అడ్మిషన్ల వేట
ABN , Publish Date - May 30 , 2026 | 12:11 AM
పదో తరగతి ఫలితాలు ప్రకటించడంతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంటర్ లో అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. తమ కళాశాలలో నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పేరుతో అడ్మిషన్లు ప్రక్రియ చేపట్టాయి.
ఇంటర్‌లో నాణ్యమైన విద్య, ర్యాంకుల పేరుతో గాలం
జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ కోచింగ్‌ల పేరుతో అదనపు వసూళ్లు
తల్లిదండ్రులను మభ్యపెడుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలు
ఆంధ్రజ్యోతి, కోదాడ, సూర్యాపేట టౌన్ : పదో తరగతి ఫలితాలు ప్రకటించడంతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంటర్ లో అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. తమ కళాశాలలో నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పేరుతో అడ్మిషన్లు ప్రక్రియ చేపట్టాయి. ఏఐలో అదనంగా శిక్షణ ఇస్తామని విద్యార్థుల తల్లిదండ్రుల చుట్టూ, కళాశాల యాజమాన్యాలు, అధ్యాపకులు తిరుగుతున్నారు. నాణ్యమైన విద్య, ప్రతిభ గల అధ్యాపకులతో బోఽధన, ఏసీ గదులు, డే స్కాలర్స్‌కు ప్రత్యేక బస్సులు పేరుతో ప్రచారం చేస్తున్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించడ మే లక్ష్యమని తల్లిదండ్రులను కళాశాల నిర్వాహకులు మభ్యపెడుతున్నారు.
అడ్మిషన్ల కోసం వేలకు వేలు జీతాలు ఇస్తూ పీఆర్‌వో వ్యవస్థను నడిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులు సైతం, పిల్లల ఉన్నత భవిష్యత్ కోసం ప్రైవేట్, కార్పొరేట్ కళాశాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రుల బలహీనతలను ఆసరా చేసుకొని పెద్దమొత్తంలో ఫీజులు నిర్ణయిస్తున్నాయి. మార్కులు, ఎంట్రన్స్, ఫీజుల రాయితీ పేరుతో విద్యార్థులను, తమ కళాశాల వైపు మళ్లించుకుంటున్నాయి. గ్లోబల్స్ ప్రచారంలో పడి, తల్లిదండ్రులు మోసపోవద్దని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యవేత్తలు సూచిస్తున్నారు. విద్యార్థి సామర్థ్యం, కళాశాల నిర్వహణ, గత ఫలితాలు, పోటీ పరీక్షల్లో రాణించిన విద్యార్థులు, సాధించిన సీట్లు పరిగణలోకి తీసుకొని, అడ్మిషన్ తీసుకోవాలంటున్నారు. ప్రభుత్వం ముందస్తు అడ్మిషన్లు చేపట్టే కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 988 పాఠశాలలు
సూర్యాపేటలో 388, నల్లగొండలో 333, యాదాద్రి జిల్లాలో 317 ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 988 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాలో మొత్తంగా 40,640 మంది విద్యార్థులు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. వారిలో బాలుర 20,621, బాలికలు 20,019 మంది ఉత్తీర్ణత సాధించారు. సూర్యాపేట జిల్లాలో 6,327 మంది బాలురు, 5,961మంది బాలికలు, నల్లగొండలో బాలురు 10,004, బాలికలు 9,472మంది, యాదాద్రి జిల్లాలో బాలుర 4,290మంది, బాలికలు 4,586 మంది మొత్తంగా 40,640మంది ఉత్తీర్ణత సాధించారు.
బ్యాచుల పేరుతో అధిక ఫీజులు
కార్పొరేట్ విద్యాసంస్థలు కొన్ని మెరిట్, స్టార్, స్టార్-1, స్టార్-2 బ్యాచ్ పేరుతో ఫీజుల నిర్ణయిస్తున్నాయి. ఏసీ క్యాంపస్, నాన్‌ఏసీ పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నాయి. గతంలో వచ్చిన ర్యాంకులను పదేపదే ప్రచారం చేస్తూ తల్లిదండ్రులు ఆకర్షిస్తున్నారు. ప్రత్యేక బ్యాచ్ పేరుతో తల్లిదండ్రులను నమ్మ బలుకుతున్నారు. వారి మాటలను నమ్ముతున్న తల్లిదండ్రులు, తమ పిల్లల సామార్థ్యాన్ని గమనించకుండా లక్షలాది ఫీజులు చెల్లిస్తున్నారు.
లక్షల్లో ఫీజులు
కార్పొరేట్ విద్యాసంస్థల్లో మెరిట్ బ్యాచ్‌కు(హాస్టల్‌తో కలిపి) రూ.140లక్షలు, స్టార్ బ్యాచ్‌కి రూ.1.60లక్షలు, స్టార్-1కు రూ.1.80 లక్షలు, స్టార్-2కు రూ.2లక్షల వరకు ఫీజుల వసూలు చేస్తున్నారు. అదనంగా మరో రూ.26వేలు ఇతరాత్ర ఫీజులు. ఇంటర్ రెండు సంత్సరాలు పూర్తిచేయడానికి ఒక్కో విద్యార్థిపై తల్లిదండ్రులు రూ.3లక్షల నుంచి రూ.4.50లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రయాణ ఖర్చులు అదనం. అదే విధంగా జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలో సైతం డే స్కాలర్స్ రూ.25నుంచి రూ.40వేల వరకు ఉంది. కొన్ని కళాశాలలో రూ.50వేల నుంచి రూ.లక్షవరకు ఉంది. హాస్టల్ అయితే రూ.80నుంచి రూ.2లక్షల వరకు ఉంది.
కనిపించని ప్రభుత్వ నిబంధన
ముందస్తు అడ్మిషన్లు చేయకూడదన్న జీవో ఉన్నప్పటికీ, ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు పీఆర్‌వో వ్యవస్థ ద్వారా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నాయి. రంగు, రంగు బ్రోచర్లు, పీఆర్‌వోలతో అడ్మిషన్లు జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. పది పరీక్షలు ముగియక ముందే అడ్మిషన్ల కోసం వేట, ముందుగానే సీటు రిజర్వేషన్ చేసుకుంటే ఫీజులో రాయితీ కల్పిస్తామని చెబుతున్నట్లు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండ పోయిందంటున్నారు. .
అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు : సులోచనరాణి, డీఐఈవో
ఫీజులపై ఎటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి ఏమీ అందలేదు. ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సౌకర్యాలు విద్యార్థులకు కల్పిస్తున్నాం. ప్రైవేట్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించకుంటే చర్యలు తీసుకుంటాం.