పల్లెకు వెలుగులేవీ?
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:45 AM
పల్లెల ప్రగతికి ప్రధాన వనరుగా నిలిచే రవాణా సౌకర్యం ప్రభుత్వం నుంచి కొరవడుతోంది. విద్య, వైద్యం, తాగునీటి వసతిలు కల్పిస్తున్నా రవాణా సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం మిన్నకుంటోంది. దీంతో పల్లె ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆర్టీసీ బస్సులు రాక ప్రైవేట్‌లో ప్రయాణం
బస్సులు ఏర్పాటుచేయాలని పల్లెవాసుల విజ్ఞప్తి
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట(కలెక్టరేట్) : పల్లెల ప్రగతికి ప్రధాన వనరుగా నిలిచే రవాణా సౌకర్యం ప్రభుత్వం నుంచి కొరవడుతోంది. విద్య, వైద్యం, తాగునీటి వసతిలు కల్పిస్తున్నా రవాణా సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం మిన్నకుంటోంది. దీంతో పల్లె ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆర్టీసీ బస్సులు రాక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రహదారులు బాగానే ఉన్నా బస్సులు వెళ్లడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 100కు పైగా గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం లేదు. తండాల సంగతి సరేసరి. నష్టాల సాకు చూపి ఆర్టీసీ అధికారులు బస్సులు నడపటం లేదు. దీంతో ప్రైవేట్ వాహనాల జోరు రోజురోజుకూ పెరుగుతోంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, నార్కట్‌పల్లి, యాదగిరిగుట్ట, దేవరకొండ డిపోలలు ఉన్నాయి. వీటిలోని 730 బస్సులు నిత్యం ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంటాయి. అందులో 330 సంస్థకు చెందినవి కాగా, 220 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. మరో 170 ఎలక్ర్టికల్ బస్సులు ఉన్నాయి. ఆయా బస్సులు రోజు లక్షల సంఖ్య కిలోమీటర్లు ప్రయాణిస్తూ ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.
పల్లెలకు బస్సులేవీ?
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 100కు పైగా గ్రా మాలకు బస్సులు వెళ్లడం లేదు. మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలకు ఆర్టీసీ అధికారులు బస్సులు నడపడం నిలిపివేశారు. ఎన్నో గ్రామా లు ఆర్టీసీ బస్సుల సౌకర్యానికి నోచుకోక ఏళ్లు గడుస్తోంది. గతంలో రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికి బస్సులు నడిపిన అధికారులు ప్రస్తుతం రోడ్ల పరిస్థితుల్లో అనేక మార్పులు వచ్చినా బస్సులు నడపడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండల కేంద్రాలకు కూడా బస్సు సౌకర్యం లేదు. అందులో గోరెంట్ల, ఆత్మకూర్(ఎస్), కాసర్లపాడు, ఫణిగిరి, ఉర్లుగొండ, అన్నారిగూడెం, కరక్కాయలగూడెం, తాళ్లసింగారం, పాతర్లపాడు, సోమ్లాతండా, ముక్కుడుదేవులపల్లి, రామన్నగూడెం, కందగట్లతో పాటు 100కు పైగా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఇటీవల సూర్యాపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఊరికో 15 వరకు ఆటోలు
ప్రజలు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ గ్రామం, తండా నుంచి రోజూ వివిధ పనుల నిమిత్తం అనేకమంది సమీప పట్టణాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి తరుణంలో రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరితో పాటు విద్యనభ్యసించేందుకు విద్యార్థులు పట్టణాలకు వచ్చి వెళ్తుంటారు. వారు కూడా రోజు విద్యాసంస్థలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేక అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్ని గ్రామాల ప్రజలు పలు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పల్లెలకు ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో ఆయా గ్రామాల్లో ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆటోల వినియోగం పెరిగింది. ఒక్కో గ్రామంలో 5 నుంచి 15 ఆటోల వరకు ఉంటున్నాయి. ఇంటి వద్దకే ఆటో వస్తుండటంతో ప్రైవేట్‌ను ఆశ్రయిస్తున్నారు.
మహాలక్ష్మి పథకంలో కొంత ఊరట
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం విపరీతంగా పెరిగింది. గతంలో సీట్లు ఖాళీగా ఉండే బస్సులు ఇప్పుడు ఎక్కువమంది మహిళలతో నిండిపోతున్నాయి. మహిళల ప్రయాణ చార్జీలను ప్రభుత్వమే ఆర్టీసీ సంస్ధకు చెల్లిస్తోంది. దీంతో కొంతమేర ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడుతోంది. అయితే గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో మహిళలు గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రైవేట్ వాహనాల్లో డబ్బులు చెల్లించి వెళ్లాల్సి వస్తోంది.
రోడ్లు బాగాలేక కొన్ని సర్వీసులు నిలిపివేశాం: జాన్‌రెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం, నల్లగొండ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు గ్రామాలకు రోడ్లు సరిగా లేవు. దీంతో ఆయా గ్రామాలకు బస్సు సర్వీసులు నిలిపివేశాం. మరికొన్ని గ్రామాల నుంచి ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంది. వారు ఎక్కువగా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో నష్టాలు వస్తున్నాయి. అందుకోసం అలాంటి గ్రామాలకు బస్సు సౌకర్యం నిలిపాం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారు. ప్రజలు కోరితే పరిశీలించి బస్సు సౌకర్యం కల్పిస్తాం. ఇటీవల పలు గ్రామాలకు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటుచేశాం.