ఎల్‌ఆర్‌ఎ్‌సకు మరో అవకాశం
ABN , Publish Date - May 09 , 2026 | 12:19 AM
ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తుదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటికే జూలై 31 నాటికి రాయితీతో చెల్లించిన వారికి క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
జూలై 31వ తేదీలోపు ఫీజు చెల్లింపునకు అవకాశం
గతంలో దరఖాస్తు చేసుకున్న వారే అర్హులు
జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో వేల దరఖాస్తులు
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట(కలెక్టరేట్):ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తుదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటికే జూలై 31 నాటికి రాయితీతో చెల్లించిన వారికి క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పర్యాయం 25 రాయితీ ప్రకటించింది. అటు క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడంతో రాయితీ కల్పించడం దరఖాస్తుదారులకు కలిసివచ్చే అవకాశంగా చెబుతున్నారు.
అనుమతులు లేని వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసిన యజమానులకు కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఊరట కల్పించింది. అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్దీకరణకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్(ఎల్‌ఆర్‌ఎ్‌స)ను తీసుకువచ్చింది. ఇది ప్రభుత్వ అనుమతులు లేకుండా వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి వరంగా మారింది. ఇళ్లు నిర్మించుకునేందుకు ప్లాట్ల యజమానులు అనుమతుల కోసం మునిసిపాలిటీల్లో రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే 2017లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎ్‌సను ప్రవేశపెట్టి ప్లాట్ల కొనుగోలుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. వాటిని పరిశీలించి అర్హత మేరకు క్రమబద్ధీకరించారు. ఆ తర్వాత 2019లో మరోసారి ఎల్‌ఆర్‌ఎ్‌సకు అవకాశం కల్పించారు. కాకపోతే 2019లో మాత్రం నూతనంగా ఏర్పడిన మునిసిపాలిటీలు, పాత మునిసిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మాత్రమే అవకాశం కల్పించారు. అయితే 2020 జనవరి 28వ తేదీలోపు క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో వేల సంఖ్యలో ప్లాట్ల క్రమబద్దీకరణకు దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తులకు రూ.1000 డీడీ చెల్లించి దరఖాస్తులను ఆన్‌లైన్ చేశారు. కానీ వాటిని ఇప్పటివరకు పరిష్కరించలేదు.
25శాతం రాయితీ...
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారంలో వచ్చిన తర్వాత తాజాగా పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా చెల్లించాల్సిన ఫీజులో 25శాతం రాయితీ కూడా ప్రకటించింది. దీంతో గతంలో దరఖాస్తులు చేసుకున్న ప్లాట్ల యజమానులు ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి వారి ప్లాట్లను క్రమబద్దీకరించుకోనున్నారు. దీంతో ఎల్‌ఆర్‌ఎస్ రూపంలో జిల్లావ్యాప్తంగా రూ.కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.
జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో
జిల్లాలో నూతనంగా ఏర్పాటైన తిరుమలగిరి, నేరేడుచర్ల మునిసిపాలిటీలతో పాటు సూర్యాపేట, కోదాడ పట్టణాల్లో విలీనమైన గ్రామాలల్లో ఏర్పాటుచేసిన అక్రమ లేఅవుట్లలోని స్థలాలను క్రమబద్దీకరించుకునే అవకాశం కల్పించారు. అందుకోసం సూర్యాపేట పరిధిలో విలీనమైన దురాజ్‌పల్లి, బీబీగూడెం, కుడకుడ, గాంధీనగర్, పిల్లలమర్రి, రాయినిగూడెం, కుప్పిరెడ్డిగూడెం, దాసాయిగూడెం, కుసుమవారిగూడెం గ్రామాలు, కోదాడలో విలీనమైన తమ్మర, కొమరబండ గ్రామాల పరిధిలో వెలిసిన అక్రమ వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారికి ఎల్‌ఆర్‌ఎస్ అవకాశం కల్పించారు.
జూలై 31 వరకు అవకాశం
ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు క్రమబద్ధీకరించుకునేందుకు జూలై 31వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అందుకోసం ముందుగా మునిసిపాలిటీల్లో భూమి యజమాన్యపత్రాలు, లింకు డాక్యుమెంట్లు, ఈసీ కాపీలు, స్థలం ఫొటోలు, గతంలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం చెల్లించిన రూ.1000 రశీదును జత చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 1 జనవరి 1985 నుంచి 30మార్చి 2018లోపు అక్రమ వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారికి మాత్రమే అవకాశం కల్పించారు. అనుమతులు లేని అక్రమ లేఅవుట్లు, వ్యక్తిగత ప్లాట్లను నిషేధిత రిజిస్ట్రేషన్ల జాబితాలో నమోదు చేయించి క్రయ, విక్రయాలు నిలిపివేయించే అవకాశాలు ఉన్నా యి. ఒక వేళ ఆయా స్థలాల్లో ఏవైనా నిర్మాణాలు ఉంటే ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లు నీటి బిల్లు మూడు రెట్లు పెంచి వసూలు చేసే అవకాశం ఉంది.
రూ.కోట్లలో మునిసిపాలిటీలకు ఆదాయం
ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా జిల్లాలోని మునిసిపాలిటీలకు రూ.కోట్లలో ఆదాయం సమకూరనుంది. ఉదాహరణకు 100 చదరపు మీటర్ల స్థలం క్రమబద్ధీకరణకు చదరపు మీటరుకు రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా రిజిస్ట్రేషన్ భూమి విలువలో వసూలు చేసే చార్జిలో 25 శాతం రాయితీ కల్పించారు. దీంతో ప్లాట్ల యజమానులు క్రమబద్ధీకరణకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రూ.కోట్లలో ఆదాయం సమకూరనుంది.
ఎల్‌ఆర్‌ఎ్‌సను సద్వినియోగం చేసుకోవాలి : హన్మంతరెడ్డి, మునిసిపల్ కమిషనర్ సూర్యాపేట
ఎల్‌ఆర్‌ఎస్ అవకాశాన్ని యజమానులు సద్వినియోగం చేసుకోవాలి. లేకుంటే అనుమతులు లేని ప్లాట్లలో ఇల్లు నిర్మాణానికి మునిసిపాలిటీ నుంచి అనుమతులు పొందలేరు. ఒకవేళ దరఖాస్తు చేసుకున్నా అన్నిరకాల చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. దీంతో రూ.లక్షల్లో అనుమతుల కోసమే ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది. ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా తక్కువ మొత్తంలో ప్లాట్లు క్రమబద్ధీకరించడం జరుగుతుంది.