Share News

బీరు.. జోరు

ABN , Publish Date - May 29 , 2026 | 12:17 AM

మండే ఎండలు.. ఉదయం.. మధ్యాహ్నం.. సాయంత్రం అనే తేడా లేదు.. ఓవైపు ఎండల తీవ్రత.. మరో వైపు వడగాలులు.. ఉక్కపోత.

బీరు.. జోరు

ఎండల తీవ్రత.. పెరుగుతోన్న బీర్ల వినియోగం

రికార్డుస్థాయిలో బీర్ల విక్రయాలు.. ఆబ్కారీ శాఖకు కాసుల గలగల

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): మండే ఎండలు.. ఉదయం.. మధ్యాహ్నం.. సాయంత్రం అనే తేడా లేదు.. ఓవైపు ఎండల తీవ్రత.. మరో వైపు వడగాలులు.. ఉక్కపోత. గడిచిన రెండు నెలలుగా దంచికొడుతున్న ఎండల్లో సేద తీరడానికి మద్యంప్రియులు చల్లగా బీరు సేవిస్తూ చిల్‌ అవుతున్నారు. దీంతో గతంలో కంటే బీర్ల విక్రయాలు పెరిగాయి.

గ్లాసుల గల గల చప్పుళ్లతో ఆబ్కారీ శాఖ ఖజనా కాసులతో కళకళ లాడుతోంది. జిల్లాలో సైతం బీర్ల విక్రయాలు జోరందుకున్నాయి. జిల్లాలోని పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుం డా బీర్ల విక్రయాలు పెరిగాయని వైన్‌షాపుల నిర్వాహకులు అంటున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉండటం తో, వాటికి అనుగుణంగా బీర్ల విక్రయాలు కూడా పెరిగిపోతున్నాయని పేర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా 82 మద్యం దుకాణాలు ఉన్నా యి. వీటికి అనుబంధంగా సిట్టింగ్‌ల్లో సైతం మద్యపాన సేవనం సాగుతుంటింది. వీటికితోడు జిల్లాలో 12 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు కొనసాగుతున్నాయి. ప్రధాన పట్టణ ప్రాంతాలు, మునిసిపాలిటీలైన జిల్లా కేంద్రం భువనగిరి పట్టణం, పర్యాటక కేంద్రాలు యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లితోపాటు మునిసిపల్‌ కేంద్రాలైన ఆలేరు, మోత్కూరు, చౌటుప్పల్‌లో ఉన్నాయి. ఈ మునిసిపల్‌ కేంద్రాలతోపాటు బీబీనగర్‌, వలిగొండ, రామన్నపేట వంటి మండల కేంద్రాల్లో సైతం భారీగా బీర్ల విక్రయాలు సాగుతున్నాయి.

మే చివరి వారం వరకే 1.56 లక్షల కేసుల బీర్ల విక్రయాలు

ఎండల తీవ్రత కారణంగా మద్యం దుకాణాల్లో ఐఎంఎ్‌ఫఎల్‌ (ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌) కంటే బీర్లకే మద్యంప్రియులు మొగ్గు చూపుతున్నారు. దీంతో మద్యంతో గత నెలతో పోల్చుకుంటే బీర్ల విక్రయాలు ఎక్కువగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మే చివరి వారం వరకు జిల్లాలో 1,56,574 కేసుల బీర్లను తాగేశారు. ఈ కేసుల విలువ రూ.30.55కోట్లు.. ఈ నెలలో చివరి వారం గడిచే వరకు రెం డు లక్షల కేసులను దాటడమే కాకుండా రూ.42కోట్ల బీర్లు తాగే అవకాశాలు ఉన్నాయని గణాంకాల ప్రకారం మద్యం దుకాణాల యజమానులు పేర్కొంటున్నారు. మే మొదటి రెండు వారాల్లో వివాహాలు, శుభ ముహూర్తాలకు తోడు ఎండల తీవ్రత కారణంగా మద్యం దుకాణాల్లో విక్రయాల జోరు పెరిగింది. అయితే గతంలో మద్యంతో పోల్చుకుంటే బీర్ల విక్రయాలు తక్కువగా ఉంటాయి. అయితే వేసవి తా పం కారణంగా ఇంచుమించు మద్యంతో సమానంగా బీరు కేసుల విక్రయాలు జరుగుతున్నాయని అంటున్నారు.

5 నెలల్లో 419.36 కోట్ల మద్యం అమ్మకాలు

జిల్లాలో జనవరి నుంచి మే చివరి వారం వరకు భారీగా మద్యం విక్రయాలు సాగాయి. మునిసిపల్‌ ఎన్నికలు, పెళ్లిల్లు, విందులు, జాతరల వంటి కార్యకలాపాలతో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. జిల్లాలో జనవరినుంచి మే 26వ తేదీ వరకు ఆబ్కారీ శాఖ అధికారుల లెక్కల ప్రకారం మద్యం దుకాణాలకు తెలంగాణ బ్రెవరేజస్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.419.36 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. రూ.288.64 కోట్ల విలువైన 3,54,148 మద్యం కేసులు, రూ.129.72కోట్ల విలువైన 6,66,596 బీరు కేసుల విక్రయాలు జరిగాయి. వీటికి ఎంఆర్‌పీ రేట్ల ప్రకారం మరో 20శాతం నుంచి 25 శాతం వరకు జోడించి మద్యం దుకాణాల్లో మద్యం ప్రియులకు విక్రయాలు జరుగుతాయి. దీంతో ఈ అయిదు నెలలో కాలంలో జిల్లాలో మద్యంప్రియులు దాదాపు 600 కోట్లకు పైగా మద్యం, బీర్లు సేవించి చిల్‌.. బ్రదర్‌.. అంటూ సేవ తిరినట్టే మరి.

ఏప్రిల్‌ కంటే అధికంగా విక్రయాలు

ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, మద్యంతోపాటు బీర్ల విక్రయాలు ఏప్రిల్‌కంటే మే నెలలోనే అధికంగా జరిగినట్లు ఆబ్కారీ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌లో జిల్లాలో మొత్తం మద్యం, బీర్లు కలిపి రూ.65.11కోట్ల విలువైన కేసులు విక్రయంగా కాగా, మేలో 26వ తేదీ వరకే రూ.74.23కోట్ల విలువైన మద్యం, బీర్లు విక్రయాలు జరిగాయి. ఏప్రిల్‌లో రూ.41.89 కోట్ల విలువైన 52,540 కేసుల మద్యం విక్రయాలు జరగ్గా, మే 26వ తేదీ వరకే రూ.44.19 కోట్ల విలువైన 56,770 కేసుల మద్యం విక్రయాలయ్యాయి. బీర్ల విక్రయాలను పరిశీలిస్తే ఏప్రిల్‌లో రూ.23.22 కోట్ల విలువైన 1,18,391 బీరు కేసులు విక్రయాలు జరగ్గా, మే 26వ తేదీ వరకే రూ.30.55కోట్ల విలువైన 1,56,574 కేసు ల విక్రయాలు జరిగాయి. అయితే ఈ మద్యం, బీర్ల విలువ కేవలం హోల్‌సేల్‌ డిపోలనుంచి మద్యం దుకాణాల నిర్వాహకులకు సరఫరా చేసిన హోల్‌సేల్‌ ధరల ప్రకారమే.. అయితే మద్యం ప్రియులకు ఈ ధరలపై 20 శాతం నుంచి 25శాతం అధికంగా ధరలకు విక్రయాలు జరుగుతాయి కనుక ఈ గణాంకాలపై మద్యంప్రియుల జేబునుంచి అదే రీతిలో సొమ్ము మద్యం పేరిట గుల్లా అయినట్లు భావించాలి.

Updated Date - May 29 , 2026 | 12:17 AM