భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శం
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:22 AM
రాష్ట్రంలోని భరోసా కేంద్రాల పని తీరు దేశంలోనే ఆదర్శంగా ఉందని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులు సైతం భరోసా కేంద్రాల నిర్వహణను అధ్యయనం చేసి వెళుతున్నారని తెలిపారు. సోమవారం భువనగిరిలో జిల్లా పోలీస్ కార్యాలయం, భరోసా కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు.
డీజీపీ శివఽధర్‌రెడ్డి
జిల్లా కేంద్రంలో జిల్లాపోలీస్ కార్యాలయం ప్రారంభం
యాదాద్రి, భువనగిరి టౌన్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని భరోసా కేంద్రాల పని తీరు దేశంలోనే ఆదర్శంగా ఉందని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులు సైతం భరోసా కేంద్రాల నిర్వహణను అధ్యయనం చేసి వెళుతున్నారని తెలిపారు. సోమవారం భువనగిరిలో జిల్లా పోలీస్ కార్యాలయం, భరోసా కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు. మహిళలు ఎదుర్కొంటున్న గృహహింస, బాలికలు, మహిళలపై జరుగుతున్న లైంగికదాడి, పోక్సో కేసుల విచారణలో పోలీసుల కంటే భరోసా కేంద్రాల పాత్ర కీలకమని తెలిపారు. బాధితులైన మహిళలు, బాలికలు పోలీ్‌సస్టేషన్‌లో కొంత భయం, బెరుకుతో ఇబ్బందిపడి తమపై జరిగిన దాడులు, దౌర్జన్యాలను ధైర్యంగా చెప్పలేకపోతారన్నారు. భరోసా కేంద్రాల్లో అలాంటి వాతావరణం ఉండకపోవడంతో సైకాలజిస్టులకు నిర్భయంగా జరిగింది జరిగినట్టు చెప్పగలుగుతారని వివరించారు. కేసుల నమోదు నుంచి, విచారణ, చార్జీషీట్ తదుపరి నిందితులకు శిక్ష పడేవరకు భరోసా కేంద్రం బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో 2015-16నుంచి ఏర్పాటుచేసిన భరోసా కేంద్రాలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. మహిళలపై దాడులు వంటి కేసుల్లో కీలకంగా మారిన భరోసా కేంద్రాలకు రాష్ట్రంలో 35 భవనాలను నిర్మించామన్నారు.
అగ్రగామిగా తెలంగాణ పోలీసు
దేశంలోని అగ్రగామి పోలీస్ వ్యవస్థల్లో తెలంగాణ పోలీస్ ప్రముఖంగా ఉంటుందని డీజీపీ శివధర్‌రెడ్డి, అదనపు డీజీపీ మహేశ్ ఎం. భగవత్ అన్నారు. జిల్లా ఎస్‌హెచ్‌ఓపై స్థాయి అధికారులతో నిర్వహించిన ఇంటరాక్ట్ సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో మావోయిస్టు నాయకులు దాదాపు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారని, తెలంగాణకు చెందిన వారు కేవలం ఆరుగురు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని అన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ పోలీ్‌సశాఖకు జిల్లా పాలన యంత్రాంగం సహాయపడుతుందన్నారు. ఎస్పీ అక్షాంశ్‌యాదవ్ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో, శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసులు సమర్థంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు లక్ష్మీనారాయణ, వినోద్, భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ డీఎస్పీలు రవీందర్, శ్రీనివా్‌సనాయుడు, పి. మధుసూదన్‌రెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.