గుట్టను చెరబట్టి..
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:29 PM
జిల్లా కేంద్రం శివార్లలో పచ్చనిచెట్లతో ఆహ్లాదాన్ని పంచాల్సిన ఆ గుట్ట మట్టి తవ్వకాలతో నామరూపాలు కోల్పోతోంది. గుట్టపైన అనేశ్వరమ్మ దేవాలయం, గోశాల వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు, జిల్లాలోని దాదాపు 600 గ్రామాలకు తాగునీరందించే మిషన్‌భగీరథ పథకాలకు సంబంధించిన ఫిల్టర్‌బెడ్లు, నల్లగొండ నగరానికి తాగునీరందించే అమృత్ పథకం ఫిల్టర్‌బెడ్ల వంటి కీలక నిర్మాణాలు ఈ గుట్టపైనే ఉన్నాయి.
అనేశ్వరమ్మ గుట్ట వద్ద అక్రమంగా మట్టితవ్వకాలు
133 ఎకరాల్లో విస్తరించిన గుట్ట
మట్టితవ్వకాలే కాదు, స్థలం కూడా కబ్జా
పదేళ్ల క్రితమే తవ్వకాలపై నిషేధం
అయినా ఉల్లంఘిస్తున్న మాఫియా
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): జిల్లా కేంద్రం శివార్లలో పచ్చనిచెట్లతో ఆహ్లాదాన్ని పంచాల్సిన ఆ గుట్ట మట్టి తవ్వకాలతో నామరూపాలు కోల్పోతోంది. గుట్టపైన అనేశ్వరమ్మ దేవాలయం, గోశాల వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు, జిల్లాలోని దాదాపు 600 గ్రామాలకు తాగునీరందించే మిషన్‌భగీరథ పథకాలకు సంబంధించిన ఫిల్టర్‌బెడ్లు, నల్లగొండ నగరానికి తాగునీరందించే అమృత్ పథకం ఫిల్టర్‌బెడ్ల వంటి కీలక నిర్మాణాలు ఈ గుట్టపైనే ఉన్నాయి. సుమారు 20 ఏళ్ల క్రితం ఇక్కడ అర్బన్‌పార్క్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో సోషల్‌ఫారెస్ట్ పథకం కింద నీలగిరి మొక్కలు, ఇతర నీడనిచ్చే 20 రకాల మొక్కలను ప్రభుత్వం నాటించింది. ఇన్ని ప్రభుత్వ పథకాలున్న కీలకమైన ఈ గుట్ట వద్ద నిత్యం జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను ఏ శాఖ అధికారి కూడా నిలువరించలేకపోతున్నారు.
నల్లగొండ నగరం రోజురోజుకూ విస్తరిస్తుండడం, ఈ గుట్ట మట్టి నాణ్యత కలిగిన మొరం కావడంతో ఇక్కడ రాత్రి, పగలు తేడాలేకుండా అక్రమంగా మట్టితవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వీటిని అడ్డుకునే నాథుడు కరువవ్వడంతో అదే సమయంలో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నగరానికి సమీపంలోని ఈ గుట్ట నుంచి ప్రతీ సీజన్‌లో సుమారు 40వేల లారీల పైచిలుకు అక్రమంగా మట్టి తరలుతోంది. ఈ మట్టి విక్రయం ద్వారా మట్టిమాఫియా సుమారు రూ.16కోట్ల వరకు అక్రమంగా కాసులు సంపాదించినట్టు తెలుస్తుండగా, ప్రభుత్వానికి రావాల్సిన సుమారు రూ.2కోట్ల మేర రాయల్టీ దక్కలేదు. కలెక్టర్ సహా జిల్లా ఉన్నతాధికారులు, మైనింగ్, రెవెన్యూ, ఇతర శాఖల విభాగాధిపతుల ఉన్న జిల్లా కేంద్రంలో నిత్యం ఈ దందా సాగుతున్నా మట్టిమాఫియాను నియంత్రించేలేని స్థితిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా కేంద్రం శివారు సర్వేనెంబర్ 33లో 133 ఎకరాల్లో విస్తరించిన అనేశ్వరమ్మ గుట్టపై మట్టి మాఫియా పాగా వేసిం ది. జిల్లా కేంద్రానికి చెందిన మట్టి వ్యాపారులు ముఠాగా ఏర్ప డి ఈ గుట్టపై అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఎక్స్‌కవేటర్లు, టిప్పర్లను వినియోగించి గుట్ట మట్టిని కొల్లగొడుతున్నా రు. ఈ గుట్టపై అక్రమ తవ్వకాలపై ఫిర్యాదుల నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తవ్వకాలపై నిషేధం విధించారు. ఆ సమయంలో కొంత కాలం పాటు ఎలాంటి తవ్వకాలు జరగకుండా అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరించారు. తిరిగి నాలుగైదేళ్ల నుంచి తవ్వకాలు ఊపందుకున్నాయి. నల్లగొండ నగరం రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇక్క డ నిర్మాణాలు అంతేస్థాయిలో పెరగడం, ఇళ్లు, ఇతర నిర్మాణాలకు వినియోగించే మొరం మట్టి ఈ గుట్టపైనే లభిస్తుండడం తో వందల లారీల వరకు ఆర్డర్లు బుక్ చేసుకుంటున్న మట్టిమాఫియా తవ్వకందార్లు ఒకే రోజు రాత్రివేళ మూడు లేక నాలుగు ఎక్స్‌కవేటర్లను రంగంలోకి దించి ఒక్క రాత్రిలోనే ఆ ఆర్డర్ మేరకు తవ్వకాలు గుట్టచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నా రు. తవ్వకాలు చేసే సమయంలో ఎవరూ అడ్డురాకుండా ముం ద స్తుగానే రెవెన్యూ, పోలీస్ ఇతరత్రా స్థానిక చోటా, మోటా నాయకులతో కుమ్మక్కయి వారి పని పూర్తిచేసుకుంటున్నారు. ఒక్కో లారీ మట్టిని కనీసం రూ.4వేల వరకు విక్రయిస్తున్న ఈ ముఠా గుట్టను లూటీ చేస్తోంది. ఇటు రెవెన్యూశాఖ నుంచి గా నీ, అటు మైనింగ్‌శాఖ నుంచి గానీ ఈ తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవు. మట్టితవ్వకాలకు ప్రభుత్వం అనుమతిస్తే రెవెన్యూశాఖ నుంచి భూమి కేటాయించాక మైనింగ్‌శాఖకు సెస్ చెల్లించి తవ్వకాలు చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టికి రూ.40చొప్పున ఒక్కో లారీకి కనీసం రూ.400 వరకు సెస్‌ను మైనింగ్‌శాఖకు రాయల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ నిబంధనలేవీ పాటించడం లేదు. మట్టితవ్వకాలతో గుట్ట స్వరూపం కోల్పోతుండగా, ఇదేమని ప్రశ్నిస్తే మాఫియా దాడులకు. పాల్పడుతోందని స్థానికులు వాపోతున్నారు. పైగా గుట్టను తవ్వి వదిలేయకుండా గుట్ట స్థలాన్ని సైతం కబ్జా చేస్తున్నారని, ఇది తమ భూమేనని ఎవరైనా వస్తే అంతుచూస్తామని బెదిరిస్తున్నారనే ఆరోపణలకు సమాధానం లేకుండాపోయింది.
ఫెన్సింగ్ ఏర్పాటుకు ఒకరిపై ఒకరి నెపం
అనేశ్వరమ్మ గుట్టపై తవ్వకాల గురించి ఇక్కడ దేవాలయ కమిటీ సభ్యులు, ఇతర ఆధ్యాత్మిక ప్రముఖులతో పాటు పట్టణ ప్రముఖులు పలువురు, పలు సందర్భాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. ఇక్కడ పచ్చదనాన్ని పెంచేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన సోషల్‌ఫారెస్ట్రీ అడ్రస్ లేకుండా పోయిందని, మొక్కలు ఎండిపోయాయని, కొంతమేర పెరిగిన నీలగిరి, తదితర చెట్లు కనుమరుగవుతున్నాయని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. మట్టిమాఫియా పాగావేశాక ఇక్కడ స్వరూపమే మారిపోయిందని, గుట్టను సైతం కబ్జాపెట్టి అడ్డగోలుగా తవ్వుతున్నారని పేర్కొంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో రెవెన్యూ, మునిసిపల్, మిషన్‌భగీరథ, మైనింగ్‌శాఖలు సమన్వయంతో ఇక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. అయితే ఈ శాఖల అధికారులు బాధ్యత తమదికాదంటే తమది కాదని తప్పించుకుంటుంటే, మాఫియా మాత్రం అడ్డగోలుగా మట్టిని తవ్వి విక్రయిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని గుట్టపై అక్రమ తవ్వకాలను నిరోధించాలని, గుట్ట పరిధిలోని 133 ఎకరాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.