మూడేళ్లుగా నిలిచిన శ్మశానవాటిక పనులు
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:46 PM
చౌటుప్పల్ పట్టణంలోని బంగారిగడ్డ శ్మశాన వాటిక నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో కట్టడాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. గ
శిథిలావస్థకు చేరుతున్న కట్టడాలు
కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించని గత ప్రభుత్వం
కనీస సౌకర్యాలు కరువై ఇబ్బంది పడుతున్న ప్రజలు
(ఆంధ్రజ్యోతి-చౌటుప్పల్ టౌన): చౌటుప్పల్ పట్టణంలోని బంగారిగడ్డ శ్మశాన వాటిక నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో కట్టడాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ పనులకు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. చివరి మజిలీకి వచ్చే ప్రజలకు కనీస సౌకర్యాలు కరువై ఇబ్బందులకు గురవుతున్నారు. వేసవి కాలంలో జరిగే దహన సంస్కారాలకు వచ్చే ప్రజలు ఎండల తీవ్రతకు తట్టుకోలేని పరిస్థితి. మూడు సంవత్సరాలుగా శ్మశాన వాటిక నిర్మాణ పనులు నిలిచి పోవడంతో కట్టడాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ప్రహారీ గోడ లేక పోవడంతో దహన సంస్కారాల బూడిద చుట్టు పక్కల ఇళ్లలోకి వెళుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పట్టణ ప్రజలకు సంబంధించిన ఈ శ్మశాన వాటికపై గత పాలకవర్గం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పనులు ఇలా..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021లో శ్మశాన వాటిక నిర్మాణం కోసం స్టేట్ గ్రాంట్ నుంచి ఒక కోటి రూపాయలను మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ పనులను ఆనలైన టెండర్ ద్వారా వైఎమ్మార్ కనస్ట్రక్షన ప్రాజెక్ట్ దక్కించుకుంది. ఇందులో చేపట్టిన మూడు దహన క్రియల ప్లాట్ ఫామ్‌లు, విశ్రాంతి హాల్, స్నానాల గదులు, మరుగుదొడ్లు తదితర నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయు. కొంత మేరకు ప్రహరీ గోడను నిర్మించి వదిలి వేశారు. అసంపూర్తిగా ఉన్న కట్టడాలతో చివరి మజిలీకి వచ్చే ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని పరిస్థితి ఏర్పడింది. శ్మశాన వాటిక ప్రాంతం పిచ్చి మొక్కలు, ఎండుగడ్డి, ముళ్ల పొదలతో నిండి పోయింది. అసంపూర్తి కట్టడాలు చుట్టు పక్కల ప్రజలకు బహిర్భూమిగా మారిపోయాయి. దహన సంస్కారాల సమయంలో వాటర్ ట్యాంక్ వద్ద బహిరంగ ప్రాంతంలోనే స్నానాలు చేయవలసి రావడంతో మహిళలు చాలా ఇబ్బంది పడవలసి వస్తోంది.
54 శాతం పనులు పూర్తి
శ్మశాన వాటిక నిర్మాణ పనులు 54శాతం పూర్తి జరిగినట్టుగా ఇంజనీరింగ్ అధికారులు రికార్డు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పనులకు సంబంధించి కాంట్రాక్టర్‌కు ఒక్క రూపాయి కూడా చెల్లించనట్టు రికార్డులు చెబుతున్నాయి. దీంతో 2023 ప్రారంభంలోనే నిర్మాణ పనులను నిలిపివేశారు. 2023 డిసెంబరు 7వ తేదీన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ శ్మశాన వాటిక గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రహరీ లేక పోవడంతో చితి మంటల బూడిద గాలికి ఎగిరి వచ్చి తమ ఇళ్లలోకి వస్తోందని, ఈ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చుట్టు పక్కల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తైన ప్రహరీ గోడ తో పాటు అసంపూర్తి కట్టడాల పనులను పూర్తి చేయించి ఉపయోగంలోకి తీసుకురావాలని పట్టణ ప్రజల కోరుతున్నారు.
అవకతవకలపై విచారణ చేయిస్తాం
ఎండీ. హన్నూబాయి, 20 వ వార్డు కౌన్సిలర్, చౌటుప్పల్
శ్మశానవాటిక నిర్మాణంలో జరిగిన అవతవకలపై విచారణ చేయిస్తాం. కనీస సౌకర్యాలు లేకపోవడంతో చివరి మజిలీకి వచ్చిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మునిసిపల్ చైర్‌పర్సన పావనీరమేష్‌గౌడ్‌తో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం. శ్మశానవాటిక పట్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది.
శ్మశాన వాటిక నిర్మాణ పనులపై సమీక్ష చేస్తాం
ఎం.పావనీరమేష్ గౌడ్, చైర్ పర్సన, చౌటుప్పల్ మునిసిపాలిటీ
బంగారిగడ్డ శ్మశాన వాటికలో అర్ధాంతరంగా నిలిచి పోయిన పనులపై సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగినట్టు తనకు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలిస్తున్నాం. గత ప్రభుత్వంలో చేపట్టిన ఈ పనులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. చివరి మజిలీకి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలను కల్పిస్తా.