ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు ప్రారంభం
ABN , Publish Date - May 15 , 2026 | 12:21 AM
విద్యా విధానంలో భారీ మార్పుల్లో భాగంగా ఇంటర్మీడియట్‌ను రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేయాలనే ప్రభుత్వ ఆలోచనను వాయిదా వేయడంతో యథావిధిగా ఇంటర్ కోర్సులు కొనసాగనున్నాయి. దీంతో జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ నెల 31తో ముగియనున్న గడువు
జూన్ 1 నుంచి తరగతులు
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): విద్యా విధానంలో భారీ మార్పుల్లో భాగంగా ఇంటర్మీడియట్‌ను రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేయాలనే ప్రభుత్వ ఆలోచనను వాయిదా వేయడంతో యథావిధిగా ఇంటర్ కోర్సులు కొనసాగనున్నాయి. దీంతో జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.
ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వరంగ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియను శరవేగంగా పూర్తిచేసేందుకు అధికార యం త్రాంగం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇంటర్ బోర్డు ఆదేశాల ప్రకా రం కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులను తీసుకోనున్నారు. దరఖాస్తుల స్వీకరణ కు ఈ నెల 31వ తేదీ ఆఖరు గడువు కాగా, జూన్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అయితే పూర్తిస్థాయి ప్రవేశాల ప్రక్రియను పూర్తిచేసేందుకు జూన్ 30వ తేదీని చివరి గడువుగా విధించారు.
జిల్లాలో 64 జూనియర్ కళాశాలలు
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ నిర్వహణలోని వివిధ శాఖల గురుకులతో కలిపి మొత్తం 64 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 2025-26 విద్యాసంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన బాలబాలికలు ప్రవేశాలు పొందనన్నారు. జిల్లాలో ఈ ఏడాది 4,235 మంది విద్యార్థులు ఉత్తీర్ణులుకాగా, వీరిలో అత్యధికులు హైదరాబాద్, తదితర నగరాల్లోని కార్పొరేట్ స్థాయి జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకే మొగ్గుచూపుతున్నారు. అయితే పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు మాత్రం జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలతో పాటు గురుకుల, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు పొందనున్నారు. ఈ విద్యార్థులకు జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, ప్రభుత్వ శాఖల నిర్వహణలోని కేజీబీవీ, వివిధ గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు 33 వరకు ఉన్నాయి. అదే విధంగా ప్రైవేట్ నిర్వహణలో మరో 20 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. కళాశాలలోని ఒక్కో విభాగంలో గరిష్ఠంగా 88 మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేర రిజర్వేషన్ల రోస్టర్ ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు. బాలికలకు 33శాతం, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈబీసీలకు ఆయా రిజర్వేషన్ కేటాయింపుల ప్రకారం సీట్ల కేటాయింపులు ఉంటాయి. ఆ వర్గాలు ప్రవేశాలకు అందుబాటులేని పక్షంలో అధికారుల అనుమతులతో ఇతర వర్గాలకు ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశాల సంఖ్య పెంపునకు యత్నాలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాల పెంపునకు అధ్యాపకులు ఇప్పటి నుంచే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కళాశాల్లో విశాలమైన తరగతి గదులు, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రతీ విద్యార్థికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనున్నట్టు ప్రచారం చేస్తున్నారు. పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభతో నియామకమైన, నిష్ణాతులైన అధ్యాపకులతో ఉత్తమ విద్యాబోధన అందుబాటులో ఉంటోందని, ప్రైవేట్ కళాశాలల అబద్ధపు ప్రచారాలకు ఆకర్శితులుకాకుండా, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే ప్రవేశాలు కల్పించాలని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
మత్తుకు దూరంగా.. అఫిడవిట్ తప్పనిసరి
మాదక ద్రవ్య వినియోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థల నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలకు డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని విద్యార్థి, వారి తల్లిదండ్రులు అఫిడవిట్ (ప్రమాణ పత్రం) సమర్పించడాన్ని తప్పనిసరిచేశారు. దీంతో విద్యాసంస్థలను మాదకద్రవ్య రహిత సంస్థలుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అదే విధంగా యాంటీ డ్రగ్స్ ఆపరేషన్ టీమ్స్ సైతం ఈ ఏడాది ప్రతీ విద్యాసంస్థపై ప్రత్యేక నిఘా పెట్టనుంది. ఈ నేపథ్యంలో పాఠశాల నుంచి కళాశాలల్లో ప్రవేశించే టీనేజీ యువతకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా అఫిడవిట్ సమర్పణ తప్పనిసరి చేశారు.