ధాన్యం రికవరీపై నీలినీడలు
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:27 AM
మిల్లర్ల వద్ద ఉన్న టెండర్ ధాన్యం లోటును రికవరీ చేయాలనే సీఎం ఆదేశాల అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మిల్లర్ల వద్ద ఉన్న రూ.39 వేల కోట్ల విలువైన ధాన్యం రికవరీ చేయాల్సిందేనని, అందులో ఎవరి ఒత్తిళ్లకు కలెక్టర్లు లొంగవద్దని ఇటీవల జరిగిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చినా అందుకు అవసరమైన కార్యాచరణ అమలులో అధికారయంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో రూ.1,000కోట్ల విలువైన ధాన్యం మాయం!
సీఎం ఆదేశించినా స్తబ్దుగా అధికారయంత్రాంగం
నామమాత్రపు చర్యలతో సరిపెట్టేలా రాజకీయ ఒత్తిళ్లు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): మిల్లర్ల వద్ద ఉన్న టెండర్ ధాన్యం లోటును రికవరీ చేయాలనే సీఎం ఆదేశాల అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మిల్లర్ల వద్ద ఉన్న రూ.39 వేల కోట్ల విలువైన ధాన్యం రికవరీ చేయాల్సిందేనని, అందులో ఎవరి ఒత్తిళ్లకు కలెక్టర్లు లొంగవద్దని ఇటీవల జరిగిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చినా అందుకు అవసరమైన కార్యాచరణ అమలులో అధికారయంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తోంది.
మిల్లుల్లో మాయమైన ధాన్యం రికవరీకి అవసరమైతే ఆర్‌ఆర్ యాక్ట్ అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ, కార్యాచరణ ముందుకు సాగకుం డా మిల్లర్లు రాజకీయనేతలు, కీలక వ్యక్తుల ద్వారా ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో రూ.191కోట్ల విలువైన ధాన్యం మాయంచేసిన ఏడు మిల్లులపై కేసులు నమోదు చేయగా, రెండు మిల్లులకు సంబంధించి ఇద్దరిని మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారు పోలీస్ కేసులను కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు నెమ్మదించింది. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడు మిల్లులేగాక ఇంకా 90 మిల్లుల్లో సుమారు రూ.1,000కోట్ల విలువైన ధాన్యం మాయమైందని నిర్ధారించినప్పటికీ, చర్యలు మాత్రం ముందుకు సాగకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
రికవరీ చర్యలకు రాజకీయ బ్రేక్‌లు
2023-24 యాసంగి సీజన్‌లో ప్రభుత్వం కొనుగో లు చేసిన ధాన్యం సీఎంఆర్ కింద మిల్లులకు అప్పగించినా సంబంధిత బియ్యం ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని ప్రభు త్వం టెండర్ వేసి విక్రయించింది. ఈ ధాన్యం మిల్లుల్లో ఉండాల్సిన పరిమాణంలో లేకపోవడంతో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించి, ధాన్యం లోటు వివరాలను గుర్తించి నివేదిక అందజేసింది. ఈ నివేదిక ప్రకారం నల్లగొండ జిల్లాలో దాదాపు 50 మిల్లుల్లో రూ.482కోట్ల విలువైన 1.95లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం, సూర్యాపేట జిల్లాలో 38 మిల్లుల్లో రూ.576కోట్ల విలువైన 2.35లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం కాజేసినట్లు నిర్ధారణ అయింది. రెండు జిల్లాల్లో సుమారు 88 మిల్లుల్లో రూ.1,058కోట్ల పైచిలుకు విలువైన ధాన్యం మాయమైనట్టు గుర్తిం చి మిల్లుల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని నిర్ణయించారు. సివిల్ సప్లయిస్ కమిషనర్ ఆదేశా ల మేరకు తొలుత నల్లగొండ జిల్లాలోని ఏడు మిల్లుల్లో రికవరీ నిమిత్తం పోలీస్ కేసులు నమో దు చేశారు. మిగిలిన మిల్లుల్లో రికవరీపై ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. సీఎం నిర్వహించిన సమీక్షలో రికవరీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా జిల్లాలో మాత్రం అధికారులు చర్యలు తీసుకోకుండా రాజకీయనేతలు ఒత్తిళ్లు తెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నామమాత్రపు కేసులు, లేక మాయమైన ధాన్యానికి సమాన విలువను చెల్లించేలా ప్రభుత్వాన్ని సైతం ఒప్పిస్తామని, అప్పటివరకు మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాజకీయనేతల నుంచి అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలుస్తోంది. కీలకమైన నేతల నుంచే ఒత్తిళ్లు వస్తుండడంతో చర్యల అమలులో అధికారులు నెమ్మదించారనే చర్చ అఽధికారవర్గాల్లో సాగుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో భారీ మొత్తంలో సుమారు రూ.1,000కోట్ల విలువైన ధాన్యం కాజేసిన మిల్లర్లపై ఆర్‌ఆర్ యాక్ట్ ప్రకారమే వసూలు చేయాలని, 25శాతం జరిమానా సైతం వసూలు చేస్తేనే ప్రభుత్వ ప్రతిష్ట నిలబడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోనే ధాన్యం భాండాగారంగా చెప్పుకునే ఉమ్మడి జిల్లాలో ఇలాంటి అవకతవకలకు ఆస్కారమివ్వకుండా అధికారులు, రాజకీయనేతలు పారదర్శకంగా వ్యవహరించాలని, అక్రమాలకు పాల్పడిన వారిని వదిలేస్తూ వెళ్తే ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందని, దీన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.