జాగ్రత్త చేస్తున్న రైతును మింగిన అజాగ్రత్త
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:50 PM
మఠంపల్లి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : రోడ్డుపై ట్రాక్టర్ టైర్ పంక్చర్ కావడంతో రాళ్లు పెడుతున్న రైతు ప్రాణం ఓ వాహన డ్రైవర్ నిర్లక్ష్యం బలితీసుకుంది. పంట విక్రయించి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో రైతు మృతి చెందాడు.
గూడ్స్ వాహనం ఢీకొని మృతి
మఠంపల్లి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : రోడ్డుపై ట్రాక్టర్ టైర్ పంక్చర్ కావడంతో రాళ్లు పెడుతున్న రైతు ప్రాణం ఓ వాహన డ్రైవర్ నిర్లక్ష్యం బలితీసుకుంది. పంట విక్రయించి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని బక్కమంతులగూడెంలో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ బాబు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం బక్కమంతులగూడెం గ్రామానికి చెందిన బోగాల కృష్ణారెడ్డి(45) తన తోటలోని మామిడికాయలను ట్రాక్టర్‌లో హుజూర్‌నగర్ తీసుకెళ్లి విక్రయించి, తిరిగి వస్తున్నాడు. బక్కమంతులగూడెం గ్రామశివారులోని తిరపతమ్మ ఆలయం వద్ద రాగానే ట్రాక్టర్ పంక్చర్ కావడంతో దిగి ట్రాక్టర్‌కు రాళ్లు పెడుతున్నాడు. మఠంపల్లి నుంచి హుజూర్‌నగర్ వెళ్తున్న గూడ్స్ వాహన డ్రైవర్ నిర్లక్ష్యంతో కృష్ణారెడ్డిని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన కృష్ణారెడ్డిని స్థానికులు ఓ వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కృష్ణారెడ్డికి భార్య, పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాబు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు.