ఆయిల్‌పామ్ రైతులకు రాయితీలేవీ?
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:32 AM
వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్‌పామ్ సాగువైపు మళ్లేలా వారిని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు రాయితీల విడుదలలో జాప్యం చేస్తోంది.దీంతో ఉమ్మ డి జిల్లా రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
నెలల తరబడి ఎదురుచూస్తున్న రైతులు
ఓ వైపు ప్రోత్సాహం, మరో వైపు నిధుల కేటాయింపులో జాప్యం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 22వేల ఎకరాలకు పైగా సాగు
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ) : వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్‌పామ్ సాగువైపు మళ్లేలా వారిని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు రాయితీల విడుదలలో జాప్యం చేస్తోంది.దీంతో ఉమ్మ డి జిల్లా రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఆయిల్‌పామ్ సాగుకు రైతులు నిత్యం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కూలీల ఖర్చులతో పాటు ఎరువుల కోసం పెట్టుబడులు అవసరం. అయితే ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరుచేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయిల్‌పామ్ తోటల సాగుకు తొలుత రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ తరువాత ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో ఇప్పుడిప్పుడే రైతులు ముందుకు వస్తున్నారు. 2001లో ప్రారంభమైన ఆయిల్‌పామ్ సాగు 2026 నాటికి 22,320 ఎకరాలకు పైగా విస్తరించింది. జిల్లాలో 13వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు కాగా, యాదాద్రి జిల్లాలో 4,420 ఎకరాలు, సూర్యాపేట జిల్లా లో 4,900 ఎకరాల్లో సాగైంది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో సాగు కాగా రెండో స్థానంలో సూర్యాపేట, మూడో స్థానంలో యాదాద్రి జిల్లాలు నిలిచాయి. యా దాద్రి జిల్లాలో రెండేళ్ల నుంచి ఆయిల్‌పామ్ తోటలు సాగవుతుండగా, సూర్యాపేట జిల్లాలో ఏడేళ్లుగా ఆయిల్‌పామ్ తోటలు ఉన్నాయి. జిల్లాలో మాత్రం రైతులు 2001 నుంచి ఆయిల్‌పా మ్ సాగు చేస్తున్నారు. కొత్త గా గత ఏడాది నుంచి ప్రస్తుత నెల వరకు జిల్లాలో 3 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకాగా, సూర్యాపేట జిల్లాలో 884 ఎకరా లు, యాదాద్రి జిల్లాలో 909 ఎకరాల్లో సాగయ్యాయి. ఒక్క ఏడాదిలో కొత్తగా పెద్ద మొత్తంలో తోటలు సాగయ్యాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 22,320 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు కాగా, రాయితీలు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎకరాకు రూ.4200 రాయితీ
ఆయిల్‌పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ.4,200 చొప్పున రాయితీ ఇవ్వాలి. రైతులు ఈ రాయితీలను పెట్టుబడుల కోసం వినియోగించుకోవాలి. అయితే నెలల తరబడి ప్రభుత్వం నుంచి పెట్టుబడి రావడం లేదు. దీంతో రైతులు ఎదురుచూపు చూస్తున్నారు. ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగుచేసే రైతుల కోసం నాలుగేళ్ల వరకు ఎరువుల కోసం పెట్టుబడి ఇవ్వాలి. ఆయిల్‌పామ్ సాగును విస్తరించేందుకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. రైతులకు పెట్టుబడులతో పాటు అంతర్ పంటల కోసం ఏటా రెండుమార్లు నాలుగేళ్ల వరకు ఈ రాయితీ ఇవ్వాల్సి ఉంది. ప్రతీ ఆరు నెలలకొకసారి రూ.2,100, మరో విడతలో రూ.2,100 చొప్పున సబ్సిడీ ఇవాలి. ప్రభుత్వం ఉద్యానశాఖకు లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నా పెట్టుబడులు వచ్చే సరికి ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన కల్పించి వారికి నచ్చజెప్పి తోటలు సాగుచేసేలా ఉద్యానశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ తోటల సాగుకు రైతులకు పెట్టుబడులు కూడా అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. ఎకరానికి రూ.60వేల వరకు ఖర్చు వస్తోంది. ఈ పంట సాగులో నాలుగు ఏళ్ల తరువాతే రైతులకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల వరకు ఎకరానికి రూ.4,200 చొప్పున మొత్తం రూ.16,800 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ జమచేయాల్సి ఉంటుంది. ఏటా సకాలంలో బ్యాంకు ఖాతాల్లో రాయితీ జమ కాకపోవడంతో అప్పు చేసి పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
ఫ్యాక్టరీ ఏర్పాటు ఎన్నడో?
ఉమ్మడి జిల్లాకు సంబంధించి జిల్లాలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆయిల్‌పామ్‌కు దిగుబడుల కొనుగోలుకు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం యోచించింది. 20 వేల ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ తోటలు విస్తరించి న వెంటనే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిం ది. ఇప్పటికే 22వేల ఎకరాలకు పైగా తోటలు విస్తరించినా ఇప్పటి వరకు ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్పష్టత లేదు. ఫ్యాక్టరీ ఏర్పాటయితే రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా ఇక్కడే దిగుబడులు విక్రయించుకోవచ్చు. ప్రస్తుతం దిగుబడులు వస్తున్న రైతులు ఖమ్మంతో పాటు విజయవాడకు వెళ్తున్నారు. ధరలు కూడా కేంద్రప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పు డు నిర్ణయిస్తుండటంతో రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నా, మార్కెట్ అందుబాటు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆయిల్‌పామ్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఎదురవుతున్న ఆటంకాలు రైతులకు ఇబ్బందికరంగా మారాయి. టన్ను ధర రూ.21 వేలకు పైగా ఎంటే ఎకరా రైతు రూ.1.50లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుం ది. ఎకరానికి ఖర్చు రూ.60వేలు వస్తుండగా, వరితో పోలిస్తే 7 నుంచి 8 రెట్లు అధిక ఆదాయం వస్తుందని సంబంధితశాఖ అధికారులు పే ర్కొంటున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు రావాల్సిన కంపెనీ ఇ ప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. భూమిని కొనుగోలు చేసినప్పటికీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఇంకా ప్రణాళిక రూపొందించకపోవడంతో అది ఎన్నటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రైతులకు మార్కెట్ ఎప్పుడు అందుబాటులో వస్తుందనే దానిపై స్పష్టత కొరవడటంతో దూరప్రాంతాలకు దిగుబడులు తీసుకెళ్లేందుకు రైతులపై రవాణా భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రభు త్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయిల్‌పామ్ సాగుచేస్తున్న రైతులు కోరుతున్నారు.