతి. ఈ నెల 13(బుధవారం)న వారి పెళ్లిరోజు. భార్య గర్భవతి కావడంతో ఆమె పుట్టింట్లో ఉన్నందున నల్లగొండ వెళ్లాలని భావిస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటం అందరినీ కలిచివేసింది. గణేష్ మృతితో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. గణేష్ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలిపించారు. తండ్రి సైదులు ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సురేష్ తెలిపారు.