రోడ్డు పక్కన బావులతో జాగ్రత్త
ABN , Publish Date - Jun 17 , 2026 | 11:41 PM
తుర్కపల్లి మండలంలో రోడ్ల పక్కన ఉన్న వ్యవసాయ బావులు ప్రమాదకరంగా మారాయి.
ఆదమరిస్తే అంతే సంగతులు
తుర్కపల్లి, జూన 17(ఆంధ్రజ్యోతి): తుర్కపల్లి మండలంలో రోడ్ల పక్కన ఉన్న వ్యవసాయ బావులు ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు ఏ మాత్రం ఆదమరిస్తే పెను ప్రమాదమేనంటున్నారు. రోడ్లకు పక్కనే ఎలాంటి రక్షణ గోడలు లేకుండా ఉండడంతో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. గ్రామీణ రోడ్లు వ్యవసాయ బావుల వెంట ఉండడంతో పాటు బావుల గట్టు మీద పిచ్చి మొక్కలు పెరగడంతో వాహనదారులు దగ్గరికి వెళ్తే గాని ఆ బావులను గుర్తించలేకపోతున్నారు. తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామ సమీపంలో ఉన్న రాజాపేటకు వెళ్లే రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డు గుండా నిత్యం రాజాపేట, రేణుకుంట, చల్లూర్, మండలంలోని ఇబ్రహీంపూర్, కోనాపూర్ మీదుగా జగదేవ్‌పూర్ తదితర ప్రాంతాలకు వాహనదారులు, ఆర్‌టీసీ బస్సులు వెళ్లాయి. ఆయా గ్రామాల నుంచి ఈ రోడ్డు గుండానే యాదగిరిగుట్టకు ఎంతో మంది భక్తులు వెళ్తారు. అంతేకాకుండా మండలంలోని వీరారెడ్డిపల్లి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి ఇబ్బహీంపూర్ వెళ్లే రోడ్డు వెంట ఉన్న ఎనజీ బండలు గ్రామంలోను రోడ్డు వ్యవసాయ బావి ఉంది. ఈ బావి సమీపంలోను పాఠశాల కూడా ఉంది. ఈ బావితో రోడ్డు వెంట వెళ్లే వాహనదారులే కాకుండా విద్యార్థులు కూడా ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాధాపూర్ నుంచి నాగాయపల్లి వెళ్లే రోడ్డు మార్గంలో ఉడుతోని వాగు సమీపంలో ఉన్న వ్యవసాయ కంచె లేకుండా ప్రమాదకరంగా ఉంది. ఈ రోడ్డు గుండా నిత్యం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కర్కపట్ల కంపెనీలో పని చేసేందుకు ఉద్యోగులు వెళ్తారు. ఈ బావుల వద్ద ఎలాంటి రక్షణ గోడలు లేక పోవడం వల్ల ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు వాహనదారులు ఏ మాత్రం ఏమరపాటున వ్యవహరించిరా బావిలో పడే ప్రమాదముంది. ఈ బావుల గట్లపై ముళ్ల చెట్లు ఉండడంతో రాత్రి వేళల్లో అక్కడ బావి ఉన్నట్లు కనిపించడంలేదని, ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు ప్రమాదం పొంచి ఉందని వాహనదారులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న వ్యవసాయ బావులకు కంచె ఏర్పాటు చేసి, ప్రమాద హెచ్చరిక బోడ్డులను ఏర్పాటు చేయాలని వాహనదారులు, ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
బావుల చుట్టూ కంచె ఏర్పాటు చేయిస్తాం
-జేరిపోతుల కరుణాకర్ సర్పంచ, దత్తాయపల్లి గ్రామం
గ్రామంలో రోడ్డు వెంట ప్రమాదకరంగా ఉన్న వ్యవసాయ బావుల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతాం. రోడ్డు పక్కన ఉన్న బావులకు మా గ్రామ పరిధిలో కంచె ఏర్పాటు చేస్తాం. అంతే కాకుండా ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళతాం.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాం
- చక్రధర్, ఏఈ, పంచాయతీరాజ్ శాఖ
దత్తాయపల్లి గ్రామంలోని పీఆర్ రోడ్డు వెంట ఉన్న వ్యవసాయ బావి ప్రమాదకరంగా ఉందని మా దృష్టికి వచ్చింది. మండల పరిధిలో ఇంకా ఏవైనా బావులు ఉంటే ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు చేపడతాం.