Share News

చైతన్యం తెస్తున్నా..అదే నిర్లక్ష్యం

ABN , Publish Date - Apr 17 , 2026 | 11:53 PM

రోడ్డు భద్రతపై అరైవ్‌-అలైవ్‌ పేరుతో పోలీస్‌ శాఖ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఆర్టీసీ, ఆటో డ్రైవర్లు, లారీ అసోసియేషన్లు, ఇతర ట్రాన్సపోర్ట్‌ సంబంధిత వాహనదారుల్లో చైతన్య తెస్తూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కృషి చేస్తోంది.

చైతన్యం తెస్తున్నా..అదే నిర్లక్ష్యం

అరైవ్‌-అలైవ్‌ పేరుతో పోలీస్‌ శాఖ కార్యక్రమలు

ఆటో డ్రైవర్ల నుంచి విద్యార్థుల వరకు అవగాహన సదస్సులు

అయినా నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రమాదాలు

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట)

రోడ్డు భద్రతపై అరైవ్‌-అలైవ్‌ పేరుతో పోలీస్‌ శాఖ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఆర్టీసీ, ఆటో డ్రైవర్లు, లారీ అసోసియేషన్లు, ఇతర ట్రాన్సపోర్ట్‌ సంబంధిత వాహనదారుల్లో చైతన్య తెస్తూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కృషి చేస్తోంది. ర్యాలీలు, సదస్సులు, సభలు నిర్వహిస్తోంది. ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి క్షేమంగా ఇంటికి రావాలనేది ఈ కార్యక్రమ ఉద్దేశం. సూర్యాపేట జిల్లాలో వారం రోజులుగా 145 వార్డులు, 480 గ్రామాల్లో అరైవ్‌-అలైవ్‌ సదస్సులు నిర్వహించారు. అయినా ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు విశేషంగా కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌-విజయవాడతో పాటు సూర్యాపేట-ఖమ్మం, సూర్యాపేట-జనగాం, కోదాడ-జడ్చ ర్ల జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి. ప్రధానంగా అత్యంత రద్దీ గా ఉండే హైదరాబాద్‌-విజయవాడ రహదారి పై ప్రమాదాలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదాలకు మానవ తప్పిదాలే ప్రధానకారణంగా తెలుస్తోంది. స్వీయతప్పిదాలతో అనేకమంది ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలకు పెద్దదిక్కు కోల్పోతున్నారు. ఇంటిని పోషించే వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొందరు చిన్న వయస్సులోనే మృతి చెందుతున్నారు. జిల్లాలో ఎక్కువగా సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, లిరుమలగిరి, నేరేడుచర్ల మునిసిపాలిటీలోఓ్ల ట్రాఫిక్‌ ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో 2024లో వివిధ రోడ్డు ప్రమాదాల్లో 278 మంది మృతి చెందగా, 2025లో 230 మంది, ఈ ఏడాదిలో ఇప్పటికే 35 మంది చనిపోయారు.

స్వీయ తప్పిదాలతోనే..

జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చాలా ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మె ట్‌ ధరించకపోవడం, సరైన దిశలో ఇండికేటర్లు ఇవ్వకపోవడంతో వెనుక నుంచి వాహనాలు ఢీకొంటున్నా యి. పాత ఆటోలకు ఇండికేటర్లు పనిచేయవు. కనీసం చేయి కూడా చూపించకుండా ఇష్టం వచ్చినట్లు మలుపు తిప్పడం, ప్రయాణికులు కనిపించారంటే రోడ్డు మధ్యలోనే బ్రేక్‌ వేయడం వంటి కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రాత్రి వేళ లైట్లు వెలగక వాహనాలు నడపటం, అతివేగం, సెల్‌ఫోన మాట్లాడుతూ నిర్లక్ష్యంతో ఎదుటు వారిపైకి దూసుకెళ్లడం చేస్తున్నారు. దీంతో సరైన దిశలో జాగ్రత్తగా వచ్చే వారు సైతం ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ఇటువంటి వారిపై పోలీసులు, ఆర్టీఏ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఎత్తయిన స్పీడ్‌ బ్రేకర్లతో ప్రమాదాలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం ఎక్స్‌రోడ్డులో స్పీడ్‌ బ్రేకర్లు చాలాఎత్తులో ఉన్నాయి. దీంతో ద్విచక్రవాహనాలపై ఇద్దరు వెళ్తే కిందపడుతున్నారు. అదేవిధంగా ఇటీవల కొత్త స్పీడ్‌ బ్రేకర్లకు జీబ్రా లైన్స వేయలేదు. దీంతో కొత్తగా పట్టణంలోకి వచ్చేవారు రాత్రి వేళ ఇబ్బంది పడుతున్నారు. మునిసిపల్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు తీసుకుంటే చిన్నచిన్న ప్రమాదాలను నివారించవచ్చు. అలాగే ట్రాఫిక్‌ పోలీసులు నిత్యం తనిఖీలు చేస్తుంటే వాహనదారుల్లో జాగ్రత్తలు పెరిగి ప్రమాదాలు తగ్గుతాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అవగాహన కల్పిస్తున్నా...

తిరుమలగిరిలో ఈ నెల 16వ తేదీన జరిగిన కారు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కారు లో నలుగురు యువకులు 25 ఏళ్లలోపు వారే ఏఒక్కరికీ సరైన డ్రైవింగ్‌ అనుభవం లేదు. అయినా కారును నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదా న్ని కొనితెచ్చుకున్నారు.

సూర్యాపేట మండలం పిల్లలమర్రి వద్ద కారు నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఖమ్మం జిల్లా కేంద్రం కాంగ్రె్‌సపార్టీ మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ జావెద్‌ మృతి చెందారు. గేదెలు అడ్డు రావడంతో తప్పించబోగా కారు పల్టీకొట్టింది. 10అడుగుల దూరంలో పడిపో యాడు. ఆయన సీటుబెల్ట్‌ పెట్టుకుని ఉంటే ప్రాణాలు దక్కేవని నిపుణులు పేర్కొంటున్నారు.

చివ్వెంల మండలం బండకింది చందుపట్ల గ్రామంలో రహదారిపై ఆరబోసిన ధాన్యం రాశులను తప్పించబోయి ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోవడంతో అదే గ్రామానికి చెందిన తోట వెంకన్న మృతి చెందాడు. హెల్మెట్‌ పెట్టుకుని గాయాలతో బయటపడేవారని స్థానికులు తెలిపారు.

కోదాడలో ఈ నెల 11వ తేదీ తెల్లవారుజాము న ముందు వెళ్తున్న లారీని ప్రైవెట్‌ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ ఢీకొట్టాడు. 16 మందికి గాయా లయ్యాయి. ముందున్న వాహనాన్ని సరిగ్గా అంచనా వేయకపోవడం, డిఫెన్స డ్రైవింగ్‌ లో పించడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

ప్రతి రోజూ కొత్తగానే భావించాలి

వాహనాన్ని నడిపేటప్పుడు అన్ని జాగ్రత్తలు చూ సుకోవాలి. ఫిట్‌నెస్‌ ఉందో చెక్‌ చేసుకోవాలి. అంతేకా క టైర్లలో గాలి, బ్రెక్‌లు, అన్ని కూడా బయలు దేరే ముందు తనిఖీ చేయాలి. 35 ఏళ్లు ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసినా ఒక్క రోడ్డు ప్రమాదం కూడా చోటుచేసుకోలేదు. ప్రధానంగా ఎదరుగా వచ్చే వాహనాలను కూడా కనిపెట్టాలి. ఒకసారి జిల్లా కేంద్రంలోని తాళ్ళగడ్డవద్ద సైకిల్‌ టైర్‌తో ఆడుకుంటూ ఒక బాలుడు అడ్డంగా వచ్చాడు. అతడి ఇంటి వద్ద ఉండగానే పరిశీలించడంతో బస్సుకు అడ్డంగా రావడంతో బ్రెక్‌ వేశా. ఆవిధంగా ప్రాణాలు కాపాడగలిగా. ఎంత అనుభవం ఉన్నా ప్రతిరోజు కూడా డ్రైవర్‌ కొత్తగానే భావించాలి.

- జాఫర్‌, ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగి

ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సదస్సుల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలి. అకాల మరణాలు సరైనవి కావు. ఎంతో భవిష్యత ఉన్న యువకులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఆటోడ్రైవర్లు 1500 మందికి కంటి వైద్యపరీక్షలు నిర్వహించాం. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలు కూడా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి.

- కొత్తపల్లి నర్సింహ, ఎస్పీ

Updated Date - Apr 17 , 2026 | 11:53 PM