చండూరులో రోడ్డుమీదే ఇరువర్గాల ఘర్షణ
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:39 AM
నల్లగొండ జిల్లా చండూరులో ఆదివారం రాత్రి ఇరువర్గాల ఘర్షణతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
చండూరు, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా చండూరులో ఆదివారం రాత్రి ఇరువర్గాల ఘర్షణతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పట్టణంలో కస్తాల ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఓ టీస్టాల్ వద్ద సాయంత్రం సుమారు గంటపాటు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఇరువర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణలో గాయపడిన దోటి కిరణ్ పోలీసులకు పలువురిపై ఫిర్యాదు చేశాడు. ఇటీవల జరిగిన చండూరు మునిసిపల్ ఎన్నికల్లో ఒకటో వార్డు నుంచి బీజేపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యరుల అనుచరులు బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే తాను ఎన్నికల బరిలో ఉండటాన్ని మనసులో పెట్టుకుని తనపై హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపించారు. ఇదిలా ఉండగా వారం కిందట మండలంలోని తుమ్మలపల్లి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో కాయ్ రాజా కాయ్ ఆటల్లో ఉన్న ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులకు దోటి కిరణ్ సమాచారం ఇచ్చాడన్న కారణంతో ఆదివారం రాత్రి దాడులకు పాల్పడినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా దోటి కిరణ్ 16మందిపై పిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు చండూరు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు.
భయాందోళనతో డయల్-100కు 16సార్లు ఫోన
కర్రలతో, రాళ్లు, ఇనుపరాడ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటుంటే చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. ఘటన విషయమై డయల్-100కు 16సార్లు ఫోన చేసినట్లు స్థానికులు తెలిపారు. ఆ సమయంలో సీఐ, ఎస్‌ఐతో పాటు మరికొంత మంది ఎమ్మెల్యే ప్రభుత్వ కార్యక్రమంలో బందోబస్తుకు వెళ్లారు. దీంతో ఘర్షణ ప్రదేశానికి సకాలంలో చేరుకోలేక నివారించలేకపోయారు. అనంతరం చండూరు సీఐ ఆదిరెడ్డి, చండూరు, కనగల్, మునుగోడు ఎస్‌ఐలు శివకుమార్, రాజీవ్‌రెడ్డి, ఇరుగు రవి, సిబ్బందితో కలిసి ఇరువర్గాలను చెదరగొట్టారు.