Share News

నాలుగేళ్లకు మించి ఒకేచోట కుదరదు

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:06 AM

ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే చోట నాలుగేళ్లు పనిచేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి చేసింది.

నాలుగేళ్లకు మించి ఒకేచోట కుదరదు

ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత

జిల్లాలో 1,200 మంది ఉద్యోగులపై ప్రభావం

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) : ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే చోట నాలుగేళ్లు పనిచేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి చేసింది. మే 1 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత ఉత్తర్వులు అమలులో ఉంటాయి. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులు సుమారు ఆరు వేల మంది వరకు పనిచేస్తున్నారు.

ప్రభుత్వం రెండేళ్ల తర్వాత బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ హో దాల్లో పనిచేస్తున్న సుమారు 1,200 మంది ఉద్యోగుల పై ఈ ఉత్తర్వుల ప్రభావంపడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

మూడేళ్లకు బదిలీ అర్హత.. నాలుగేళ్లయితే తప్పనిసరి

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిషేధం ఎత్తివేత ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది జనవరి 1, వరకు ఒకే చోట మూడేళ్ల సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగులు బదిలీ కి అర్హులు. నాలుగేళ్లు పనిచేసిన ఉద్యోగికి తప్పనిసరి గా బదిలీ ఉంటుంది. అదే విధంగా 2027, మే 31 వరకు ఉద్యోగ విరమణ పొందే ఉద్యోగి నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసినా బదిలీ ఉత్తర్వు వర్తించదు. అయితే సదరు ఉద్యోగి కోరుకుంటే బదిలీ పొందవచ్చు. ఆయా క్యాడర్‌ స్ర్టెంత్‌లో 40శాతానికి లోబడి మాత్రమే బదిలీ చేయాలి. అదే విధంగా స్పౌజ్‌ కేసు లో ఒకరు మాత్రమే బదిలీకి దరఖాస్తుచేసుకోవాలి. 70శాతం దివ్యాంగులైన ఉద్యోగికి, మానసిక వైకల్యం ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు ఉన్న ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వుల నుంచి మినహాయింపులు ఇచ్చారు. అనారోగ్య కారణాలతో బదిలీల్లో స్వయంగా, ఉద్యోగిపై ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు సైతం అనారోగ్యంతో ఉంటే మినహాయింపులు వర్తిస్తాయి. వైద్య, ఆరోగ్య కారణాలతో మినహాయింపులకు క్యాన్సర్‌, న్యూరో సర్జరీ, కిడ్నీ, లివర్‌ ట్రాన్స్‌ఫ్లాంటేషన్‌, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, టీబీ వ్యాధులను నోటిఫై చేశారు. ఇదిలా ఉండగా, రెండేళ్ల తర్వాత బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో ఉద్యోగులు స్థానచలనం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బదిలీల కసరత్తును ఆయాశాఖల అధికారులు ప్రారంభించనున్నారు.

పారదర్శకంగా చేపట్టాలి : మందడి ఉపేందర్‌రెడ్డి, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్‌

రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల తర్వాత ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయడం హర్షనీయం. వివిధ కారణాలతో బదిలీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రయోజనకరం. అదే విధంగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేసే వారికి కూడా బదిలీకి అవకాశం ఏర్పడనుంది. అయితే ఈ బదిలీలు పారదర్శకంగా సర్వీస్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలి. రాజకీయ, అధికార ఒత్తిళ్లు లేకుండా బదిలీలు చేయాలి. వైద్య, ఆనారోగ్య కారణాలు, దివ్యాంగులు, స్పౌజ్‌ కేసుల్లో బదిలీల కోసం ఎదురుచూసున్న ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు ఊరట కలిగించనున్నాయి. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలు అందిస్తున్న సుమారు 1,200 మంది వరకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

Updated Date - Apr 22 , 2026 | 12:06 AM