Share News

ఏదుల-డిండి అనుసంధానంపై ముందుకే

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:13 AM

నల్లగొండ, మహబూబ్‌నగ ర్‌ జిల్లాల నడుమ రాజకీయ వివాదానికి దారితీసిన ఏదుల-డిండి అనుసంధాన ప్రాజెక్టుపై ముందుకే వెళ్లాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. వివాదాల కు తావులేకుండా, ఇటు డిండి ఎత్తిపోతల, అటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు నీటి తరలింపు చేపట్టాలని ప్రభుత్వం ఇంజనీర్లను ఆదేశించింది. శుక్రవారం సెక్రటేరియట్‌లో నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

ఏదుల-డిండి అనుసంధానంపై ముందుకే

క్యాబినెట్‌ సమావేశంలో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సీఎం, మంత్రి

పాలమూరు-రంగారెడ్డికి అదనంగా నార్లాపూర్‌ నుంచి 0.60టీఎంసీలు సేకరించాలని నిర్ణయం

రీడిజైన్‌ సమయంలో పాలమూరు నుంచి డిండికి 0.50టీఎంసీలు తరలించాలని నిర్ణయించిన ప్రకారమే..

(నల్లగొండ, ఆంధ్రజ్యోతిప్రతినిధి): నల్లగొండ, మహబూబ్‌నగ ర్‌ జిల్లాల నడుమ రాజకీయ వివాదానికి దారితీసిన ఏదుల-డిండి అనుసంధాన ప్రాజెక్టుపై ముందుకే వెళ్లాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. వివాదాల కు తావులేకుండా, ఇటు డిండి ఎత్తిపోతల, అటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు నీటి తరలింపు చేపట్టాలని ప్రభుత్వం ఇంజనీర్లను ఆదేశించింది. శుక్రవారం సెక్రటేరియట్‌లో నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

డిండికి ఏదుల నుంచి నీటిని తరలించడంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల్లో తగ్గుదల లేకుండా ఉండేందుకు శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి ఏదులకు అదనంగా మరో 0.60టీఎంసీల నీటిని తరలించేందు కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత ఇంజనీర్లకు ప్రభుత్వం సూచించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నిర్మించతలపెట్టిన అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి సైతం 0.10టీఎంసీల నీటి ని కేటాయించి, ఆపథకాన్ని పూర్తిచేయాలని ఆదేశించింది. గత కొంతకాలంగా రాజకీయ వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ఏదుల-డిండి అ నుసంధానంపై స్పష్టత రావడంతో ఈ ప్రాజెక్టు పనులు ఇకపై వేగవంతంగా కొనసాగించి ఏడాదిన్నర కాలంలో పూర్తిచేసేందుకు ప్రభుత్వం కా ర్యాచరణ అమలు చేయాలనే సూచనలు వస్తున్నాయి.

పాలమూరు ఎత్తిపోతలకు నార్లాపూర్‌ నుంచి మరో 0.60 టీఎంసీలు

డిండి ఎత్తిపోతలకు ఏదుల నుంచి 0.50టీఎంసీల నీటిని తరలించవద్దని, ఏదుల నుంచి 2టీఎంసీల నీటిని పూర్తిగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికే కేటాయించాలని ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి డిమాండ్లు రావడంతో పాటు, ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. ఓ వైపు ఏదుల-డిండి అనుసంధాన పథకానికి రూ.1800 కోట్లతో టెండర్లు ఖరారైన దశలో, రెండోవైపు ఈ పథకమే వద్దంటూ ఆందోళనలు జరగడంతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ రెండు ప్రాజెక్టులను ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లేందుకు ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో సూచించాలని ఇంజనీర్లను కోరారు. తాజాగా, శుక్రవారం జరిగిన క్యాబినెట్‌లో ఈ నీటి కేటాయింపుల వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఏదుల-డిండిని కొనసాగిస్తూ 60 వరద రోజుల్లో ప్రతి రోజూ 0.50టీఎంసీల చొప్పున నీటిని ఏదుల నుంచి డిండి పథకానికి ఇవ్వాలని, అందుకోసం నిర్ణయించిన ఏదుల-డిండి అనుసంధాన పథకాన్ని కొనసాగించాలని స్పష్టత ఇచ్చింది. ఇటు డిండికి 0.50టీఎంసీలు, అటు అచ్చంపేట ఎత్తిపోతలకు 0.10టీఎంసీలు, మొత్తం 0.60టీఎంసీలు తరలిస్తున్నందున, అదే సమయంలో పాలమూరు ఉమ్మడి జిల్లా నాయకులు, రైతులు కోరుతున్న ప్రకారం పాలమూరు ఎత్తిపోతలకు ఇప్పటికే కేటాయించిన రోజుకు 1.50టీఎంసీలకు తోడు, ప్రతి రోజూ మరో 0.60 టీఎంసీల నీటిని శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ (నార్లాపూర్‌ రిజర్వాయర్‌) నుంచి సేకరించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని క్యాబినెట్‌ సమావేశం ద్వారా ఇరిగేషన్‌శాఖను ఆదేశించింది. అందుకోసం అదనపు పంపులు, మోటార్ల ఏర్పాటుతో పాటు నార్లాపూర్‌ నుంచి ఏదుల వరకు పెరిగే నీటిప్రవాహం మేరకు చేపట్టాల్సిన నిర్మాణాలపై ఎలా ముందుకెళ్లాలో అధికారులు, ఇంజనీర్లు నిర్ణయించాలని ప్రభుత్వం సూచించింది.

రీడిజైన్‌ మేరకు పాలమూరు, డిండికి కలిపి శ్రీశైలం నుంచి నీరు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలం సోర్స్‌గా రీ డిజైన్‌ చేసిన సమయంలో అప్పటి సీఎం కేసీఆర్‌ నిర్వహించిన స మావేశాల్లో నీటిపారుదలరంగ నిపుణుల సూచనలతో పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు రెండింటికీ కలిపి శ్రీశైలం బ్యాక్‌వాటర్స్‌లో ఒకేసోర్స్‌ నుంచి రోజుకు 2టీఎంసీల చొప్పున 60 వరద రోజులు నీటిని తరలించాలని నిర్ణయించారు. వచ్చే నీటిలో ప్రతి రోజూ 1.50 టీఎంసీ చొప్పున 90టీఎంసీలు పాలమూరు ఎత్తిపోతలకు, మరో 0.50టీఎంసీ చొప్పున 30టీఎంసీల నీటిని డిండికి కేటాయించాలని ఖరారు చేశారు. దీని ప్రకారమే డిండి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించి పనులు చేపట్టారు. అప్పటి సీఎం కేసీఆర్‌ 2015, జూన్‌ 12న డిండి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన సైతం చేసి పనులు ప్రారంభించడంతో ఈ పథకానికి నీటి కేటాయింపుల్లో సమస్యలు రావని ప్రతిపాదిత ఆయకట్టు రైతాంగం భావించింది. కా నీ, ఏదుల-డిండికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సమయంలో పా లమూరు ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిళ్లు రావడంతో పరిస్థితి సంకటంగా మారింది. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెడుతూ ప్రభుత్వం తాజాగా, ఇటు డిండి ఎత్తిపోతల, అటు పాలమూరు ఎ త్తిపోతల రెండింటినీ సకాలంలో పూర్తిచేసేలా, రెండు జిల్లాల మధ్య వివాదం లేకుండా ఉండేలా తాజాగా, క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవడంపై ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

పెండింగ్‌ పనులన్నీ వేగవంతంగా పూర్తిచేయాలి

ఏదుల-డిండి అనుసంధాన ప్రాజెక్టు కొనసాగించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో ఈ పనులను ఇకపై వేగవంతంగా చేపట్టాలని నిర్దేశిత ఆయకట్టు రైతాంగం కోరుకుంటోంది. ఫ్లోరైడ్‌పీడిత దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సురక్షిత సాగు, తాగునీటిని అందించే ఈ పథకం కింద చేపట్టిన రిజర్వాయర్ల పనులు ఇప్పటికే దాదాపు 80శాతం మేర పూర్తవగా, రూ.3,500కోట్ల వరకు వ్యయమైంది. ఇంకా ఈ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన కాల్వలు, ఇతర నిర్మాణాల కోసం సుమారు 4వేల ఎకరాల భూమితో పాటు, ఏడు ఆవాసాలకు సంబంధించి సుమారు 1,900 కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ కింద పునరావాస ప్యాకేజీలు, పునరావాస కేంద్రాల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. వీటితోపాటు అనుసంధాన పథకం చేపట్టాలంటే, నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలో నిర్మించాల్సిన సుమారు 21.575 కిలోమీటర్ల కాల్వలు, పోతిరెడ్డిపాడు చెక్‌డ్యామ్‌ విస్తరణ, ఉల్పర వద్ద బ్యారేజీ నిర్మాణానికి భూసేకరణ చేయాల్సి ఉంది. ఇటు నల్లగొండ జిల్లాలో ఈ పథకం కింద చేపట్టిన ఐదు రిజర్వాయర్ల పెండింగ్‌ పనులు, ఏదుల-డిండి అనుసంధానం పనులన్నింటినీ ఏకకాలంలో చేపట్టి 2028 జూన్‌లోగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలనే సూచనలు వస్తున్నాయి.

ఏదుల-డిండి కొనసాగింపు అభినందనీయం

ఫ్లోరైడ్‌ పీడిత దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరందించే డిండి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల-డిండి అనుసంధాన పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయం. అందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి వెంటనే పనులు ప్రారంభించాలి. డిండి ఎత్తిపోతల కింద ఇప్పటికే రిజర్వాయర్ల నిర్మాణాలు దాదాపు పూర్తయిన పరిస్థితుల్లో ఇతర పెండింగ్‌ పనులను సమాంతరంగా చేపట్టాలి. ఏడాది కాలంలో ఈ పనులన్నింటనీ పూర్తిచేసి ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీరందించేలా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేయాలి.

- నెల్లికంటి సత్యం, ఎమ్మెల్సీ సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి

Updated Date - Oct 24 , 2026 | 12:13 AM