Share News

యాసంగికి ఆరుతడే ప్రత్యామ్నాయం

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:09 AM

యాసంగి వరి సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. జిల్లాలో 28 శాతం లోటు వర్షపాతంతో భూగర్భజలాలు అడుగంటాయి.

యాసంగికి ఆరుతడే ప్రత్యామ్నాయం

ఇప్పటికే తగ్గించిన వరి సాగు

అందులో మరో సగానికిపైగా తగ్గింపు యోచన

రైతులకు ఆరుతడి పంటలే దిక్కు

ఎల్‌నినో ప్రభావం.. జిల్లాలో అడుగంటుతున్న భూగర్భజలాలు

17 మండలాలకు14 మండలాల్లో లోటే..

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): యాసంగి వరి సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. జిల్లాలో 28 శాతం లోటు వర్షపాతంతో భూగర్భజలాలు అడుగంటాయి. చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. హైదరాబాద్‌ నగరం మురుగునీటి ప్రవాహంపై ఆధారపడిన మూసీ కాల్వలకు కూడా పారడం లేదు. ఇప్పటికే వరిసాగు చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీ చేసింది. దీంతో రైతులకు ఆరుతడి పంటలే దిక్కయ్యాయి.

జిల్లాలో యాసంగి సీజన్‌లో పంటల సాగు సవాల్‌గా మారనుంది. ఈ పరిస్థితులకు అనుగుణంగానే జిల్లా వ్యవసాయ శాఖ యాసంగి సాగుపై అంచనా వేసిన కార్యాచరణ ప్రణాళిక సైతం అమలుకాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో కారణంగా కరువును తట్టుకోవడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించింది. గతేడాది యాసంగి సీజన్‌కంటే తగ్గిస్తూ రూపొందించిన సాగు ప్రణాళికలను సగానికి సగం తగ్గించాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వరిసాగు చేయవద్దని మంత్రులు పేర్కొనడంతో, ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూ నీటి లభ్యతకు అనుగుణంగానే కొత్త ప్రణాళికలను రూపొందించాలని సూచనలు చేసినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

రైతులను ఒప్పించడమే సవాల్‌

సంప్రదాయ వరిసాగుకు స్వస్తి చెప్పి, ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ఒప్పించడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దసవాల్‌గా మారనుంది. వరిసాగుకు అలవాటు పడిన రైతులను వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆరుతడి పంటల సాగుకు అవగాహన కల్పించడం, అందుకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచడం, పెట్టుబడులు సమకూర్చడం, మార్కెటింగ్‌ అవకాశాలకు భరోసా కల్పించడం వ్యవసాయ శాఖకు కీలకం కానుంది. అయితే ఈమేరకు ఇప్పటికే గ్రామాలవారీగా రైతులతో ఏర్పాటు చేసిన వాట్సప్‌ గ్రూపులు, సోషల్‌ మీడియా ఆధారంగా విస్తృతంగా ప్రచారంచేపట్టారు. అదేవిధంగా విత్తనాలు, ఎరువుల దుకాణాల డీలర్ల ద్వారా ఆరుతడి పంటల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని భావిస్తున్నారు.

జిల్లాలో 28శాతం లోటు వర్షం.. 10.58 మీటర్ల అడుగున భూగర్భజలాలు

జిల్లాలో దాదాపు గత దశాబ్దకాలంగా ఎప్పుడూ లేనివిధంగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ వర్షపాతం 577.20మి.మీల కాగా, వాస్తవంగా కురిసిన వర్షం కేవలం 414.5 మి.మీలు మాత్రమే. జిల్లాలో సగటు న సోమవారం నాటికి 28శాతం లోటు వర్షపాతం నమోదైంది. 17 మండలాల్లో 14 మండలాల్లో వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. దీంతో భూగర్భజల మట్టం సైతం సెప్టెంబరు మాసం నివేదిక ప్రకారం లోతునకు పడిపోయింది. గతేడాది 2025 సెప్టెంబరులో 7.15 మీటర్లుగా గల జలమట్టం ఈ ఏడాది సెప్టెంబరులో 10.58మీటర్లుగా ఉన్నట్లు భూగర్భజల వనరుల శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. వర్షపాతం లోటు, భూగర్భజలాల పరిస్థితి, సాగునీటి వనరుల లభ్యత ఆధారంగా ప్రభుత్వం కరువు మండలాల ప్రకటనకు కసరత్తు చేస్తోంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో రాబోయే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచి నీటి పొదుపు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచిస్తున్నారు.

తగ్గనున్న యాసంగిసాగు

యాసంగి సాగుకు ఇప్పటికే జిల్లా వ్యవసాయ శాఖ కార్యాచరణను సిద్ధంచేసింది. జిల్లాలో కరువు ఛాయలు, నీటి ఎద్దడిని అంచనా వేస్తూ ఎక్కువగా నీటిని వినియోగించే వరిసాగుకు కోతపెట్టింది. జిల్లాలో గతేడాది యాసంగి సీజన్‌లో వరిపైరు 3,46,454 ఎకరాల్లో సాగైంది. అయితే వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా అధికారులు ముందుగా తయారు చేసిన ఈ ఏడాది ప్రణాళికలో 1,39,100 ఎకరాలను తగ్గించి, 2,07354 ఎకరాలుగా అంచనాలను రూపొందించింది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ సాగు కూడా ఎక్కువేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కేవలం మూసీ పరివాహక ప్రాంతంలో ఎగువన హైదరాబాద్‌ నగర సరిసరాల్లో మున్ముందు కురిసే వర్షాలపై ఆధారపడి మాత్రమే వరిసాగు జరుగుతుందనే భావన వ్యక్తమవుతోంది. బోరుబావులు, ఇతర సాగునీటి కాల్వకింద వరిసాగుకు పూర్తిగా స్వస్తి చెప్పాలనే రైతులకు అవగాహన కల్పించడానికే అధికారులు సిద్ధమవుతున్నారు.

ఆరుతడి పంటలే దిక్కు

పంటల సాగుకు నీటి లభ్యత అనుకూలంగా లేని పరిస్థితుల్లో తక్కువనీరు. తక్కువ కాలవ్యవధిగల పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులు భావిస్తున్నారు. శనగ, వేరు శనగ, పెసర, మినుము, నువ్వులు, పొద్దుతిరుగుడు, జొన్న, సజ్జ, తదితర ఆరుతడి పంటలను ప్రత్యామ్నాయంగా అధికారులు సూచించనున్నారు. అయితే ఈ పంటల ఎంపికలో నేల స్వభావం, స్థానిక వాతావరణ పరిస్థితులు, అందుబాటులోగల నీటి వనరులు, మార్కెట్‌ డిమాండ్‌ వంటివి కూడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. నీటి వనరులు అనుకూలంగా ఉన్నచోట డ్రిప్‌ ఇరిగేషన్‌ ఆధారంగా కూరగాయలు, పండ్లతోటలను ఎక్కువగా ప్రోత్సహించాలని అధికారులు క్షేత్రస్థాయి వ్యవసాయాధికారులకు సూచిస్తున్నారు.

అయితే మామిడి, నిమ్మ తదితర శాశ్వత తోటల ఏర్పాటుకు ముందు నీటి లభ్యతపై స్పష్టత ఎంతో అవసరమని కూడా వివరిస్తున్నారు. కేవలం వరి సాగు తగ్గించడమే కాకుండా, రైతులకు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను అందుబాటులోకి తీసుకురావడం కూడా ఎంతో ముఖ్యమైంది అధికారులు అంటున్నారు.

Updated Date - Oct 13 , 2026 | 12:09 AM