Share News

కోతల వేళ.. కొరత

ABN , Publish Date - Apr 28 , 2026 | 11:47 PM

యాసంగి వరి కోతల వేళ డీజిల్‌ కొరత రైతులను వేధిస్తోం ది. వరి కోతలు చేపట్టే హార్వెస్టర్లు, రవాణాకు ఉపయోగించే ట్రాక్టర్లు, లారీలు, ట్రక్కులకు డీజిల్‌ లభ్యత లేకపోవడంతో పొలా లు, కల్లాల వద్ద ఉండాల్సిన రైతులు మండే ఎండల్లో బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

కోతల వేళ.. కొరత

డీజిల్‌ దొరక్క వరి కోతలకు ఆటంకాలు

బంక్‌ల వద్ద బారులు తీరిన వాహనాలు

అవసరానికి తగిన సరఫరా లేక ఇక్కట్లు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): యాసంగి వరి కోతల వేళ డీజిల్‌ కొరత రైతులను వేధిస్తోం ది. వరి కోతలు చేపట్టే హార్వెస్టర్లు, రవాణాకు ఉపయోగించే ట్రాక్టర్లు, లారీలు, ట్రక్కులకు డీజిల్‌ లభ్యత లేకపోవడంతో పొలా లు, కల్లాల వద్ద ఉండాల్సిన రైతులు మండే ఎండల్లో బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గత మూడు, నాలుగు రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ కొరత మంగళవారం సైతం కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 160కిపైగా పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వీటి ద్వారా సాధారణంగా రోజుకు 4.50లక్షల లీటర్ల డీజిల్‌, 1.50లక్షల లీటర్ల పెట్రోల్‌ వినియోగం అవుతోంది. అయితే గత శుక్ర, శని వారాల నుంచి పెట్రోలియం కంపెనీలు డీలర్లకు డీజిల్‌, పెట్రోల్‌ సరఫరాను చాలా వరకు తగ్గించాయి. జిల్లాకు అవసరమైన డీజిల్‌, పెట్రోల్‌లో కేవలం 50-60శాతం వరకే సరఫరా అవుతోంది. క్షేత్రస్థాయిలో వినియోగదారుల అవసరాలకు తగినట్టు డీజిల్‌, పెట్రోల్‌ అందుబాటులో లేకపోవడంతో శనివారం నుంచి తీవ్ర కొరత ఏర్పడింది.

జిల్లా వ్యాప్తంగా మంగళవారం బంకుల వద్ద భారీగా వాహనదారులు బా రులు తీరారు. జిల్లాలోని సుమారు 80శాతం బంకుల్లో డిజీల్‌ కొరత నెలకొనగా, కొన్ని చోట్ల పెట్రోల్‌ అందుబాటులో ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా లేని బంకుల వద్ద ఆయిల్‌ ట్యాంకర్ల కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లా కేంద్రమైన భువనగిరిలో కేవలం పట్టణంలో ఒక బంకులో, శివారులోని రెండు బంకుల్లో మాత్రమే డీజిల్‌ అందుబాటులో ఉంది. దీంతో ఈ బంకుల వద్ద అర కిలోమీటరు మేర వాహనాలు బారులుతీరాయి. హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, ఎక్స్‌కవేటర్ల డ్రైవర్లు డమ్ములు, క్యాన్లతో బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కేవలం పెట్రోల్‌ మాత్రమే ఉన్న బంకుల్లో సైతం వ్యాన్లు, కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనదారులు క్యూకట్టి గంటల కొద్దీ నిరీక్షించాల్సివస్తోంది. యాదగిరిగుట్ట పట్టణంలో ఐదు బంకులు ఉండగా, రెండింటిలో పెట్రోల్‌ కొంత మేర లభ్యత ఉన్నా, డీజిల్‌ లేదు. మిగతా మూడింటిలో డీజిల్‌, పెట్రోల్‌ ఏదీ లేకపోవడంతో నోస్టాక్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. నగరశివారు మండలాలు పోచంపల్లి, బీబీనగర్‌ ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాలకు హార్వెస్టర్లకు, ఆటోలకు మాత్రమే డీజిల్‌ సరఫరా చేస్తున్నారు. కార్లవంటి ప్రయాణికుల వాహనాలకు డీజిల్‌ పోయకుండా వెనక్కిపంపిస్తున్నారు. ఈ మండలాల్లో పెట్రోల్‌ లేక నోస్టాక్‌ బోర్టులు పెట్టారు. జిల్లాలోని జాతీయ రహదారుల వెంట ఉన్న చౌటుప్పల్‌, ఆలేరు వంటి పట్టణాల శివారుల్లో కూడా డీజిల్‌ కొరత వేధిస్తోంది. డీజిల్‌ ఎక్కడ అందుబాటులో ఉందని తెలిస్తే అక్కడికి వాహనదారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. అక్కడికి వెళ్లే సరికి అందుబాటులో ఉంటే పోస్తున్నారు. లేదంటే వినియోగదారులు ఉసూరుమంటూ వెనుతిరిగి మరో బంక్‌కు వెళ్తున్నారు.

నీటి ట్యాంకర్లు, చెత్తసేకరణ వాహనాలకు తప్పని కొరత

నిత్యం పారిశుధ్య విధులకు వినియోగించే ట్రాక్టర్లు, ఆటోలకు డీజిల్‌ కొరత కారణంగా చెత్తసేకరణలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పారిశుధ్య కార్మికులు పొగుచేసిన చెత్తను డంప్‌ యార్డులకు చేరవేసే ట్రాక్టర్లు, ఆటోలు సైతం బంకు ల వద్ద సాధారణ వాహనాలతో పాటు బారులు తీరి కనిపిస్తున్నాయి. వేసవిలో నీటి ఎద్దడి, నిర్మాణ, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే వాటర్‌ ట్యాంకర్ల కు సైతం డీజిల్‌ కొరత వేధిస్తోంది. దీంతో సరైన సమయానికి నీరు అందించలేక ఇబ్బందులు పడాల్సివస్తోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డీజిల్‌పై ఆంక్షలు

వాహనదారులకు డీజిల్‌ పోసేందుకు బంకు నిర్వాహకులు ఆంక్షలు విధిస్తున్నారు. ఆయా వాహనాల్లో ట్యాంక్‌ ఫుల్‌ చేసేందుకు నిరాకరిస్తున్నారు. వాహన పరిమితి ప్రకారం రూ.1,000 నుంచి రూ.2,000 వరకే డీజిల్‌ పోసి పంపిస్తున్నారు. దీంతో ప్రతీ రోజు వాహనాలతో బంకుల వద్ద క్యూ కట్టడానికే సమయం సరిపోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బల్క్‌గా డీజిల్‌ పోయడం ద్వారా కొద్ది గంటల్లోనే మొత్తం బంక్‌ ఖాళీ అయి క్యూలో ఉన్నవారికి దొరకడం లేదని, అందరికీ డీజిల్‌ అందించాలనే ఈ ఆంక్షలు పెట్టినట్టు బంక్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

సరఫరాల్లో జాప్యమే కారణం

జిల్లాలో వాహన వినియోగానికి సరిపడా డీజిల్‌, పెట్రోల్‌ను ఆయిల్‌ కంపెనీలు సరఫరా చేయకుండా ఆంక్షలు విధించడం కారణంగానే నాలుగు రోజులుగా కొరతలు ఏర్పడ్డాయని బంకుల యజమానులు అంటున్నారు. అవసరమైన డీజిల్‌, పెట్రోల్‌ ఇండెంట్‌తో పాటు బ్యాంకు డిమాండ్‌ డ్రాఫ్ట్‌ను అందజేసినా ఏ రోజుకు, ఆ రోజు సరఫరా చేయాల్సిన ట్యాంకర్లను రెండు మూడు రోజుల జాప్యం అనంతరం పంపుతుండటంతో కొరత కొనసాగుతోందన్నారు. వ్యవసాయ అవసరాలతో పాటు కొరత సృష్టించిన ఆందోళనతో అవసరం లేని వాహనదారులు సైతం ముందుజాగ్రత్తగా ఎక్కువ మొత్తంలో డీజిల్‌, పెట్రోల్‌ కొనుగోలు చేస్తుండటం సైతం మరో కారణంగా చెబుతున్నారు. డీజిల్‌, పెట్రోల్‌ కొరత లేకుండా, సజావుగా సరఫరా జరగాలంటే ఆయిల్‌ కంపెనీలు ఇండెంట్ల ప్రకారం డీలర్లకు వెంటవెంటనే సరఫరా చేయాలని పేర్కొంటున్నారు.

ఆలేరు: పెట్రోల్‌, డీజిల్‌ కొరత వార్తల నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని రెండు బంకుల వద్దకు వాహనదారులు బారులు తీరారు. కొరత లేదని నిర్వాహకులు తెలిపినా వాహనదారులు పట్టించుకోలేదు. బంకుల వద్ద గంటలు తరబడి నిలబడి డీజిల్‌, పెట్రోల్‌ తీసుకెళ్లారు. బంక్‌ల నిర్వాహకులు బాటిళ్లు, క్యాన్లను అనుమతించకపోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. స్థానికులు కొందరు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

ఎక్కడ ఉందంటే అక్కడికి పరుగులే: జి.నర్సింహ, హార్వెస్టర్‌ డ్రైవర్‌, నాంచారిపేట, మోటకొండూరు మండలం

మాది మోటకొండూరు మండలం నాంచారిపేట. వరికోత యంత్రం హార్వెస్టర్‌, ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న. డీజిల్‌ లేక ఎక్కడ ఉందంటే అక్కడికి ఉరుకులు, పరుగులు పెడుతున్నాం. ఇప్పటికీ మూడు ఊర్లు తిరుగుతూ 25 కిలోమీటర్ల దూరమైన భువనగిరికి వచ్చి క్యూలో ఉన్నా. ఇక్కడ డీజిల్‌ తీసుకుని వెళ్తేనే అక్కడ వరి కోత పనులు సాగుతాయి. అయితే ఇక్కడ కూడ కేవలం రూ.2వేలకు మించి డీజిల్‌ పోయడం లేదు. మళ్లీ మరో దగ్గర క్యూకట్టక తప్పదు.

నీటి సరఫరా చేయలేకపోతున్నాం: సలీం, వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌, భువనగిరి

భువనగిరి పట్టణానికి చెందిన నాపేరు సలీమ్‌. వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా అపార్ట్‌మెంట్లకు, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు నీరు సరఫరా చేస్తుంటా. నాలుగు రోజులుగా డీజిల్‌ కొరత కారణంగా సకాలంలో నీటిని అందించలేకపోతున్నా. నిన్న డీజిల్‌ లేక మధ్యలోనే ట్యాంకర్‌ నిలిచింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి డీజిల్‌ కోసం ఇక్కడే నిరీక్షిస్తున్నా. అపార్ట్‌మెంట్‌వాసులు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. నాపైనా కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం డీజిల్‌ కోసం గంటల కొద్దీ క్యూలో ఉండాల్సి వస్తోంది.

కొరత లేకుండా వెంటవెంటనే సరఫరా..

అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి

యాదాద్రి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో డీజిల్‌, పెట్రోల్‌ కొరత లేకుండా వెంటవెంటనే సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులు, డీలర్లను అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన ఛాం బర్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. డీలర్లు డీడీలు అందించిన వెంటనే ట్యాంకర్లను సరఫరా చేయాలని సూచించారు. నిరంతరాయంగా పెట్రోల్‌, డీజిల్‌ వినియోగదారులకు అందించేందుకు డీలర్లు కృషి చేయాలన్నారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నందున హార్వెస్టర్లకు, రవాణా వాహనాలకు, రైతులకు, నిత్యావసర సరుకు ల రవాణా వాహనాలతో పాటు అత్యవసర సేవలకు అవసరమైన డీజిల్‌, పెట్రోల్‌ నిల్వలు ఉండేలా చూసుకోవాలన్నారు. చమురు సంస్థల వద్ద అవసరానికి సరిపడా నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. కొరత వస్తుందని అ వసరానికి మించి కొనుగోలు చేయవద్దని వినియోగదారులకు సూచించారు. సమావేశంలో ఆర్డీవో ఎం.కృష్ణారెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 11:47 PM