Share News

ఉపాధి నిధులతో భవనాలు

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:17 AM

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లాలో మహిళా సంఘాలకు, అంగన్‌వాడీ కేంద్రాల తో పాటు గ్రామపంచాయతీలకు పక్కా భవనాలు సమకూరుతున్నాయి.

ఉపాధి నిధులతో భవనాలు

ప్రారంభోత్సవాల సందడి

జిల్లా మహిళా సమాఖ్య భవనంతో పాటు 30 భవనాలు ప్రారంభానికి సిద్దం

ఇందిరాగాంధీ జయంతి రోజు వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

ప్రారంభానికి సిద్ధమైన ఇందిరాశక్తి జిల్లా మహిళా సమాఖ్యభవనం

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లాలో మహిళా సంఘాలకు, అంగన్‌వాడీ కేంద్రాల తో పాటు గ్రామపంచాయతీలకు పక్కా భవనాలు సమకూరుతున్నాయి.జిల్లా మహిళా సమాఖ్యతోపాటు 20 స్వయం సహాయక సంఘాలకు సొంత భవనాలు, ఆరు పంచాయతీలకు కార్యాలయాలు,మూడు అంగన్‌వాడీకేంద్రాలకు భవనాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి.

మహిళా సంఘాల, గ్రామపంచాయతీల, అంగన్‌వాడీల భవనాలను సుమారు రూ. 8.94కోట్ల అంచనా వ్యయంతో నిర్మించగా, వాటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఈ నెల 19న పండుగలా ఈ భవనాల ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తుది మెరుగు లు దిద్దుతోంది. సీఎం రేంవత్‌రెడ్డి వర్చువల్‌గా రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన మహిళా సంఘాల, అంగన్‌వాడీల భవనాలతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయాల భవనాలను ప్రారంభించనున్నారు.

ప్రారంభానికి సిద్ధమైన భవనాలు

జిల్లాలో మహిళా సంఘాలు, అంగన్‌వాడీ, గ్రామపంచాయతీలకు 30 భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. వీటిలో 20 స్వయం సహాయక సంఘాల భవనాలు, ఆరు గ్రామపంచాయతీ,మూడుఅంగన్‌వాడీల భవనాలు ఉన్నా యి. వీటిలోభువనగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 15 భవనాలు, ఆలేరులో ఎనిమిది, ము నుగోడులో నాలుగు, నకిరేకల్‌లో రెండో భవనా లు ఉన్నాయి. ఈభవనాలతో పాటు జిల్లా సమీకృత కార్యాలయాల ప్రాంగణంలో రూ.5కోట్ల వ్యయంతో ఇందిరాశక్తి జిల్లా మహిళా సమాఖ్య భవనంసైతం నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. మొత్తంరూ.8.94కోట్ల అంచనా వ్య యంతో భవనాల నిర్మాణాలను పూర్తిచేశారు.

రూ.36.30కోట్ల అంచనా, 363 మహిళా సంఘాల భవనాలు

జిల్లాలో మహిళా సంఘాలకు శాశ్వత వేదికలు కల్పించే లక్ష్యంగా జిల్లాలో 363 స్వయం సహాయక సంఘాలకు భవనా ల నిర్మాణం చేపట్టాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఒక్కోభవనానికి రూ.10లక్షల అంచనా వ్యయంతో జిల్లా వ్యాప్తం గా రూ.36.30కోట్ల వ్యయంతో వీటిని చేపట్టాలని అంచనా వేశారు. వీటిలో ఇప్పటి వరకు 56 భవనాల నిర్మాణాలు ప్రారంభించలేదు. 307 భవనాల పనులు ప్రారంభించగా, వాటిలో 22 నిర్మాణాలు పూర్తయ్యాయి. 285 భవనాల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. స్థలాల కేటాయింపుల్లో జాప్యం కారణంగా కొన్ని చోట్ల నిర్మాణమే ప్రారంభం కాలేదు. అదే విధంగా అవసరమైన చోట్ల అందిన ప్రతిపాదనల మేరకు గ్రామ పంచాయతీ భవనాలను రూ.20లక్షలతో, అంగన్‌వాడీ భవనాలను రూ.12లక్షల అంచనా వ్యయంతో దశల వారీగా నిర్మిస్తున్నారు.

ఉపాధి పథకంలో మార్పు.. బిల్లులకు చిక్కులు

జాతీయ ఉపాధి హామీ పథకంలో వచ్చిన మార్పులతో భవనాల నిర్మాణ పనుల బిల్లులకు చిక్కులు ఎదురవుతున్నాయని వాటి నిర్మాణం చేపడుతున్న సంఘాలు, ఏజెన్సీ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మహిళా సమాఖ్య, పంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను తొలుత ఉపాధిహామీ పథకం కింద చేపట్టారు. 2026 జూన్‌లో ఈ పథకాన్ని వీబీ జీరామ్‌జీగా మార్పు చేశారు. దీంతో లేబర్‌, మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిష్పత్తుల్లో మార్పుల కారణంగా బిల్లుల చెల్లింపుల్లో చిక్కులు ఎదురవుతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. పాత పథకంలో పనులు చేపట్టిన ఏజెన్సీలకు బిల్లులు నిలిచిపోవడంతో అదనపు నిధులు వ్యయం చేయలేక కొన్ని చోట్ల పనులు అర్ధంతరంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. పాత పథకంలో మంజూరైన పనులను కొత్త పథకానికి బదలాయించడం లేదా అదనపు నిధులు సమకూర్చి పనులు పూర్తిచేయడానికి కృషి చేయాలని ఏజెన్సీలు కోరుతున్నాయి. అదే విధంగా బిల్లుల విడుదలలో జాప్యం నివారణ, స్థలాల కేటాయింపు సమస్య పరిష్కారమైతే నిర్మాణాలు వేగం పుంజుకుంటాయని భావిస్తున్నారు.

Updated Date - Nov 18 , 2026 | 12:17 AM