Share News

ఐదు కిలోమీటర్ల అదనపు ప్రయాణం

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:29 AM

రాజాపేట మండలం పొట్టిమర్రి వాగుతో మండల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.

 ఐదు కిలోమీటర్ల అదనపు ప్రయాణం
తెగిన అనుసంధాన రోడ్డు

పొట్టిమర్రివాగులో తెగిన అనుసంధాన రోడ్డు

బ్రిడ్జి పనుల్లో కొనసాగుతోన్న జాప్యం

రాజాపేట, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాజాపేట మండలం పొట్టిమర్రి వాగుతో మండల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. కొన్నేళ్లుగా వర్షాకాలం వచ్చిందంటే రాజాపేట నుంచి యాదగిరిగుట్ట, భువనగిరి, హైద్రాబాద్‌ వెళ్లాలంటే వాగు దాటేందుకు అరిగోస పడాల్సిందే. మండలం లోని పొట్టిమర్రి వాగుపై బ్రిడ్జీని నిర్మించేందుకు రూ.11కోట్ల మంజూరు కాగా బ్రిడ్జి పనులను మూడు నెలలుగా నిర్వహిస్తున్నారు. పిల్లర్ల వరకు పనులు జరిగాయి. వాగులో పనులు నిర్వహిస్తుండటంతో యాదగిరిగుట్ట,రాజాపేట, కొమురవెళ్లి వెళ్ళేందుకు ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా అధికారులు అప్రోచ రోడ్డును వేసి రాకపోకలను కొనసాగించారు. కాగా గత నెలలో తుంగతుర్తి, మోత్కూరుకు నీరందంచేందుకు కాళేశ్వరం గోదావరి జలాలను మల్లన్నసాగర్‌, గంధమళ్ళ చెరువు ద్వారా దిగువ భాగానికి విడుదల చేశారు. దీంతో పొట్టిమర్రి వాగులో నిర్మించిన తాత్కాలిక మట్టి రోడ్డు వరద ఉధృతికి పూర్తిగా తెగిపోయింది. దీంతో పొట్టిమర్రి రహదారి గుండా రాకపోకలు నిలిచిపోవడంతో అధికారులు దారి మళ్లించారు. రాజాపేట, కొమురవెళ్ళి నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట, హైద్రాబాద్‌ వెళ్లే ప్రయాణికులు అదనంగా ఆరు కిలోమీటర్ల దూరం నుంచి రఘునాధపురం, బేగంపేట గ్రామాల మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో వ్యయ ప్రయాసలకు ప్రజలు గురవుతున్నారు.

వరదనీరు ఆగితేనే సమస్యకు పరిష్కారమా?

యాదగిరిగుట్ట నుంచి రాజాపేట, చేర్యాల, సిద్దిపేటకు వెళ్లే బస్సులు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుండటంతో అప్పుడప్పుడు బస్సులు రద్దవుతుండటంతో సమయం ఎక్కువగా తీసుకుంటుండటంతో బస్సుల ట్రిప్పులు తగ్గిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. యాదగిరిగుట్ట, కొమురవెళ్ళి దేవస్థానాలకు ప్రధాన రహదారి కావడంతో దారి మళ్లింపుతో వాహనదారులు, భక్తులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరం జలాలు నిలిపివేస్తే తప్ప దారి బాగాయ్యేట్లు కనిపించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ప్రజలు రెండు నెలలుగా ఇబ్బందులు పడుతున్నా అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తాత్కాలిక రోడ్డును నిర్మించి రాకపోకలను కొనసాగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

వాగు వద్ద పలు పార్టీల నిరసనలు

మండలం లోని పొట్టిమర్రి వాగులో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని, తాత్కాలిక రోడ్డును వేయాలని కోరుతూ ఇటీవల బీఆర్‌ఎస్‌ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేవారు. సీపీఐ నాయకులు కొల్లూరు రాజయ్య, చిగుర్ల లింగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తాత్కాలిక రోడ్డును వేసి రాకపోకలను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

అప్రోచ రోడ్డును పునరుద్ధరించాలి

-పుల్లూరు శ్రీనివా్‌స, గ్రామస్థుడు, రాజాపేట

మండలంలోని పొట్టిమర్రి వాగులో కాళేశ్వరం జలాలు పారుతుండటంతో తాత్కాలిక రోడ్డు కొట్టుకు పోవడంతో యాదగిరిగుట్ట, హైద్రాబాద్‌ వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నాం. బేగంపేట, రఘునాధపురం గ్రామాల నుంచి అదనంగా ఆరు కిలోమీటర్లు తిరగాల్సి వస్తోంది. వ్యయ ప్రయాసలకు గురవుతున్నాం. ఇప్పటికైనా పైపులు వేసి అప్రోచ రోడ్డును నిర్మించి రాకపోకలు కొనసాగించాలి.

ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

-సట్టు తిరుమలేష్‌, రాజాపేట

పొట్టిమర్రి వాగులో పనులు జాప్యంగా జరుగుతున్నాయి. వాగులో వేసిన తాత్కాలిక రోడ్డు మల్లన్న సాగర్‌ నీటిని దిగువకు వదులడంతో పూర్తిగా కొట్టుకుపోయింది. యాదగిరిగుట్ట, రాజాపేట, కొమురవెళ్లి వెళ్ళే భక్తులు, ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వెంటనే తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేసి ప్రజల కష్టాలను తీర్చాలి.

Updated Date - Apr 12 , 2026 | 12:29 AM