ఒక్కరోజే 21 వేల క్వింటాళ్ల ఉత్పత్తుల రాక
ABN , Publish Date - Apr 15 , 2026 | 11:26 PM
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు పోటెత్తుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో రైతులు తమ ఉత్పత్తులను సూర్యాపేట మార్కెట్‌కు తరలిస్తున్నారు.
సూర్యాపేట మార్కెట్ నిండా వ్యవసాయ ఉత్పత్తులు
ఐకేపీల్లో కొనుగోళ్లు లేకపోవడంతోనే..
భానుపురి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు పోటెత్తుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో రైతులు తమ ఉత్పత్తులను సూర్యాపేట మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా మార్కెట్ వ్యవసాయ ఉత్పత్తులతో నిండిపోతోంది. ఈ నెల 13న 30వేల బస్తాల ఉత్పత్తులు రాగా బుధవారం 21,261 క్వింటాళ్ల ఉత్పత్తులు వచ్చాయి. దీంతో మార్కెట్‌లో ఎక్కడచూసినా రైతులు, వ్యాపారుల సందడి కనిపించింది. సూర్యాపేట నియోజకవర్గంతో పాటు అర్వపల్లి, నూతనకల్, తుంగతుర్తి, మోతె, నడిగూడెం, మునగాలతో పాటు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలాల రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలిస్తున్నారు.
మద్దతుకు మించి కొంతమొత్తమే..
సూర్యాపేట మార్కెట్‌కు బుధవారం 21 వుల క్వింటాళ్ల వ్యవసాయ ఉత్పత్తులు వచ్చాయి. జైశ్రీరాం రకం ధాన్యం 25,806 బస్తాలు, ఐఆర్-(64) 4,220, హెచఎంటీ 2,448, బీపీటీ 230, బీపీటీ పాతరకం 5 బస్తాలు వచ్చాయి. ఆదేవిధంగా పెసర్లు 818 క్వింటాళ్లు, జొన్నలు 455 క్వింటాళ్లు, కందులు 303, వేరుశనగ 133 బస్తాలు, మినుములు 21, బొబ్బెర్లు 52క్వింటాళ్లు వచ్చినట్లు మార్కెట్ సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండగా మొత్తం 21,261 క్వింటాళ్ల ఉత్పత్తులను వ్యాపారులు కొనుగోలుచేశారు. జైశ్రీ రాం, హెచఎంటీ, ఐఆర్-64 రకానికి మద్దతు ధర రూ.2,389 కాగా రూ.2,500 ధర పలికింది. ఈ సీజనలో ఇదే అత్యధిక ధరగా మార్కెట్ సిబ్బంది, రైతులు చెబుతున్నారు. అయితే ఈ ధరకు ధాన్యాన్ని కొంతమొత్తంలో వ్యాపారులు కొనుగోలు చేసి మిగతా ధాన్యాన్ని రూ.2,200 అంతకు తక్కువగా చెల్లించినట్లు రైతులు చెబుతున్నారు. అదేవిధంగా అత్యల్పంగా రూ.1,517 ధర పలికింది. ధాన్యంతో పాటు ఇతర ఉత్పత్తులను వ్యాపారులు కొనుగోలు చేశారు.