గుట్టను తొలిచి..కడీల వ్యాపారం
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:36 AM
రెండేళ్లుగా అక్రమంగా మైనింగ్ జరుగుతున్నా అధికారుల అటుగా కన్నెత్తి చూడలేదు. గుట్టలను తొలచి బండలను కడీరాళ్లుగా మలిచి గుట్టుచప్పుడు వ్యాపారం చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది.
నార్కట్‌పల్లి మండలం నైబావి శివారు బొల్లిగుట్టల్లో అక్రమ మైనింగ్
మైనింగ్ ప్రాంతం వద్ద ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలు
(ఆంధ్రజ్యోతి-నార్కట్‌పల్లి)
రెండేళ్లుగా అక్రమంగా మైనింగ్ జరుగుతున్నా అధికారుల అటుగా కన్నెత్తి చూడలేదు. గుట్టలను తొలచి బండలను కడీరాళ్లుగా మలిచి గుట్టుచప్పుడు వ్యాపారం చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ఎం.ఎడవల్లి, మాండ్ర గ్రామపంచాయతీల సరిహద్దులో నైబావి గ్రామ శివారున బొల్లిగుట్ట ఉంది. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ఆధీనంలోని ఈ గుట్టలో పచ్చగా చెట్లు పెరిగిన ప్రాంతాన్ని అటవీశాఖకు స్వాధీనపర్చే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇదే బొల్లిగుట్టకు మాండ్ర వైపున ఉన్న భాగంలో కొందరు మైనింగ్ వ్యాపారం(కడీరాళ్లను తొలచి సరఫరా) చేసే వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా బొల్లిగుట్లను తొలిచి కడీరాళ్లను, బేస్‌మెంట్ రాళ్లుగా చేసి విక్రయిస్తున్నారు. నార్కట్‌పల్లితో పాటు చుట్టుపక్కల రియల్‌ఎస్టేట్ వ్యాపారులతో పాటు రైతుల మధ్య గెట్టు పంచాయితీల నేపథ్యంలో చాలామంది భూముల సరిహద్దుల వెంబడి కడీరాళ్లను పాతిస్తున్నారు. దీంతో కడీరాళ్లకు డిమాండ్ రావడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల ఇతర నిర్మాణాలకు బేస్‌మెంట్ రాళ్లు కూడా కావాల్సి ఉండటంతో మైనింగ్ మాఫియా అక్రమ వ్యాపారానికి బొల్లిగుట్టను ఎంచుకుంది. యంత్ర పరికరాలతో కడీరాళ్లను, బేస్‌మెంట్ రాళ్లను తొలచి వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్ కడీరాళ్లకు రూ.7000ల వరకు విక్రయిస్తున్నారు. ప్రతీ రోజూ పెద్దమొత్తంలో కడీరాళ్లను విక్రయిస్తున్నారు. దీంతో ప్రకృతి సిద్ధమైన గుట్టలు క్రమంగా కరిగిపోతున్నాయి. ఎం.ఎడవల్లి గ్రామస్థులు బొల్లిగుట్టను క్రమంగా తొలచి గుట్టుగా చేస్తున్న ఈ అక్రమ మైనింగ్‌ను గమనించారు. రాళ్లను తొలగించేందుకు సమీపంలోని ఓ వ్యవసాయ బావి నుంచి అక్రమంగా విద్యుత సరఫరా చేసుకుంటున్న తీరు విస్మయం కలిగిస్తోంది. బండరాళ్లను తొలిచే క్రమంలో పెద్దఎత్తున గుంతలు ఏర్పడి అవి ప్రమాదకరంగా పరిణమించాయి.
ఈ ఉదంతాన్ని వీడియో తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ అక్రమం వెలుగులోకి వచ్చినా సంబంధిత అధికారులు స్పందించలేదు.
అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలి
బొల్లిగుట్ట శివారులో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేయాలి. క్వారీ తరహాలో నిర్వహిస్తున్న రాళ్ల తొలచే పనులు చేస్తున్న బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడంతో పాటు ప్రకృతి సిద్ధమైన గుట్టలను ధ్వంసం చేస్తున్న వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి.
శ్రీనివా్‌సరెడ్డి, ఉపసర్పంచ, ఎం.ఎడవల్లి జీపీ
మా దృష్టికి రాలేదు
బొల్లిగుట్టకు సమీపంలో రాళ్లు తొలచి అక్రమ మైనింగ్ చేస్తున్నారన్న ఫిర్యాదులు రాలేదు. రాళ్లు కొట్టుకుంటామని ఎవరూ కూడా అనుమతి కోరలేదు. గుట్ట ఉన్న ప్రదేశం పట్టాభూమి అయినా సరే అక్కడి నుంచి మట్టి తరలించాలన్నా, రాయిని తొలచి తరలించాలన్నా అనుమతి తీసుకోవాల్సిందే. సిబ్బంది చేత తనిఖీ చేయించి అనుమతులు లేకుండా మైనింగ్ కొనసాగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం.
ఎల్.వెంకటేశ్వర్‌రావు, తహసీల్దార్, నార్కట్‌పల్లి