గతం కంటే ముందుగా..
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:50 PM
పాఠశాలలు తెరిచినరోజే పాఠ్యపుస్తకాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ఆ మేరకు అవసరమైన పాఠ్యపుస్తకాలను జిల్లా కేంద్రానికి చేరవేసింది. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం జిల్లాకు 3,41,350 పుస్తకాలు అవసరం కాగా 2,48,770 పుస్తకాలు జిల్లాకు వచ్చాయి.
జిల్లాకు చేరిన పాఠ్యపుస్తకాలు
3,41,350 పుస్తకాలకు 2,48,770 రాక
పక్కదారి పట్టకుండా బార్ కోడ్‌తో జాగ్రత్తలు
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట అర్బన్): పాఠశాలలు తెరిచినరోజే పాఠ్యపుస్తకాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ఆ మేరకు అవసరమైన పాఠ్యపుస్తకాలను జిల్లా కేంద్రానికి చేరవేసింది. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం జిల్లాకు 3,41,350 పుస్తకాలు అవసరం కాగా 2,48,770 పుస్తకాలు జిల్లాకు వచ్చాయి. ఇంకా 92,580 పుస్తకాలు రావాల్సి ఉంది. వేసవి సెలవులు ముగిసేందుకు ఇంకా సమయం ఉన్నందున అప్పట్లోగా మిగిలిన పుస్తకాలు వస్తాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి పేదల కు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం అమలుచేస్తోంది. తద్వారా తల్లిదండ్రులపై ఆర్థికభారం తప్పించడంతో పాటు పిల్లలను పాఠశాలలకు పంపిస్తారని భావిస్తోంది. ఈ క్రమంలో పాఠశాలలు తెరుచుకునే సమయాని కే పుస్తకాలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నా రు. ఈ మేరకు జిల్లాకు ఇప్పటికే 72శాతం పుస్తకా లు వచ్చాయి. జిల్లాలో 698 ప్రాథమిక, 80 ప్రాథమికొన్నత, 238 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు 18 కస్తూర్బాగాంధీతో పాటు 9 ఆదర్శ పాఠశాలలతో పాటు మైనార్టీ, సాంఘిక సంక్షేమ, గిరిజన, బీసీ సంక్షేమ బాలుర, బాలికల గురుకుల పాఠశాలలు కలిపి మొత్తం 1050 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 90వేల మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఒకటి నుం చి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి 3,41,350 పుస్తకాలు అవసరం కాగా 2,48, 770 వచ్చాయి. ఇంకా 92,580 పుస్తకాలు రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా గతంతో పోలిస్తే పాఠ్యపుస్తకాలు ముందుగానే జిల్లాకు చేరుకున్నాయి.
నెలాఖరులోగా ఎమ్మార్సీలకు..
హైదరాబాద్ నుంచి వచ్చిన పుస్తకాలను జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిల్వ చేశారు. ఇంకా రావాల్సిన పుస్తకాలు రాగానే ఈ నెలాఖరులోగా మండల విద్యాధికారుల కార్యాలయాలకు తరలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయా మండలాల పరిధిలోని పాఠశాలలకు పంపిణీ చేస్తారు.
పక్కదారి పట్టకుండా నూతన విధానం
ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం నూతన విధానాన్ని అమలు చేస్తున్నారు. పాఠ్య పుస్తకాలపై సీరియల్ నెంబర్లను ముద్రిస్తున్నారు. వాటి ఆధారంగా జిల్లాకు ఎన్ని పుస్తకాలు సరఫరా జరిగా యో తెలుస్తోంది. అదేవిధంగా జిల్లా కేంద్రం నుం చి మండలాలకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసే సమయంలో కూడా నెంబర్లను నమోదు చేయనున్నారు. అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు పంపిణీ చేసే సమయంలో ఎంఈవోలు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే సమయాల్లో హెచ్‌ఎంలు నెంబర్లను నమోదు చేసుకోనున్నారు. ఒకవేళ పాఠ్య పుస్తకాలు బహిరంగ మార్కెట్‌లో కనిపిస్తే వాటిపై నమోదు చేసిన నెంబర్ ఆధారంగా ఎవరు విక్రయించారో తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాఠ్య పుస్తకాలను పక్కదారి పట్టకుండా నియంత్రించే అవకాశాలు లేకపోలేదు.
ప్రతీ విద్యార్థికి పుస్తకాలు అందజేస్తాం తి: అశోక్‌కుమార్, డీఈవో సూర్యాపేట.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు సకాలంలో అందజేస్తాం. అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు కొన్ని ఇప్పటికే జిల్లాకు చేరాయి. ఇంకా కొన్ని రావాల్సి ఉంది. ప్రభుత్వం పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా చర్యలు చేపడుతున్నాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటాం. పాఠశాలలు ప్రారంభం నాటికి విద్యార్థులకు అందజేస్తాం.