Share News

ఇంకో వారం!

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:18 AM

ఆటుపోట్లు, ఇబ్బందుల నడుమ కొనసాగి న యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో చివరిదశకు చేరింది. ఈసారీ ధాన్యం విక్రయాల్లో అన్నదాతలు అవస్థలు ఎదుర్కొన్నారు. తాలు, తేమ పేరుతో ధాన్యం తూకం, ధరలో కోత విధించడం ఈ సీజన్‌లో కొనుగోళ్ల ప్రక్రియకు ప్రధాన అడ్డంకి గా మారింది. లారీల కొరత, దిగుమతుల్లో జాప్యం రైతులను ఆగ్రహానికి గురిచేసింది.

ఇంకో వారం!

తుదిదశకు చేరిన ధాన్యం కొనుగోళ్లు

నల్లగొండ జిల్లాలో దాదాపు ముగింపు

సూర్యాపేట జిల్లాలో వారం రోజులు

జిల్లాలో మరో 10రోజులు కొనసాగనున్న ప్రక్రియ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ) : ఆటుపోట్లు, ఇబ్బందుల నడుమ కొనసాగి న యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో చివరిదశకు చేరింది. ఈసారీ ధాన్యం విక్రయాల్లో అన్నదాతలు అవస్థలు ఎదుర్కొన్నారు. తాలు, తేమ పేరుతో ధాన్యం తూకం, ధరలో కోత విధించడం ఈ సీజన్‌లో కొనుగోళ్ల ప్రక్రియకు ప్రధాన అడ్డంకి గా మారింది. లారీల కొరత, దిగుమతుల్లో జాప్యం రైతులను ఆగ్రహానికి గురిచేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో అప్రమత్తమైన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సచివాలయం నుం చి పలుమార్లు సమీక్షలు నిర్వహించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఉమ్మడి జిల్లా లో మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీచేసి అధికారులతో వరుస సమీక్షలు, నిత్యం పరిస్థితిని పర్యవేక్షించడంతో పక్షం రోజులుగా కొనుగోళ్ల ప్రక్రియ జాప్యం లేకుండా వేగవంతంగా కొనసాగింది. నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ దాదాపు చివరిదశకు చేరగా, సూర్యాపేట జిల్లా లో మరో నాలుగైదు రోజులు గరిష్ఠంగా వారంలోపు ముగియనుంది. ఒక్క యాదాద్రి జిల్లాలో సీజన్‌ సైతం ఆలస్యంగానే రావడంతో మరో 10రోజుల వరకు కొనుగోళ్లు కొనసాగనున్నాయి.

నల్లగొండ జిల్లాలో దాదాపు ముగిసిన ప్రక్రియ

నల్లగొండ జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటివర కు 7,36,549 మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. జిల్లాలో మొత్తం 416 ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పటికే 305 కేం ద్రాలు మూసివేశారు. ఇంకా 115 కేంద్రాల్లో చివరిదశ కొనుగోళ్లు సాగుతున్నాయి. కేంద్రాల వద్ద ఇంకా సుమారు 15వేల మెట్రిక్‌టన్నుల ధాన్యం ఉందని, గరిష్ఠంగా ఒకటి, రెండు రోజుల్లో మొత్తం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిచేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో కొనుగోళ్లకు సంబంధించి ధాన్యం వివరాలను దాదాపు వందశాతం మే ర ట్యాబ్‌ ఎంట్రీలు చేస్తున్నామని, వెనువెంటనే ట్రక్‌ షీట్లు ఇస్తున్నామ ని తెలిపారు. అదేవిధంగా ఇప్పటివరకు సుమారు రూ.1425కోట్లు రైతులకు చెల్లించామని, మరోవారం లోపు వందశాతం చెల్లింపులు పూ ర్తవుతాయని అంటున్నారు.

సూర్యాపేట జిల్లాలో ఇంకో వారం

సూర్యాపేట జిల్లాలో నాగార్జునసాగర్‌ ఆయకట్టు ప్రాంతంలో, బోరుబావుల కింద వరి సాగైన చోట్ల దాదాపుగా కొనుగోళ్లు పూర్తయ్యాయి. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో ఇంకా కొంతమేర ధాన్యం కాంటాలవ్వాల్సి ఉండడంతో సోమవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి ధాన్యం కేంద్రాలను తనిఖీచేసి అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. నాలుగైదు రోజుల్లో వందశాతం కొనుగోళ్లు పూర్తయ్యేలా అధికారులకు మం త్రి సూచనలు చేశారు. జిల్లాలో మొత్తం 354 ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ప్రారంభించగా, ఇప్పటికే 218 కేంద్రాలు మూసివేయగా, ఇం కా 95 కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 3,55,352 మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేయగా, ఇంకా కేంద్రాలకు వచ్చిన ధాన్యం లో 35,287 మెట్రిక్‌టన్నులకు కాంటాలవ్వాల్సి ఉంది. గరిష్ఠంగా వారంలోపే ఈ ధాన్యమంతా కాంటాలేసి మిల్లులకు తరలించేందుకు చర్యలు చేపట్టామని అధికారులు పేర్కొంటున్నారు. ఈ జిల్లాలో ఇప్పటివరకు రైతులకు రూ.557.10కోట్ల బిల్లులు కూడా చెల్లించారు. ట్యాబ్‌ ఎంట్రీ అ యిన బిల్లులన్నింటికీ మూడు రోజుల గడువులోగా బిల్లులు చెల్లిస్తున్నామని పౌరసరఫరాలశాఖ అధికారులు తెలిపారు.

యాదాద్రిలో మరో 10 రోజులు

నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతో పోల్చుకుంటే కొంత ఆలస్యంగానే వరికోతలు ప్రారంభం అవడంతో యాదాద్రి జిల్లాలో కొనుగోళ ్ల ప్రక్రియ కొంత ఆలస్యంగానే జరుగుతోంది. ఇక్కడ సైతం తొలుత తేమ, తాలు పేరుతో కోతలు, లారీలు, హమాలీల కొరత నెలకొనడంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమైంది. మంత్రుల సమీక్షల తర్వాత పరిస్థితి గాడినపడడంతో కొనుగోళ్లు వేగవంతమయ్యాయి. ఈ జిల్లాలో ఇప్పటివరకు 3,18,497 మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. తొలుత నిర్ణయించుకున్న లక్ష్యం ప్రకారమైతే ఇంకా 1.30లక్షల వరకు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే రైతులు చాలా మంది ఇప్పటికే ప్రైవేట్‌ వ్యాపారులకు ధాన్యం విక్రయించారని, ఇంకా సుమారు 70వేల మెట్రిక్‌టన్నులకు మించి ధాన్యం కేంద్రాలకు రాకపోవచ్చని పేర్కొంటున్న అధికారులు ఆమేరకు కొనుగోళ్లు చేస్తామని చెబుతున్నారు. రైతుల ధాన్యం వచ్చేంతవరకు కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో ఈ పదిరోజుల్లో ఎంతవస్తే అంత ధాన్యం కొనుగోలు చేసేలా జిల్లాలో కార్యాచరణ అమలవుతోంది. రైతులు మాత్రం మంత్రులు ఇచ్చిన హామీ మేరకు ధాన్యం ఉన్నంతవరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఇప్పటివరకు రూ.521.12 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని అధికారులు తెలిపారు.

Updated Date - Jun 02 , 2026 | 12:18 AM