వానొస్తే నడిచేదెట్టా?
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:14 AM
వర్షాకాలం సమీపించింది. మరో వారంలోగా వానలు కురుస్తాయని వాతావరణశాఖకు ప్రకటించింది. అయితే వర్షం పడితే జిల్లా కేంద్రంలో వీధుల్లో నడి చే పరిస్థితి లేదని పట్టణ ప్రజలు భయపడుతున్నారు. అస్తవ్యస్త రహదారులతో వాహనదారులు జంకుతున్నారు.
జిల్లా కేంద్రంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం తవ్వకాలు
ప్రయాణించేందుకు జంకుతున్న పాదాచారులు, వాహనదారులు
ఇటీవల సమీక్షలో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
(ఆంధ్రజ్యోతి,సూర్యాపేట టౌన్) : వర్షాకాలం సమీపించింది. మరో వారంలోగా వానలు కురుస్తాయని వాతావరణశాఖకు ప్రకటించింది. అయితే వర్షం పడితే జిల్లా కేంద్రంలో వీధుల్లో నడి చే పరిస్థితి లేదని పట్టణ ప్రజలు భయపడుతున్నారు. అస్తవ్యస్త రహదారులతో వాహనదారులు జంకుతున్నారు. ప్రధానంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం జిల్లా కేంద్రంలోని దాదాపు అన్ని వీధుల్లో రహదారులను తవ్వడంతో గుంతలమయం గా మారాయి. వర్షం వస్తే ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇటీవల కలెక్టరేట్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్వహించే కాంట్రాక్టర్, అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లా కేంద్ర రహదారుల పరిస్థితిపై కలెక్టర్ తేజ్‌సనందలాల్‌పవార్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. అయినా పరిస్థితిలో ఎలాం టి మార్పులేదు. అంతేగాక సీపీఐ(ఎంఎల్)మా్‌సలైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో సైతం మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య రహదారుల పరిస్థితి ప్రస్తావించి నిరసన తెలిపారు.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులతోనే..
సూర్యాపేట పట్టణంలోని అన్ని వార్డుల్లో రో డ్డు మధ్యలో తవ్వకాలు చేపట్టి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రం లో 18నెలల క్రితం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పను లు ప్రారంభమయ్యాయి. రూ.300కోట్ల వ్యయం తో 240కిలోమీటర్ల పొడవుతో ఈ పనులు కొనసాగుతున్నాయి. పబ్లిక్ హెల్త్ విభాగం ఆధ్వర్యం లో ఈ పనులు సాగుతుండగా, తీవ్ర జాప్యం కారణంగా ప్రజలు, వాహనదారులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. 15అడుగుల వెడల్పు రోడ్డు, 20అడుగుల రోడ్డులో కూడా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయి. దీంతో వెడల్పు తక్కువ గా ఉన్న రోడ్లపై బైకులు వెళ్లాలంటే ఇబ్బందిగా మారింది. దుకాణాల ఎదుట పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో ఇరుకు వీధుల్లో జాగ్రత్తగా బైకు లు నడపాల్సి వస్తోంది. ప్రధానంగా తెలంగాణ తల్లి విగ్రహం నుంచి విజేత హోటల్ వెళ్లే రోడ్డు ఇరుకుగా ఉంది. అదేవిధంగా విద్యానగర్‌లో పలు రోడ్లు ఇరుకుగా ఉండడంతో వాహనదారు లు ప్రమాదాల బారిన పడుతున్నారు.ఇలా అన్ని వీధులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. పాతవ్యవసాయ మార్కెట్ రోడ్డు, కూరగాయల మార్కెట్ రోడ్డు, అలంకార్‌సెంటర్, బొడ్రాయిబజార్,ఆస్పత్రులు ఉండే విద్యానగర్‌లో రహదారు లు వెడల్పు తక్కువగా ఉండడంతో రాత్రివేళ పాదచారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. కనీసం తవ్విన చోట మట్టితో లెవలింగ్ చేయలేదు.
వర్షాలు కురిస్తే బురదమయం
పట్టణంలో వెడల్పు ఎక్కువగా ఉన్న రోడ్లు తక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఇరుకు వీధు లే ఉన్నాయి. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల కారణంగా వర్షం కురిస్తే రోడ్లన్నీ బురదమ యం మారుతున్నాయి. వర్షాకాలం రాకముం దే రోడ్డు వెడల్పు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో డ్రైనేజీ పనులు పూర్తిచేసి కొత్త రోడ్లను నిర్మించాల్సి ఉంది. 2027 మార్చి నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. శ్రీరాంనగర్, బాలాజీనగర్, సదాశివరెడ్డి ఫంక్షన్‌హాల్ రోడ్ల ల్లో డ్రైనేజీ పనులు పూర్తి చేసి అక్కడ రోడ్లు నిర్మించారు. కేవలం 15శాతం మాత్రమే పూర్తిస్థాయిలో కొత్త రోడ్ల నిర్మాణం చేశారు. వీటి నిర్మాణం పూర్తయితే ఐదేళ్ల వరకు కాంట్రాక్టరే నిర్వహణ బాధ్యతలు చూడాలి. ఎక్కడైన దెబ్బతింటే మరమ్మతులు చేయాలి. ప్రస్తుతం వర్షం వస్తే ద్విచక్రవాహనదారులు రోడ్లపై నడిపే పరిస్థితి లేదు. ఇక కారు, ఆటోల పరిస్థి తి చెప్పలేనిదిగా ఉంది. లక్షకు పైగా జనాభా ఉన్న సూర్యాపేట మునిసిపాలిటీ రోడ్లన్నీ గుంతలమయంగా దర్శనమిస్తున్నాయి.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఇలా..
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు యుద్ధప్రాతిపాదికన నిర్వహించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా సాగుతున్నాయి. పలు చోట్ల రోడ్లను తవ్వి డ్రైనేజీ పైపులు వేశారు. రోడ్డుకు రెండు వైపులా ఉన్న ఇళ్లు, దుకాణాలకు కనెక్షన్ ఇవ్వా ల్సి ఉంది. ప్రతీ వీధిలో మ్యాన్‌హోల్స్ ఏర్పాటు చేశా రు. దుకాణాలు, ఇళ్లకు సంబంధించిన మురుగు నీటి పైపులైన్లను ఈ డ్రైనేజీకి కనెక్షన్ ఇవ్వాలి. బాత్‌రూం, మరుగుదొడ్ల నీరు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పైప్‌లైన్‌లోకి వెళ్తే పట్టణంలో దోమల బెడద తగ్గుతుంది. అండర్‌గ్రౌం డ్ డ్రైనేజీ పైపుల ద్వారా మురుగు పట్టణంలోని పుల్లారెడ్డి చెరువులో నిర్మించిన 10ఎంల్‌డీ సీవరే జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(ఎ్‌సటీపీ)కు వెళ్తుంది. అక్కడ మురుగునీటిని శుభ్రం చేస్తారు. కొన్ని ప్రాంతాల మురుగు నీటిని నల్లచెరువులోని 10ఎంఎల్‌డీ ఎస్‌టీపీ ప్లాంట్‌కు పంపుతారు. అయితే అక్కడ ఎస్‌టీపీ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసినా, విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. దీనికి ప్రభుత్వం రూ.20లక్షలు కేటాయించింది. ఈ పనుల్లో సైతం జాప్యం జరుగుతోంది. మొత్తం 240 కిలోమీటర్ల పైపులైన్‌కు 190కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఇంకా 50 కిలోమీటర్ల పైపులైన్ ఏర్పాటుచేయాల్సి ఉంది. పట్టణంలో 48వార్డులు ఉండగా, విలీనమైన గ్రామాల్లో కుడకుడ మినహా మిగతా ఎనిమిది గ్రామాల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు లేవు.
డ్రైనేజీ పనులు పూర్తిచేయాలి
పట్టణంలో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి. ఇప్పటికే మాస్‌లైన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాం. భవిష్యత్‌లో ఉద్యమాలు ఉధృతం చేస్తాం. రోడ్ల మధ్య గుంతలు ఉండడంతో వాహనాలు నడిపే సమయంలో అదుపుతప్పి కిందపడుతున్నారు. వర్షాకాలం వస్తే రోడ్లు మరీ ఘోరంగా తయారవుతాయి. రోడ్లను తవ్విన వెంటనే పనులు పూర్తిచేసి రోడ్డు వేయాల్సి ఉన్నా, అలా చేయకుండా వదిలేస్తున్నారు. మొత్తం పనులు పూర్తయ్యాక రహదారులు నిర్మిస్తే అప్పటి వరకు ప్రజలకు ఇబ్బంది తప్పదు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా పనులు త్వరగా పూర్తిచేయాలి.
కొత్తపల్లి శివకుమార్, మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి: త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు : అనిల్, మునిసిపల్ పబ్లిక్‌హెల్త్ ఏఈ
పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిర్మాణం పూర్తికి యుద్ధప్రాతిపాదకన చర్యలు తీసుకుంటున్నాం. తక్కువ సమయంలో పనులు పూర్తి చేసేలా చూస్తున్నాం. పట్టణ ప్రజల సహకారంతో విలీన గ్రామాలు మినహా అన్ని చోట్ల పనులు చేపట్టి మురుగునీటిని ఎస్‌టీపీ ప్లాంట్‌కు పంపి శుభ్రం చేస్తాం. 2027 మార్చి నాటికి పనులు పూర్తిచేస్తాం.