కంటైనర్ నుంచి రసాయన ద్రావణం లీక్
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:03 AM
రసాయన కంపెనీలో ప్రమాదాలను మరిచిపోయేలోగా మరో ఘటన ప్రజలను కలవరానికి గురిచేసింది. మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి శివారులో దిగుమతి కోసం తెస్తున్న రసాయన ద్రావణం కంటైనర్ నుంచి లీకై దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు ఆందోళన చెందారు.
దుర్వాసనతో భయాందోళనకు గురైన ప్రజలు
చిట్యాల రూరల్, జూన 23 (ఆంధ్రజ్యోతి) : రసాయన కంపెనీలో ప్రమాదాలను మరిచిపోయేలోగా మరో ఘటన ప్రజలను కలవరానికి గురిచేసింది. మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి శివారులో దిగుమతి కోసం తెస్తున్న రసాయన ద్రావణం కంటైనర్ నుంచి లీకై దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు ఆందోళన చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. పిట్టంపల్లి గ్రామపరిఽధిలోని పేరేపల్లికి వెళ్లే మార్గంలో వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్ రసాయన కంపెనీకి సోమవారం సాయంకాలం ఓ కంటైనర్‌లో రసాయన ద్రావణం లోడు వచ్చింది. దిగుమతి చేసుకునేందుకు వీలుకాకపోవడంతో కంపెనీ సమీపంలో నిలిపారు. మంగళవారం ఉదయం దిగుమతి చేసేందుకని వాహనాన్ని కదిలించే ప్రయత్నం చేయగా మొరాయించింది. పలువురు వాహనాన్ని నెట్టుకుంటూ కంపెనీ వద్దకు తీసుకెళ్లే క్రమంలో ఒక్కసారిగా వాహనం కుదుపునకు లోనైంది. దీంతో కంటైనర్‌లో ప్యాకింగ్ చేయబడిన బ్రోమిన రసాయనాల సీసాల బ్యాక్స్‌ల్లోని సుమారు 2 సీసాల్లోని ద్రావణం లీకై వాహనం నుంచి బయటకువచ్చింది. అది కాస్తా పేరేపల్లికి వెళ్లే రోడ్డు మార్గానికి ఇరువైపులా పడింది. దీంతో ఒక్కసారిగా పొగలతో కూడిన మంటలు వ్యాపించాయి. వెలిమినేడు-పేరేపల్లి రోడ్డు మార్గాన వెళ్లే విద్యార్థులు, వాహనదారులు రైతులు దుర్వాసనకు తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు. ఇదిలా ఉండగా కంపెనీ యాజమాన్యం రసాయన ద్రావణం పడిన రహదారిపై పౌడర్ చల్లింది. కంపెనీ గేటు వద్ద నీటితో శుభ్రం చేసింది. అప్పటి వరకు దుర్వాసనతో ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా లారీ నుంచి ద్రావణం లీకైన సమయంలో ఆ దారిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న అంతటి వెంకటేశ్వరు, ఆయన కుమార్తె లహరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకోవడంతో వారిని మొదటి చౌటుప్పల్ ప్రాథమిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం లహరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వెంకటేష్ హెల్మెట్ పెట్టుకోవడంతో అస్వస్థత నుంచి తప్పించుకున్నారు.