Share News

నాణేలతో బైక్‌ కొనుగోలు

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:14 AM

చిట్యాలరూరల్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేయాలంటే ఎవరైనా బైక్‌ షోరూంనకు వెళ్లి నగదును (నోట్ల కట్టలు), లేక చెక్కు రూపంలో చెల్లిస్తారు. కానీ ఓ వ్యక్తి తను

   నాణేలతో బైక్‌ కొనుగోలు

రూ.10 నాణేలు 9600, రూ.20 నాణేలు 700

5 గంటల పాటు ఎనిమిది మంది లెక్కింపు

దా చుకున్న రూ.10, రూ.20 నాణేలతో స్పెండర్‌ ప్లస్‌ బైక్‌ను కొనుగోలు చేశాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... వెలిమినే డు గ్రామానికి చెందిన కొండె రఘుపతి సెంట్రింగ్‌ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే సమయంలో ఉపయోగపడతాయని తన వద్ద ఉండే రూ.10 నాణేలను రోజూ ఇంట్లో దాచుకునేవాడు. వాటిని బ్యాగులు, కవర్లలో పెట్టి దాచుకున్న నాణేలు అవసరానికి ఉయోగపడుతాయని పోగుచేశాడు. ఆరేళ్లుగా నాణేలను దాచుకోగా రూ.10 నాణేలు చెల్లుబాటు కావని ప్రచారం జరిగినా కూడా ఏ మాత్రం వెరవకుండా పురాతన నాణేలుగా చరిత్రలో ఉంటాయని అనుకుని వాటిని దాచాడు. కానీ తాను పుణ్యక్షేత్రాలకు వెళ్లే సమయంలో ఉపయోగపడతాయని దాచుకున్న నాణేలు ఇప్పుడు బైక్‌ కొనుగోలు చేసే అవసరాన్ని తీరుస్తాయనుకోలేదు. దీంతో తన వద్ద ఉన్న రూ.10, రూ.20 నాణేలతో కొత్తగా ఆలోచించి ఈ నెల 7వ తేదీన బైక్‌ను ఒనుగోలు చేశాడు.

చిల్లరతోనే కొనుగోలు

చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన కొండె రఘుపతి కొన్నేళ్లు గా సెంట్రింగ్‌ మేస్త్రీగా పని చేస్తుంటాడు. తాను పనిచేసేందుకు వెళ్లే సమయంలో తన బైక్‌ రెండు రోజులకో మారు మరమ్మతులకు గురవుతుండగా రఘుపతి విసిగిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన కొత్త బైక్‌ను కొనుగోలు చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడు. బైక్‌ కొనుగోలు చేయాలంటే ఒకేసారి సుమారు లక్షకు పైగా వెచ్చించేదెలా అని ఆలోచిస్తున్నాడు. దీంతో ఇంట్లో తను దాచిన రూ. 10 నాణేలు గుర్తుకు వచ్చాయి. వెంటనే తన వద్ద ఉన్న నాణేలు నింపిన 20 బ్యాగులను తీసుకెళ్లేందు కు బరువుగా ఉండటంతో కారులో వాటిని చిట్యాలలోని వి నాయక హీరో మోటార్స్‌ బైక్‌ షోరూం వద్దకు తీసుకెళ్లాడు. బ్యాగులు, కవర్లలోని నాణేలను కుప్పగా పోశాడు. అందులో రూ. 10నాణేలు, రూ.20నాణేలు ఉండగా వాటిని లెక్కించేందుకు రఘుపతి, ఆయన కుమారుడు, స్నేహితుడు, షోరూం యజమాని ఉప్పు మధుతో పాటు నలుగురు సిబ్బంది మొత్తం ఏడుగురు కలిసి నాణేలను సుమారు 5 గంటలు శ్రమించి లెక్కించారు. రూ.10 నాణేలు 9600 రూ. 96 వేలు, రూ. 20నాణేలు 700 రూ.14వేలు ఉండగా మొత్తం రూ.1,10లక్షలను వినాయక మోటార్స్‌ యజమాని మఽధుకు అప్పగించాడు. ఆయన వాటిని స్వీకరించి రఘుపతికి హీరో స్పెండర్‌ ప్లస్‌ బైక్‌ తాళం చెవిని అందజేశారు.

పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు దాచుకున్నా

పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు నాణేలు దాచుకున్నా. వెళ్లడానికి డబ్బు లు అవసరమవుతాయని ఆలోచించి రూ.10 నాణేలను దాచుకున్నా రు. తాపీ మేస్త్రీగా పనిచేస్తూ రూ.10 నాణేలను ఆరేళ్లుగా దాచుకుంటున్నాను. రూ.10 నాణేలు మార్కెట్‌లోకి వచ్చిన రోజుల్లో కొన్నింటిని సేకరించాను. ఆరేళ్ల క్రితం రూ.10 నాణేలు బరువుగా ఉం డటం, వాటిని వెంట తీసుకెళ్లలేకపోయాను. నాణేలు చెల్లుబాటు కావడం లేదని ప్రచారం జరిగింది. చెల్లుబాటు కాకుంటే పురాతన నాణాలుగా ఉండిపోతాయని దాచుకున్నాను. అంతేకాక కొత్తగా వచ్చిన రూ. 20 నాణేలు కూడా సేకరించాడు. వాటితోనే ఇప్పుడు ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేశాను.

- కొండె రఘపతి, వెలిమినేడు, చిట్యాల

Updated Date - Jul 10 , 2026 | 12:14 AM