Share News

ముఖ గుర్తింపుతో అక్రమాలకు చెక్‌

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:50 AM

పేద విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాల కోసం ప్రభుత్వం వివిధ సంక్షేమ శాఖల ద్వారా వసతి గృహాలను నిర్వహిస్తోంది. ఈ వసతి గృహాల్లో అక్రమాలను కట్టడి చేసేందుకు సాంకేతిక పరికరాలను వినియోగంలోకి తెచ్చింది.

ముఖ గుర్తింపుతో అక్రమాలకు చెక్‌

ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు

ఇప్పటికే రెండు నెలలుగా ప్రాథమికంగా అమలు

(ఆంధ్రజ్యోతి, యాదాద్రి): పేద విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాల కోసం ప్రభుత్వం వివిధ సంక్షేమ శాఖల ద్వారా వసతి గృహాలను నిర్వహిస్తోంది. ఈ వసతి గృహాల్లో అక్రమాలను కట్టడి చేసేందుకు సాంకేతిక పరికరాలను వినియోగంలోకి తెచ్చింది. సంక్షేమ హాస్టళ్లలో వసతి పొందుతున్న విద్యార్థుల సంఖ్యకు, వారికి అందించే రేషన్‌ పరిమాణంలో వ్యత్యాసా లు ఉండటం, సిబ్బంది మొక్కుబడిగా విధులకు హాజరవుతుండటం వంటి అవకతవకల ను గుర్తించిన ప్రభుత్వం ఫేషియల్‌ రికగ్ననైజేషన్‌ (ముఖ గుర్తింపు) హాజరును అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానంతో హాస్టళ్లలో విద్యార్థుల హాజరు, సంక్షేమ అధికారి, ఇతర సిబ్బంది విధుల నిర్వహణలో పూర్తి పారదర్శకత పెరగనుంది.

జిల్లాలోని 17 మండలాల పరిధిలో వివిధ శాఖలకు చెందిన 85 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖలకు చెందిన వాటితో పాటు 19 రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, 11 కేజీవీబీ, ఏడు మోడల్స్‌ స్కూల్స్‌ ఉన్నాయి. వీటిలో వసతి పొందుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏటా నిధులు వ్యయం చేస్తోంది. ఈ నిధుల వినియోగానికి, విద్యార్థుల హాజరు మధ్య వ్యత్యాసాలు ఉంటుండటంతో పలు అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు తరుచూ వినిపిస్తున్నాయి. అదే విధంగా సంక్షేమ వసతి గృహాల్లో సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పర్యవేక్షణ లోపాలు అనేకం వెలుగులో కి వచ్చాయి. దీంతో ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో ని ప్రతి విద్యార్థికి కచ్చితమైన హాజరు ఉండేలా దృష్టి సారించింది. అదే విధంగా ఆయా సంక్షేమ అధికారులు, వంట మనుషులు, ఇతర సిబ్బంది హాజరును సైతం పకడ్బందీగా నమోదు చేయడానికి నిర్ణయించింది. అందులో భాగంగా ఆధునిక సాంకేతికతతో కూడిన ఫేషియల్‌ రికగ్ననైజేషన్‌ ద్వారా ఎవరు.. ఎప్పుడు హాస్టల్స్‌లోకి ప్రవేశించా రు.. ఎప్పుడు బయటికి వెళ్తున్నారో సమయంతో పాటు కచ్చితంగా నమోదవుతోంది. దీంతో ఆయా హాస్టళ్లలో వసతి పొందుతున్న విద్యార్థుల సంఖ్య రోజువారీగా పారదర్శకంగా నమోదవుతోంది. అదే విధంగా అధికారులు, సిబ్బంది హాస్టల్‌కి వచ్చిన సమయం, వెళ్లిన సమయంలో సైతం పారదర్శకత ఉండనుంది. దీంతో అధికారులు, సిబ్బందికి విధుల నిర్వహణలో క్రమశిక్షణ అలవడుతుందని భావిస్తున్నారు.

రెండు మాసాలుగా అమలు

హాస్టల్‌ విద్యార్థులు, సంక్షేమ అధికారులు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరుకు ఫేషియల్‌ రికగ్ననైజేషన్‌ విధానాన్ని రెండు మాసాలుగా అమలు చేస్తున్నారు. ఈ హాజరు నమోదులో ప్రాథమికంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్టు హాస్టల్‌ సిబ్బంది. రెసిడెన్షియల్‌ పాఠశాలల అధ్యాపకులు పేర్కొంటున్నారు. ఆయా హాస్టల్‌, పాఠశాలల ఆవరణలోనే ఫేస్‌ రికగ్ననైజేషన్‌ను క్యాప్చర్‌ చేస్తుండగా, లొకేషన్‌ ఫార్‌ అవే అంటూ నమోదవుతోందని పేర్కొంటున్నారు. తొలుత రేఖాంశాలు, అంక్షాంశాల గుర్తింపు ప్రకారం లొకేషన్‌ నమోదులో కొంత సాంకేతిక ఇబ్బందులు వచ్చినా ప్రస్తుతం సరిపోలుతోందంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో లొకేషన్‌ ఫార్‌ అవే అని చూపుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా కచ్చితమైన హాజరు : అనురాగ్‌ జయంతి, కలెక్టర్‌

జిల్లాలోని వివిధ శాఖల ద్వారా నిర్వహిస్తున్న విద్యార్థి వసతి గృహాల్లో వసతి పొందుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు, సిబ్బందికి ఫేషియల్‌ రికగ్ననైజేషన్‌ విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అమలవుతోంది. జిల్లాలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్‌, మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీ, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో విద్యార్థుల, సిబ్బంది హాజరును ఇక నుంచి తప్పకుండా ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారానే ధ్రువీకరిస్తారు.

Updated Date - Mar 17 , 2026 | 12:50 AM